Stock Market Update: దేశీయ మార్కెట్లకు నాలుగోరోజూ తప్పని నష్టాలు!

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా నాలుగో రోజైన గురువారమూ నష్టాల్లో ముగిశాయి....

Published : 14 Jul 2022 15:45 IST

ముంబయి: అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా నాలుగోరోజూ నష్టాల్లో ముగిశాయి. చమురు ధరల తగ్గుదల, నిన్నటి నష్టాల నేపథ్యంలో ఉదయం సెషన్‌లో మార్కెట్‌లో కొనుగోళ్ల కళ కనిపించినప్పటికీ.. మధ్యాహ్నం తర్వాత అవి ఆవిరైపోయాయి. రూపాయి బలహీనత, అమెరికాలో ద్రవ్యోల్బణం 41 ఏళ్ల గరిష్ఠానికి చేరడం, ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం తప్పదన్న ఐఎంఎఫ్ అంచనాలు మదుపర్లను కలవరపెట్టాయి. చివరకు ఇంట్రాడే కనిష్ఠాల నుంచి కోలుకున్నప్పటికీ.. పూర్తిస్థాయి లాభాల్లోకి మాత్రం రాలేకపోయాయి.

ఉదయం సెన్సెక్స్‌ 53,688.62 వద్ద లాభాలతో ట్రేడింగ్‌ ప్రారంభించింది. ఇంట్రాడేలో 53,861.28 - 53,163.77 మధ్య కదలాడింది. చివరకు 98 పాయింట్లు నష్టపోయి 53,416.15 వద్ద స్థిరపడింది. 16,018.85 వద్ద సానుకూలంగా ట్రేడింగ్‌ ప్రారంభించిన నిఫ్టీ 16,070.85 వద్ద గరిష్ఠాన్ని, 15,858.20 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 28 పాయింట్లు నష్టపోయి 15,938.65 వద్ద నిలిచింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో రూపాయి మారకం విలువ రికార్డు గరిష్ఠమయిన రూ.79.88 వద్ద ట్రేడవుతోంది.

సెన్సెక్స్‌ 30 సూచీలో సన్‌ఫార్మా, డాక్టర్‌ రెడ్డీస్‌, మారుతీ, కొటాక్‌మహీంద్రా బ్యాంక్‌, టైటన్‌, రిలయన్స్‌, నెస్లే ఇండియా, పవర్‌గ్రిడ్‌, టాటా స్టీల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, టీసీఎస్‌, ఎస్‌బీఐ, విప్రో, ఐటీసీ, ఇన్ఫోసిస్‌, బజాజ్ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ అత్యధికంగా నష్టపోయిన షేర్ల జాబితాలో ఉన్నాయి.

మార్కెట్‌లోని ఇతర విశేషాలు..

* జూన్‌లో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం మే నెలతో పోలిస్తే స్వల్పంగా తగ్గి 15.2 శాతంగా నమోదైంది. అయినప్పటికీ రెండంకెల్లో నమోదవడం కలవరపరిచే అంశం.

* జూన్‌తో ముగిసిన త్రైమాసికపు ఫలితాలు నిరాశజనకంగా ఉండే అవకాశం ఉందన్న అంచనాల మధ్య ఎన్‌ఎండీసీ షేర్లు ఈరోజు 52 వారాల కనిష్ఠాన్ని తాకాయి. గత మూడు రోజుల్లో ఈ షేరు 7 శాతానికి పైగా పతనమైంది.

* మార్కెట్ల బలహీనతలోనూ ఈరోజు ఫార్మా స్టాక్స్‌ రాణించాయి. సన్‌ఫార్మా అత్యధికంగా రెండు శాతానికి పైగా ఎగబాకింది.

* ఐటీ ఇండస్ట్రీ ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో బలహీన మార్జిన్లు ప్రకటించే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో ఐటీ స్టాక్స్‌లో అమ్మకాలు వెల్లువెతుతున్నాయి. ఈరోజు కూడా ఐటీ రంగ షేర్లలో ఒత్తిడి కనిపించింది. విప్రో అత్యధికంగా నాలుగు శాతానికి పైగా నష్టపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని