Stock Market: నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Stock Market: సెన్సెక్స్‌, నిఫ్టీ సూచీలు గురువారం నీరసంగా ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి.

Published : 15 Dec 2022 09:50 IST

ముంబయి: అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:32 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 241 పాయింట్ల నష్టంతో 62,436 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 70 పాయింట్లు కోల్పోయి 18,590 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.63 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ (Sensex)30 సూచీలో సన్‌ఫార్మా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, ఎంఅండ్‌ఎం, ఎన్‌టీపీసీ, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, ఎల్అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లాభాల్లో ఉన్నాయి. హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌యూఎల్‌, టీసీఎస్‌, టైటన్‌, టాటా స్టీల్‌, నెస్లే ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్‌, విప్రో, రిలయన్స్‌ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికాలో వడ్డీరేట్లను మరో 0.5 పెంచుతున్నట్లు ఫెడరల్‌ రిజర్వు ప్రకటించింది. వరుసగా అయిదో నెలా ద్రవ్యోల్బణం తగ్గి 7.1 శాతానికి పరిమితం కావడంతో కీలక రేట్ల పెంపులో వేగాన్ని తగ్గించింది. తాజా నిర్ణయంతో ఫెడ్‌ వడ్డీ రేటు 4.25-4.50 శాతం శ్రేణికి చేరింది. 2023 చివరి నాటికి మరో 0.75% వడ్డీ పెంపు ఉండొచ్చని ఫెడ్‌ పేర్కొనడం అక్కడి మార్కెట్లకు ప్రతికూలంగా మారింది. దీంతో అక్కడి మూడు ప్రధాన సూచీలు బుధవారం నష్టాలతో ముగిశాయి. అక్కడి నుంచి సంకేతాలు అందుకున్న ఆసియా పసిఫిక్‌ సూచీలు నేడు నష్టాల్లో కొనసాగుతున్నాయి. బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌, యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌లు నేడు (గురువారం) తమ పరపతి విధాన నిర్ణయాలను ప్రకటించనున్నాయి.

గమనించాల్సిన స్టాక్స్‌..

మహీంద్రా అండ్‌ మహీంద్రా: విద్యుత్‌ వాహనాల తయారీ-అభివృద్ధిపై వచ్చే 7-8 ఏళ్లలో రూ.10,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) బుధవారం వెల్లడించింది.

పూనావాలా ఫిన్‌కార్ప్‌: వాక్సిన్‌ దిగ్గజ సంస్థ సైరస్‌ పూనావాల గ్రూప్‌నకు చెందిన బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ ‘పూనావాలా ఫిన్‌కార్ప్‌’ గృహ విభాగమైన పూనావాలా హౌసింగ్‌ ఫైనాన్స్‌ను ప్రైవేట్‌ ఈక్విటీ దిగ్గజం టీపీజీ రూ.3,900 కోట్లకు కొనుగోలు చేసింది.

ఐఆర్‌సీటీసీ: ఐఆర్‌సీటీసీలో 5 శాతం వరకు వాటాను ప్రభుత్వం గురు, శుక్రవారాల్లో విక్రయించనుంది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ పద్ధతిలో (ఓఎఫ్‌ఎస్‌) జరిగే ఈ లావాదేవీలో ఒక్కో షేరుకు కనీస ధరగా రూ.680ను నిర్ణయించింది. బుధవారం బీఎస్‌ఈలో షేరు ముగింపు ధరైన రూ.734.70 కంటే ఇది 7.4 శాతం తక్కువ కావడం గమనార్హం. ఓఎఫ్‌ఎస్‌లో భాగంగా 2.5 శాతం వాటాకు సమానమైన 2 కోట్ల షేర్లతో పాటు, అధిక స్పందన లభిస్తే మరో 2.5 శాతం వాటాను విక్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది. అంటే మొత్తంగా 4 కోట్ల షేర్లు లేదా 5 శాతం వాటాను విక్రయించనుందన్న మాట. 4 కోట్ల షేర్లను  విక్రయించడం ద్వారా ప్రభుత్వానికి రూ.2,700 కోట్లు సమకూరొచ్చు. సంస్థాగత మదుపర్లకు గురువారం , రిటైల్‌ మదుపర్లకు శుక్రవారం ఇష్యూ ప్రారంభం అవుతుంది.

భారతీ ఎయిర్‌టెల్‌: దేశీయ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ లఖ్‌నవూ, ఉత్తర్‌ప్రదేశ్‌లో 5జీ ప్లస్‌ సేవల్ని ప్రారంభించింది. ఎలాంటి అదనపు రుసుము వసూలు చేయకుండానే ప్రస్తుతానికి వీటిని అందిస్తోంది. దశలవారీగా కస్టమర్లకు 5జీ ప్లాన్లు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. 4జీతో పోలిస్తే డేటా వేగం 20-30 రెట్లు అధికంగా ఉంటుందని పేర్కొంది.

ఎస్‌బీఐ: వ్యాపార విస్తరణ నిమిత్తం మార్చి 2024 వరకు రూ.10,000 కోట్లు సమీకరించాలని ఎస్‌బీఐ యోచిస్తోంది. అదనపు టైర్‌-1 బాండ్ల ద్వారా విక్రయించాలని భావిస్తోంది.

ఆస్ట్రాజెనెకా ఫార్మా ఇండియా: గగన్‌దీప్‌ సింగ్‌ బేడీ ఆస్ట్రాజెనెకా ఫార్మా ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ బాధ్యతల నుంచి వైదొలిగారు. ఆయన స్థానంలో సంజీవ్‌ పంచాల్‌ 2023 జనవరి 1 నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని