పొదుపు చేయడానికి ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇలా చేయండి

సొంతంగా డబ్బును పొదుపు చేయాలనే ఆలోచన కంటే ఆటోమేషన్ సహాయంతో పొదుపు చేయడం మంచిది..

Published : 22 Dec 2020 15:32 IST

సొంతంగా డబ్బును పొదుపు చేయాలనే ఆలోచన కంటే ఆటోమేషన్ సహాయంతో పొదుపు చేయడం మంచిది

​​​​​​​మీ డబ్బుని ఎలాంటి ప్రయోజనం కోసం వెచ్చించకుండా కేవలం పొదుపు ఖాతాలోనే ఉంచినట్లైతే ప్రస్తుతం ఉన్న జీవన శైలిలో మీ చిన్న చిన్న కోరికలను తీర్చుకోవడం కష్టతరం అవొచ్చు. జీవితం ఎప్పుడూ ఒకలా ఉండదు. కొన్ని సందర్భాల్లో మనని అనేక కష్టాల్లోకి తోసివేస్తుంది. అలాంటి సమయంలో మీ వద్ద సరిపడా డబ్బు ఉన్నట్లైతే ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. మీ వద్ద తక్కువ మొత్తంలో డబ్బు ఉన్నట్లయితే, అనవసర ఖర్చులు చేయకుండా ఉండడానికి మీరు ఎక్కువగా ప్రయత్నిస్తారు. సొంతంగా డబ్బును పొదుపు చేయాలనే ఆలోచన నుంచి బయటికి వచ్చి ఆటోమేషన్ సహాయంతో పొదుపు చేయడం ప్రారంభించడం మంచిది. ఇలా చేయడానికి ఒక మార్గం ఉంది. మీరు సంపాదించిన డబ్బులో కొంత మొత్తాన్ని మీ పొదుపు ఖాతాలోనే ఉంచి, అక్కడి నుంచి ఆటోమాటిక్ గా ఏదైనా పెట్టుబడి పెట్టెలా ఏర్పాటు చేసుకోవడం మంచిది. ఇలా చేయడం ద్వారా కొంత కాలానికి పెద్ద మొత్తంలో డబ్బు మీకు చేరుతుంది. ఇలా కాకుండా మీరే సొంతంగా డబ్బు దాచుకోవాలని ప్రయత్నిస్తే మంచి ఫలితాలు పొందలేరు. ఏదో ఒక అవసరానికి వాటిని వినియోగిస్తారు. అందుకే ఆటోమేటిక్ విధానం ద్వారా డబ్బును పొదుపు చేయడానికి ప్రయత్నించండి.

ఉదాహరణ: మీ ఉద్యోగ భవిష్య నిధి

మీరు పనిచేస్తున్న సంస్థ మీ జీతంలోని కొంత మొత్తాన్ని తీసివేసి దానికి అదనంగా అంతే మొతాన్ని జత చేసి మీ ఉద్యోగ భవిష్య నిధి ఖాతాలో జమ చేస్తారు. అది ఇప్పుడు చిన్నమొత్తమే అయినప్పటికీ దానిని వదిలేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత పెద్ద మొత్తంగా తయారవుతుంది. ఉద్యోగ భవిష్య నిధికి వచ్చే వడ్డీ రేటు తక్కువే అయినప్పటికీ దీర్ఘ కాలంలో అది మంచి విలువ కలిగి ఉంటుంది.ఒకవేళ మీరు పనిచేస్తున్న సంస్థ మీ జీతంలో నుంచి ఎలాంటి మొత్తాన్ని తీసుకోమని చెప్పి ప్రతి నెలా మీరే జీతంలోని కొంత మొత్తాన్ని పొదుపు చేసుకోమని చెప్పినట్లైతే అప్పుడు డబ్బు మీ నియంత్రన మొత్తం మీ చేతిలోనే ఉంటుంది. ఉద్యోగ భవిష్య నిధి మీకు వర్తిస్తునందుకు చాలా గొప్పగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే మీరు సంపాదించే జీతంలో కొంత మొత్తం ఆటోమాటిక్ గా పొదుపు ఖాతాలోకి చేరుతుంది. ఉద్యోగ భవిష్య నిధిని ఎంచుకునే స్వేచ్ఛ ఉద్యోగికి ఇవ్వడం మంచి పరిణామం కాదు. అలా స్వేచ్ఛను ఇచ్చినట్లయితే చాలా మంది దీనిని ఎంచుకోరు.

ఒక‌ అధ్యయనం ప్రకారం అమెరికాలో ఉద్యోగులు 401కే జాబితాలో (మన దేశంలో ఉద్యోగ భవిష్య నిధి మాదిరిగానే) నమోదు చేసుకోవాలని అక్కడి ప్రభుత్వం తెలిపింది. ఒకవేళ సదరు జాబితాలో చేరడం వారికి ఇష్టం లేకపోతే దానిలో చేరకుండా ఉండే అవకాశం కూడా ప్రభుత్వం కల్పించింది. అప్పుడు ఈ జాబితాలో నమోదు చేసుకున్న వారి సంఖ్య చాలా తక్కువ. ఎప్పుడైతే ప్రభుత్వం 401కే జాబితాలో క‌చ్చితంగా నమోదు అవ్వాలని నిర్ణయం తీసుకుందో అప్పుడు జాబితాలో నమోదైన వారి సంఖ్య రెండింతలు అయింది. దీనికి కారణం నమోదు ప్రక్రియను ఆటోమేటిక్ చేయడమే.

ఆటోమేటిక్ పొదుపుకు ఉదాహరణ:

ఆరు నెలల క్రితం సునీత అనే మహిళ ఒక రికరింగ్ డిపాజిట్ ను ప్రారంభించింది. ఈ పథ‌కం ప్రకారం ఒక సంవత్సరం పాటు నెలకు రూ. 15,000 చొప్పున ఆమె ఖాతాలో డబ్బు ఆటోమేటిక్ గా డిడెక్టు అవుతుంది. ఎనిమిది నెలల తరువాత సునీత ఆన్లైన్ లో తన ఖాతాను తెరిచిచూడగా ఆమె ఖాతాలో రూ. 1.20 లక్షలు ఉన్నాయి. అంత పెద్ద మొత్తంలో డబ్బు చూసేసరికి ఆమె ఒక్కసారిగా ఆనందంలో మునిగిపోయింది. దీనికి కారణం ఆటోమేటిక్ సేవింగ్. ప్రతి నెలా తన జీతం నుంచి రూ. 15,000 కట్ అవడం ఆమె పరిశీలిస్తూనే ఉంది. ఆమె నెలవారీ ఖర్చులు, షాపింగ్, బిల్లులు మిగిలిన జీతం నుండి చెల్లించేది. అలాగే ఆమె ఖర్చులన్నిటినీ మిగిలిన జీతంతోనే సర్దుబాటు చేసుకోవడం వలన ఆమె ఖాతాలో అంత మొత్తం పొదుపైంది.

డబ్బు అనేది ప్రవహించే నీటిలాంటిది…

ఎందుకు మీరు తగినంత డబ్బు ఆదా చేయలేకపోతున్నారని ఎప్పుడైనా ఆలోచించారా?
ప్రతి సంవత్సరం మీ జీతం పెరుగుతున్నప్పటికీ మీ అవసరాలు కూడా దానికి తగట్టు పెరుగుతున్నాయి.
మీరు కొంత డబ్బును ఆదా చేస్తున్నప్పటికీ, మీ పూర్తి సామర్థ్యాన్ని చేరుకున్నానని అనుకున్నారా? డబ్బనేది ప్రవహించే నీరులాంటిది. మీరు దానికి ఒక దిశను చూపకపోతే, అది దాని సొంత దిశలో పయనిస్తుంది. జీవితం మిమల్ని అనేక రకాల ఖర్చులు, అవసరాలు, కోరికలలోకి నెట్టివేస్తుంది.

రాబడి - ఖర్చులు = ఆదా

ఎక్కువ మంది ప్రతీ నెలా “ఆదాయం - ఖర్చులు = పొదుపు” అనే సూత్రాన్ని ఆచరిస్తారు. ఈ సూత్రం సహజమైనది అలాగే లాజిక్ తో కూడుకున్నది. మొదట మీకు వచ్చిన ఆదాయంలో ఖర్చులు తీసివేయగా మిగిలిన మొత్తాన్ని పొదుపు చేయాలని భావిస్తారు. కానీ అది తప్పు. మొదట కొంత మొత్తాన్ని పొదుపు చేసుకుని మిగిలిన మొత్తాన్ని మీ నెల ఖర్చులకు వినియోగించుకోవాలి. ఒకవేళ మీరు నెల నెలా కొంత మొత్తాన్ని ఆదా చేసుకోకపోతే పైన తెలిపిన సూత్రం మీ జీవితాన్ని కష్టాల్లోకి నెట్టివేస్తుంది.

ప్రతి నెలా కొంత మొత్తం మీ బ్యాంకు ఖాతాలో జమ చేసేలా చూసుకోండి. అలా ప్రతి నెలా చేసినట్లయితే కొంత కాలానికి మీ బ్యాంకు ఖాతాలో ఎక్కువ మొత్తంలో డబ్బు చేరుతుంది. అప్పుడు ఆ మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే మంచిది. ఈ విధంగా ప్రతి నెలా కొంత మొత్తాన్ని ఆదా చేసుకున్నట్లైతే మీ పొదుపు ఖాతాలో ఉన్న డబ్బుతో మీ భార్య, పిల్లల అవసరాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా తీర్చవచ్చు. సూత్రాన్ని "ఆదాయం - పొదుపు = ఖర్చులు"గా మార్చండి

వీటిని అమలు చేయండి…

  • ప్రతి నెలా మీరు కనీసం ఎంత మొత్తంలో పొదుపు చేయాలో నిర్ణయించుకోండి. అది 10 శాతం, 20 శాతం, 30 శాతం ఎంతైనా కావచ్చు. మొదట మీరు చిన్న మొత్తంతో పొదుపు ప్రారంభించి తరువాత దాన్ని పెంచుకుంటూ వెళ్లొచ్చు.

  • ఒకవేళ మీ నెల జీతం 2 వ తేదీన మీ పొదుపు ఖాతాలో జమ అవుతుందనుకుంటే అప్పుడు మీ సిప్, రీకరింగ్ డిపాజిట్ తేదీలను 4 వ తేదీన గానీ 5 వ తేదీన గానీ డెబిట్ అయ్యేలా ఏర్పాటు చేసుకోండి.

  • ఆటోమేషన్ ద్వారా పొదుపు చేసుకోండి. అది మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది.

  • ఒకవేళ మీకు అత్యవసరంగా డబ్బు అవసరమైనట్లయితే మీరు వీటిని ఉపయోగించుకోవచ్చు.

జీవితంలో కొన్ని మార్పులు మన జీవితానికి కొత్త దిశను అందిస్తాయి. “ఆదాయం - పొదుపు = ఖర్చులు” గా మీ పొదుపు సమీకరణాన్ని మార్చాలని నిర్ణయించుకుంటే, అది మీ ఆర్థిక జీవితాన్ని సానుకూలంగా ఉంచుతుంది.ఈ సూత్రాన్ని పాటించినట్లయితే మీ ఆర్ధిక జీవనం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని