Suzuki katana: మార్కెట్లోకి సుజుకీ స్పోర్ట్స్‌ బైక్‌.. ధర ₹13.61 లక్షలు

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకీ ఇండియా కొత్త స్పోర్ట్స్‌ బైక్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. గ్లోబల్‌ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ‘కటానా’ను భారత్‌కు తీసుకొచ్చింది

Published : 04 Jul 2022 17:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకీ ఇండియా కొత్త స్పోర్ట్స్‌ బైక్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. గ్లోబల్‌ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ‘కటానా’ను భారత్‌కు తీసుకొచ్చింది. జపాన్‌కు చెందిన పురాతన కత్తిని స్ఫూర్తిగా తీసుకుని ఈ బైక్‌కు కటానా అని పేరు పెట్టారు. దీని ధరను కంపెనీ రూ.13.61 లక్షలు (ఎక్స్‌షోరూం)గా నిర్ణయించింది. ఇందులో 999 సీసీ లిక్విడ్‌ కూల్డ్‌ డీఓహెచ్‌సీ ఇన్‌లైన్‌ ఫోర్‌ సిలిండర్‌ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 152 పీఎస్‌ పవర్‌ను, 106 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సిక్స్‌ గేర్‌ బాక్స్‌ అమర్చారు.

దేశంలో బిగ్‌ బైక్స్‌ విభాగంలో తమ పోర్ట్‌ఫోలియోను విస్తరించడంలో భాగంగా కటానాను తీసుకొచ్చినట్లు సుజుకీ మోటార్‌ సైకిల్‌ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్‌ సతోషి ఉచితా తెలిపారు. గతేడాది జరిగిన ఆటో ఎక్స్‌పోలో ఈ బైక్‌ను ప్రదర్శనకు ఉంచిన అనంతరం దీని గురించి చాలా మంది బైక్‌ ప్రియులు ఆరా తీశారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భారత్‌కు ఈ బైక్‌ను తీసుకొచ్చినట్లు తెలిపారు. తనదైన కల్ట్‌ ఫాలోయింగ్‌ను ఈ బైక్‌ సొంతం చేసుకుంటుందని విశ్వాసం వ్యక్తంచేశారు. ఈ బైక్‌ మెటాలిక్‌ మెస్టిక్‌ సిల్వర్‌, మెటాలిక్‌ స్టీలర్‌ బ్లూ రంగుల్లో లభ్యమవుతుంది. ఇందులో సుజుకీ ఇంటెలిజెంట్‌ రైడర్‌సిస్టమ్‌, సుజుకీ ట్రాక్షన్‌ కంట్రోల్‌ సిస్టమ్‌, సుజుకీ డ్రైవ్‌ మోడ్‌ సెలెక్టర్‌, లో ఆర్‌పీఎం అసిస్ట్‌, డ్యూయల్‌ ఛానల్‌ ఏబీఎస్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. యాక్టివ్‌, బేసిక్‌, కంఫర్ట్‌ అంటూ మూడు రకాల త్రోటల్‌ కంట్రోల్స్‌ ఉంటాయి. భారత్‌లో విడుదలైన బీఎండబ్ల్యూ ఎఫ్‌ 900 ఎక్స్‌ఆర్‌, కవాస్కీ నింజా1000 ఎస్‌ఎక్స్‌కు ఈ బైక్‌ పోటీ ఇవ్వనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని