JRD Tata: ఎయిరిండియా విమానాన్ని మొదట నడిపినప్పుడు.. జేఆర్‌డీ చెంత ఏమున్నాయంటే..?

దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత తిరిగి తన పుట్టింటికి చేరుకుంది విమానాయాన సంస్థ ఎయిరిండియా. టాటాల కుటుంబానికి చెందిన జహంగీర్ రతన్‌జీ దాదాభోయ్‌(జేఆర్‌డీ) టాటా.. ఈ సంస్థకు పునాది వేశారు.

Published : 12 Feb 2022 19:49 IST

దిల్లీ: దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత తిరిగి తన పుట్టింటికి చేరుకుంది విమానయాన సంస్థ ఎయిరిండియా. టాటాల కుటుంబానికి చెందిన జహంగీర్ రతన్‌జీ దాదాభోయ్‌(జేఆర్‌డీ) టాటా.. ఈ సంస్థకు పునాది వేశారు. 1932లో ‘టాటా ఎయిర్ సర్వీసెస్’ పేరుతో దీనిని ప్రారంభించారు. ‘టాటా ఎయిర్ మెయిల్’ పేరుతో కరాచీ నుంచి బొంబాయికి తొలి విమానాన్ని స్వయంగా నడిపారు. అలాగే దేశీయ పైలట్‌గా లైసెన్సు తీసుకున్న తొలి వ్యక్తి కూడా ఆయనే. కాగా, ఆయన మొదటి ప్రయాణంలో ఆయన వెంట ఏమేమీ ఉన్నాయో టాటా సంస్థ ఇన్‌స్టాగ్రాం వేదికగా వెల్లడించింది. 

‘ఫిబ్రవరి 10, 1929న జేఆర్‌డీ టాటా భారత్‌లో మొట్టమొదటి కమర్షియల్ ఏవియేషన్ సర్టిఫికేట్ పొందారు. 15 సంవత్సరాల వయస్సు నుంచి కన్న కలల్ని నిజం చేసుకున్నారు. కరాచీ నుంచి ముంబయి వరకు జరిపిన తొలి ప్రయాణంలో ఆయన చెంత గాగుల్స్‌ ఉన్నాయి. ప్రతిసారి విమాన ప్రయాణంలో అవి ఆయనతో కచ్చితంగా ఉంటాయి. అలాగే నిశ్శబ్దంగా ప్రార్థించారు. అంతేగాకుండా నంబర్ వన్ అని రాసి ఉన్న ఏవియేటర్ సర్టిఫికేట్‌ను తన ప్రయాణంలో ఉంచుకున్నారు’ అని టాటా కంపెనీస్ ఇటీవల ఇన్‌స్టాలో పోస్టు పెట్టింది. 

ఇదిలా ఉండగా.. దాదాపు 89 ఏళ్ల కిందట స్థాపించిన ఈ కంపెనీ 68 ఏళ్ల పాటు టాటాలకు దూరంగా ఉంది. నష్టాల్లో కూరుకుపోయిన ఆ సంస్థను రూ.18 వేల కోట్లు వెచ్చించి, టాటాలు బిడ్డింగ్‌లో తిరిగి తమ వశం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే యాజమాన్య హక్కుల బదిలీ కూడా పూర్తయింది.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని