LIC IPO: ఎల్‌ఐసీ పాలసీదారులైనప్పటికీ.. ఐపీఓలో వీరికి రాయితీ షేర్లు లభించవు!

జీవిత బీమా రంగ దిగ్గజం భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ ఆఫ్‌ ఇండియా) పబ్లిక్‌ ఇష్యూకి రాబోతోంది....

Updated : 15 Feb 2022 18:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జీవిత బీమా రంగ దిగ్గజం భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ ఆఫ్‌ ఇండియా) పబ్లిక్‌ ఇష్యూకి రాబోతోంది. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లూ పాలసీలకు ప్రీమియం చెల్లిస్తున్న పాలసీదారులు ఎల్‌ఐసీలో వాటాదారులుగా మారేందుకూ అవకాశం ఉంది. రాయితీలో షేర్లను దక్కించుకునేందుకు రిటైల్‌ విభాగంలో తన పాలసీదారుల కోసం ఎల్‌ఐసీ ప్రత్యేకంగా షేర్లను జారీ చేయబోతోంది. ఇందుకోసం ఇష్యూ పరిమాణంలో 10 శాతం షేర్లను కేటాయించనుంది. వీటికి షేరు ధరలో కొంత రాయితీ లభించనుంది. అది ఎంత శాతం అనే విషయం మాత్రం ప్రస్తుతానికి తెలియదు.

అయితే, చాలా మంది పాలసీదారులు ఈ ఐపీఓలో పాల్గొనేందుకు ఆసక్తి చూపించే అవకాశం ఉంది. కానీ, అందరికీ రాయితీతో కూడిన షేర్లను పొందే అవకాశం లేదు. కొంతమంది పాలసీదారులకు మాత్రమే సంస్థ ఈ అవకాశం కల్పించింది. రాయితీతో కూడిన షేర్ల కోసం బిడ్‌ దాఖలు చేసే అర్హతలేని పాలసీదారులెవరో చూద్దాం..!

* దంపతులిద్దరికీ కలిపి ఒకే డీమ్యాట్‌ ఖాతా (ఇద్దరూ పాలసీదారులైనప్పటికీ) ఉంటే వారు రాయితీతో కూడిన షేర్లకు బిడ్‌ వేయడానికి అర్హులు కాదు. సెబీ ఐసీడీఆర్‌ నిబంధనల ప్రకారం.. ఒక డీమ్యాట్‌ ఖాతా నుంచి ఇద్దరు లబ్ధిదారులు ఐపీఓకి దరఖాస్తు చేసుకోవడానికి వీలు లేదు. ప్రాథమిక ఖాతాదారుడు మాత్రమే ఇష్యూలో పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది.

* ప్రస్తుతం యాన్యుటీ పొందుతున్న యాన్యుటీ పాలసీదారుడి జీవిత భాగస్వామి ఈ ఐపీఓలో పాల్గొనేందుకు అవకాశం లేదు.

* పాలసీదారుడు కచ్చితంగా వారి వ్యక్తిగత డీమ్యాట్‌ ఖాతా నుంచే ఐపీఓలో పాల్గొనాలి. భాగస్వామి, కొడుకు, కూతురు... ఇలా ఇతరుల ఖాతా నుంచి దరఖాస్తు చేసుకోవడానికి అనుమతి లేదు.

* ఎన్నారై పాలసీదారులు రాయితీతో కూడిన షేర్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి వీలు లేదు. కేవలం భారత్‌లో నివసిస్తున్న పాలసీదారులు మాత్రమే ఐపీఓకి దరఖాస్తు చేసుకోడానికి అర్హులు.

* ఏదైనా పాలసీకి నామినీగా ఉన్న వ్యక్తులకు రాయితీ షేర్లు లభించవు.

* గ్రూప్ పాలసీలు కాకుండా ఇతర ఏ పాలసీల్లో సభ్యత్వం ఉన్నా.. రాయితీతో కూడిన షేర్లకు బిడ్‌ దాఖలు చేయొచ్చు.

* పాలసీదారులు కాకుండా ఇతరులు రిటైల్‌ ఇన్వెస్టర్‌ లేదా నాన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బిడ్డర్‌ కింద ఐపీఓకి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, ఈ విభాగాల కింద దరఖాస్తు చేసుకునే వారికి రాయితీ మాత్రం లభించదు.

ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూ కోసం మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రభుత్వం ముసాయిదా పత్రాలను ఆదివారం దాఖలు చేసింది. మార్చిలో ఈ ఐపీఓ స్టాక్‌ మార్కెట్లౖకు వచ్చే అవకాశం ఉంది. ఎల్‌ఐసీలో 5 శాతం వాటాకు సమానమైన 31.6 కోట్లకు పైగా రూ.10 ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేర్లను ప్రభుత్వం విక్రయించనుంది. రూ.63,000 కోట్ల వరకు ఖజానాకు చేరతాయని మర్చంట్‌ బ్యాంకర్ల అంచనా. తద్వారా ఇదే దేశీయంగా అతిపెద్ద ఇష్యూగా నిలవనుంది. ఇష్యూ పూర్తిగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) రూపంలో జరగనుంది. సంస్థలో 100 శాతం వాటా (632.49 కోట్ల షేర్లను) కలిగిన ప్రభుత్వం 5 శాతం వాటాను ఇలా విక్రయించబోతోంది. కొత్తగా షేర్లు ఏమీ జారీ చేయడం లేదు.

మీరు ఎల్‌ఐసీ పాలసీదారులై, ఐపీఓలో పాల్గొనాలంటే..

* మీ శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌)ను ఎల్‌ఐసీ పాలసీకి జత చేయాలి. అయితే, పాలసీకి ఆధార్‌నూ జత చేయడం ద్వారా.. ఎల్‌ఐసీ ఆన్‌లైన్‌ వెబ్‌సైటులో అనేక లావాదేవీలు చేసేందుకు సులువవుతుంది.

* పాన్‌ను నమోదు చేసేందుకు.. ముందుగా ఎల్‌ఐసీ అధీకృత వెబ్‌సైట్‌  https://licindia.in/ వెబ్‌సైటులోకి వెళ్లండి. అక్కడ ఆన్‌లైన్‌ పాన్‌ రిజిస్ట్రేషన్‌ అనే లింకు కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేసి, అక్కడున్న సమాచారాన్ని జాగ్రత్తగా చదవండి. అడిగిన వివరాలను నమోదు చేయండి. ఓటీపీ ద్వారా వాటిని అధీకృతం చేయండి. ఆ తర్వాత మీ పాలసీ- పాన్‌ అనుసంధానం అయ్యిందా లేదా చూసుకునేందుకూ అక్కడే ఏర్పాటు ఉంది. దీనికన్నా ముందు ఎల్‌ఐసీ వెబ్‌సైటులో మీ పాలసీ సంఖ్య ఆధారంగా ఆన్‌లైన్‌ యూజర్‌ ఖాతాను సృష్టించుకోండి. దీనివల్ల మీ పని ఇంకా సులభం అవుతుంది.

* ఇక ఐపీఓలో షేర్ల కోసం దరఖాస్తు చేయాలంటే డీమ్యాట్‌ ఖాతా ఉండాల్సిందే. పాన్‌, ఆధార్‌, బ్యాంక్‌ ఖాతా వివరాలు.. వీటితో డీమ్యాట్‌ ఖాతా తీసుకోవడం ఎంతో సులభం. మీకు డీమ్యాట్‌ ఖాతా లేకపోతే.. చివరి నిమిషం వరకూ ఎదురుచూడకుండా మీకు నచ్చిన స్టాక్‌ బ్రోకర్‌ ద్వారా వీలైనంత వెంటనే దీన్ని తీసుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని