LIC IPO: ఇప్పట్లో జోక్యం చేసుకోలేం : సుప్రీం కోర్టు

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఐపీఓ (LIC IPO) వ్యవహారంలో వెంటనే జోక్యం చేసుకోలేమని భారత అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.

Published : 12 May 2022 18:21 IST

మధ్యంతర ఉపశమన ఆదేశాలకు నిరాకరణ

దిల్లీ: లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఐపీఓ (LIC IPO) వ్యవహారంలో వెంటనే జోక్యం చేసుకోలేమని భారత అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. వాణిజ్య పెట్టుబడులు, ఐపీఓ అంశాల్లో వెంటనే ఉపశమనం కల్పించలేమన్న సుప్రీం ధర్మాసనం.. ఈ తరుణంలో ఎల్‌ఐసీ ఐపీఓ విషయంలోనూ మధ్యంతర ఉపశమనం కల్పించేందుకు విముఖత చూపించింది. ఎల్‌ఐసీ ఐపీఓ షేర్ల కేటాయింపును నిలుపుదల చేయాలంటూ దాఖలైన పలు పిటిషన్లను పరిశీలించిన సమయంలో సుప్రీం ధర్మాసనం ఈవిధంగా వ్యాఖ్యానించింది.

ఎల్‌ఐసీ ఇటీవల ప్రకటించిన ఐపీఓకు మదుపర్ల నుంచి మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. షేర్ల కేటాయింపు మాత్రం గురువారం జరుగుతోంది. ఈ క్రమంలో షేర్ల కేటాయింపుని నిలుపుదల చేయాలంటూ కొందరు పాలసీ హోల్డర్లు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. వీటిని జస్టిస్‌ చంద్రచూడ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహలతో కూడిన ధర్మాసనం పరిశీలించింది. అనంతరం ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకోలేమన్న త్రిసభ్య ధర్మాసనం.. ఎటువంటి మధ్యంతర ఉపశమనం కల్పించలేమని స్పష్టం చేసింది. వీటిపై తమ స్పందన తెలియజేయాలంటూ కేంద్ర ప్రభుత్వంతోపాటు ఎల్‌ఐసీకి నోటీసులు జారీచేసింది. ముఖ్యంగా పిటిషనర్‌ లేవనెత్తిన అంశాలపై నాలుగు వారాల్లో సమాధానం చెప్పాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఇక ఇదే అంశంపై రాజ్యంగ ధర్మాసనం విచారించాలన్న పిటిషన్లనూ ఈ కేసుకు జతచేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

ఇదిలాఉంటే, లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా చేపట్టిన పబ్లిక్‌ ఇష్యూ (LIC IPO) మే 4న మొదలై 9వ తేదీ వరకు కొనసాగింది. ఇందులో భాగంగా పాలసీదారులు, ఉద్యోగుల కోసం పత్యేకంగా షేర్లను కేటాయించిన ఎల్‌ఐసీ, వారికి కొంత రాయితీ కల్పించింది. ఇప్పటికే బిడ్లు పూర్తికాగా పబ్లిక్‌ ఇష్యూకు సంబంధించిన షేర్ల కేటాయింపు మాత్రం నేడు (మే 12న) జరుగుతోంది. ఐపీఓ ద్వారా సంస్థలో దాదాపు 22కోట్ల షేర్లను విక్రయించి రూ.21వేల కోట్లను సమకూర్చుకునే ప్రయత్నం చేసిన ఎల్‌ఐసీ.. దేశ స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో అతిపెద్ద ఐపీఓగా నిలిచింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని