కోవిడ్ -19 కారణంగా చేసే ఈపీఎఫ్ ఉపసంహరణపై పన్ను లేదు..

ఇప్పటి వరకు ఈపీఎఫ్ఓ 1.37 లక్షల క్లెయిమ్లను ప్రాసెస్ చేసింది, దీని విలువ సుమారు రూ. 2.8 బిలియన్...

Published : 22 Dec 2020 17:20 IST

ఇప్పటి వరకు ఈపీఎఫ్ఓ 1.37 లక్షల క్లెయిమ్లను ప్రాసెస్ చేసింది, దీని విలువ సుమారు రూ. 2.8 బిలియన్

కోవిడ్ -19 మహమ్మారి కారణంగా చాలా మంది వేతన జీవులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడిని పరిగణనలోకి తీసుకుని, మార్చి 20, 2020న ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) ఖాతా నుంచి నగదు ఉపసంహరణకు ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలను అనుమతించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసిన తరువాత ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ సంస్థ (ఈపీఎఫ్ఓ) 1.37 లక్షల క్లెయిమ్లను ప్రాసెస్ చేసింది, దీని విలువ సుమారు రూ. 2.8 బిలియన్. నగదు చెల్లింపులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

సాధారణంగా, మీ సర్వీసు ఐదు సంవత్సరాలు పూర్తవకముందే ఈపీఎఫ్ ఖాతా నుంచి ఉపసంహరించుకునే నిధులపై పన్ను వర్తిస్తుంది, అయితే, వైద్య అత్యవసర పరిస్థితి, ఉద్యోగి లేదా యజమాని తమ వ్యాపారాన్ని మూసివేసినప్పుడు లేదా యజమాని నియంత్రణకు మించిన ఇతర కారణాల వలన తప్ప మిగిలిన కారణాల వలన నగదు ఉపసంహరించుకున్నట్లైతే, దానిపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఒకవేళ మీరు కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ఈపీఎఫ్ ఖాతా నుంచి నిధులను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకుంటే, వాటిపై పన్ను మినహాయింపు ఉంటుంది.

మీరు ఎంత, ఎలా నిధులను ఉపసంహరించుకోవచ్చో కింద చూద్దాం…

మీరు ఎంత మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు?

మీరు మూడు నెలల జీతం (ప్రాథమిక వేతనం, డీఏ) లేదా మీ ఖాతాలోని మొత్తం ఈపీఎఫ్ బ్యాలెన్స్‌లో 75 శాతం, ఏది తక్కువగా ఉంటే దానిని ఉపసంహరించుకోవచ్చు. ఉదాహరణకు మీరు చివరిసారిగా డ్రా చేసిన ప్రాథమిక జీతం ప్లస్ డీఏ నెలకు రూ. 30,000 అనుకుంటే, అలాగే మీ ఖాతాలోని ఈపీఎఫ్ బ్యాలెన్స్ రూ. 3 లక్షలు అనుకుందాం. మూడు నెలల ప్రాథమిక + డీఏ, అనగా రూ. 90,000 (రూ. 30,000 • 3) లేదా ఈపీఎఫ్ బ్యాలెన్స్‌లో 75 శాతం, అనగా రూ. 2,25,000 (రూ. 3 లక్షల్లో 75 శాతం)

పైన తెలిపిన ఉదాహరణలో, మీరు ఈపీఎఫ్ ఖాతా నుంచి రూ. 90,000 ఉపసంహరించుకోవడానికి అర్హులు. కరోనా వ్యాప్తి కారణంగా మీరు ఉపసంహరించుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు తక్కువ మొత్తం అవసరమైతే, మీరు దానికి అనుగుణంగా అభ్యర్థించవచ్చు.

ఉపసంహరణ ఎలా చేయాలి?

మొదటగా చందాదారుడు ఈ-సేవా పోర్టల్‌ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ సందర్శించండి. మీ యూఏఎన్, పాస్‌వర్డ్, క్యాపచ్చి కోడ్‌ను నమోదు చేసి లాగిన్ అవ్వండి. ఆన్‌లైన్ సర్వీసెస్ కు వెళ్లి క్లెయిమ్ ను ఎంచుకోండి (ఫారం-31, 19,10 సీ, 10డీ). మీ స్క్రీన్ పై పేరు, పుట్టిన తేదీ, మీ ఆధార్ నంబర్ చివరి నాలుగు అంకెలు వంటి వివరాలతో క్రొత్త వెబ్‌ పేజీ కనిపిస్తుంది. వెబ్‌పేజీ మీ బ్యాంక్ ఖాతా వివరాలను కూడా చూపుతుంది. మీ బ్యాంకు ఖాతా చివరి నాలుగు నెంబర్లను నమోదు చేసి, వెరిఫై ఆప్షన్ పై క్లిక్ చేయండి. అనంతరం మీ స్క్రీన్‌పై ‘సర్టిఫికేట్ ఆఫ్ అండర్‌టేకింగ్’ ఇవ్వమని అడుగుతూ పాప్-అప్ కనిపిస్తుంది. మీ బ్యాంక్ ఖాతా చివరి నాలుగు అంకెలను ధృవీకరించిన తర్వాత, ‘ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్’ పై క్లిక్ చేయండి. డ్రాప్ డౌన్ మెనూ నుంచి మీరు ‘పీఎఫ్ అడ్వాన్స్ (ఫారం 31)’ ఎంచుకోవాలి. మీరు పీఎఫ్ ఉపసంహరించుకోవడానికి గల కారణాన్ని డ్రాప్ డౌన్ మెను నుంచి ‘అవుట్ బ్రేక్ అఫ్ ప్యాండమిక్ (COVID-19)’ గా ఎంచుకోవాలి. అవసరమైన మొత్తాన్ని నమోదు చేసి, స్కాన్ చేసిన చెక్ కాపీని అప్‌లోడ్ చేసి, మీ చిరునామాను నమోదు చేయండి. ఆధార్‌లో నమోదు చేసిన మీ మొబైల్ నంబర్‌కు వన్‌ టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) వస్తుంది. ఎస్ఎంఎస్ ద్వారా మీరు అందుకున్న ఓటీపీని నమోదు చేయండి. ఓటీపీని సమర్పించిన తర్వాత, క్లెయిమ్ అభ్యర్థన కూడా సమర్పించబడుతుంది. మీ వివరాలు మ్యాచ్ అయ్యి, మీ క్లెయిమ్ ను ఈపీఎఫ్ఓ ​​అంగీకరించిన వెంటనే డబ్బు మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని