TCS: వర్క్‌ ఫ్రమ్‌ ఆఫీస్‌.. అందుకే..!: టీసీఎస్‌ సీఈఓ

TCS CEO on work frome office: ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించడానికి గల కారణాన్ని వివరించారు టీసీఎస్‌ సీఈఓ. పని సంస్కృతి అలవడాలంటే ఉద్యోగులు హాజరు కావాల్సిందేనని పేర్కొన్నారు.

Published : 21 Feb 2024 14:29 IST

TCS | ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా సమయంలో వర్క్‌ఫ్రమ్‌ సంస్కృతికి వేగంగా మళ్లిన టెక్‌ కంపెనీలు.. ఇప్పుడు మళ్లీ కార్యాలయాలకు రావాలని ఉద్యోగులను కోరుతున్నాయి. కొన్ని సంస్థలు ఉద్యోగులను వారానికి మూడు రోజులు రావాలంటుండగా.. ఐటీ దిగ్గజం టీసీఎస్‌ (TCS) మాత్రం మునుపటిలా పూర్తిగా కార్యాలయాల నుంచే పనిచేయాలని సూచిస్తోంది. ఈ విషయంలో ఉద్యోగులకు ఇప్పటికే డెడ్‌లైన్‌ ఇచ్చింది. దీని వెనుక కారణాన్ని కంపెనీ సీఈఓ కృతి వాసన్‌ తాజాగా వివరించారు. ఇటీవల నాస్కామ్‌ నిర్వహించిన ఓ ఈవెంట్‌లో దీనిపై ఆయన మాట్లాడారు.

రిమోట్‌ వర్క్‌ సంస్కృతికి పూర్తిగా చరమగీతం పాడాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుందని కృతి వాసన్‌ వివరించారు. ఎప్పటిలానే కార్యాలయాల నుంచి ఉద్యోగులు పనిచేయాలని కోరుకుంటున్నామని చెప్పారు. తోటి ఉద్యోగులను అనుసరించడం ద్వారా కొత్త విషయాలు నేర్చుకోవడం సాధ్యపడుతుందన్నారు. ఇది రిమోట్‌ వర్క్‌తో ఎంతమాత్రం సాధ్యపడదన్నారు. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌, హైబ్రిడ్‌ వర్క్‌ మోడల్‌ వల్ల వ్యక్తిగతంగానే కాకుండా సంస్థకూ నష్టదాయకమని పేర్కొన్నారు.

‘ఆఫీసుకు రాకుంటే చర్యలు’.. ఉద్యోగులకు TCS ఆఖరి ఛాన్స్‌!

విలువలకు టీసీఎస్‌ అధిక ప్రాధాన్యం ఇస్తుందని కృతి వాసన్‌ పేర్కొన్నారు. టీమ్‌ వర్క్‌తోనే అలాంటివి అందిపుచ్చుకోవడం సాధ్యపడుతుందన్నారు. ఆన్‌లైన్‌ లేదా వర్చువల్‌ మీటింగ్‌ల ద్వారా అలాంటివి నేర్చుకోవడం సాధ్యమవ్వదన్నారు. కరోనా సమయంలోనే 30-40 శాతం మంది అసోసియేట్లు తమ కంపెనీలో చేరారని చెప్పారు. అలాంటి వారు కార్యాలయాలకు రాకుండా విధులు నిర్వహిస్తే.. విలువలు, పని సంస్కృతి అలవర్చుకోవడం సాధ్యం కాదని చెప్పారు. సంప్రదాయ పని విధానాన్నే టీసీఎస్‌ విశ్వసిస్తుందని, తమ క్లయింట్లు కూడా ఇదే కోరుకుంటున్నారని పేర్కొన్నారు.

మరోవైపు నియామకాల గురించి కూడా మాట్లాడారు. గిరాకీ పరిస్థితులకు తగ్గట్లుగా నియామకాలు చేపట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. నియామకాలను కొనసాగిస్తామని, భర్తీ వేగంలో మాత్రం మార్పు ఉండే అవకాశం ఉందని తెలిపారు. జెనరేటివ్‌ కృత్రిమ మేధ (జెన్‌ ఏఐ) విభాగంలో అపార అవకాశాలు ఉన్నందున.. ప్రతి ఒక్కరికి దీని అవసరం ఉంటుందన్నారు. అయితే మానవుల విశ్లేషణాత్మక ఆలోచనాధోరణిని ఏ సాంకేతికతతోనూ భర్తీ చేయలేమని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని