Stock Market Update: భారీ నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు

అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్‌ (Stock Market) సూచీలు ఈవారాన్ని నష్టాలతో ప్రారంభమయ్యాయి.....

Published : 09 May 2022 09:42 IST

ముంబయి: అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్‌ (Stock Market) సూచీలు ఈవారాన్ని నష్టాలతో ప్రారంభించాయి. అమెరికా మార్కెట్లు గతవారాన్ని భారీ నష్టాలతో ముగించాయి. నేడు ఆసియా పసిఫిక్‌ మార్కెట్లు సైతం ప్రతికూలంగానే ట్రేడవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం ఎగబాకుతుండడం తద్వారా కేంద్ర బ్యాంకులు ద్రవ్య విధానాన్ని కఠినతరం చేస్తుండడం సూచీలను కలవరపెడుతోంది. మరోవైపు ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం, చైనాలో కఠిన లాక్‌డౌన్‌ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం నెమ్మదిస్తోందన్న అంచనాలు మదుపర్లను తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి. త్రైమాసిక ఫలితాలు కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడం కూడా మార్కెట్లకు ప్రతికూలాంశంగా మారింది.

ఈ పరిణామాల మధ్య ఉదయం 9:35 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 758 పాయింట్ల నష్టంతో 54,077.58 వద్ద, నిఫ్టీ (Nifty) 213 పాయింట్లు నష్టపోయి 16,198 వద్ద ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.77.32 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఒక్క పవర్‌గ్రిడ్‌ మాత్రమే లాభాల్లో పయనిస్తోంది. టెక్ మహీంద్రా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, రిలయన్స్‌, టాటా స్టీల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టీసీఎస్‌, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, ఎంఅండ్‌ఎం షేర్లు అత్యధికంగా నష్టపోతున్న వాటిలో ఉన్నాయి. 

* నేడు ఫలితాలు ప్రకటించనున్న ప్రముఖ కంపెనీలు: యూపీఎల్‌, పీవీఆర్‌, గ్రోద్రేజ్‌ అగ్రోవెట్‌, అన్ఫీబీమ్‌ అవెన్యూస్‌, దాల్మియా భారత్‌, గుజరాత్‌ నర్మదా వ్యాలీ ఫర్జిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌, 3ఐ ఇన్ఫోటెక్‌, ఆర్తీ డ్రగ్స్‌, బీఏఎస్‌ఎఫ్‌ ఇండియా, బోరోసిల్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, సీఎంఎస్‌ ఇన్ఫోసిస్టమ్స్‌, క్రాఫ్ట్స్‌మన్‌ ఆటోమేషన్‌, వేదాంత్‌ ఫ్యాషన్స్‌, సువెన్‌ ఫార్మా్స్యూటికల్స్‌, వీఎస్టీ టిల్లర్స్‌ అండ్‌ ట్రాక్టర్స్‌

ఈరోజు గమనించాల్సిన స్టాక్‌లు..

ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌, మైండ్‌ట్రీ: ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌, మైండ్‌ట్రీలను విలీనం చేస్తున్నట్లు.. ఈ రెండు సంస్థల్లో మెజారిటీ వాటా కలిగిన ఎల్‌ అండ్‌ టీ గ్రూప్‌ శుక్రవారం ప్రకటించింది.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌: ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 100 బి.డాలర్ల (దాదాపు రూ.7.7 లక్షల కోట్ల) వార్షికాదాయాన్ని అధిగమించిన ఏకైక దేశీయ కంపెనీగా అవతరించింది. గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఏకీకృత నికర లాభం రూ.16,203 కోట్లకు చేరుకుంది.

ఓఎన్‌జీసీ: 21 ప్రాంతాలకు వేసిన బిడ్లలో 18 ప్రదేశాల్లో గ్యాస్‌ నిల్వలను అన్వేషించి ఉత్పత్తి చేసేందుకు ఓఎన్‌జీసీ బిడ్లు విజయవంతంగా నిలిచాయి.

టాటా పవర్‌: మార్చితో ముగిసిన త్రైమాసికంలో టాటా పవర్‌ ఏకీకృత నికర లాభం 31శాతం పెరిగి రూ.632.37 కోట్లుగా నమోదైంది. ఆదాయం సైతం 16 శాతం ఎగబాకి రూ.12,085గా రికార్డయింది.

జెట్‌ ఎయిర్వేస్‌: మరికొన్ని నెలల్లో వాణిజ్య విమాన సేవల్ని ప్రారంభించనున్న జెట్‌ ఎయిర్వేస్‌కు కేంద్ర హోంశాఖ నుంచి సెక్యూరిటీ క్లియరెన్స్‌ లభించింది.

మాక్రోటెక్ డెవలపర్స్‌: ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న వివిధ ప్రాజెక్టుల్లో రూ.3800 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు కంపెనీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని