Updated : 17 Jan 2022 17:30 IST

Banking: బ్యాంకు ఖాతాలు ఎన్ని ఉండొచ్చు?

వివిధ‌ కార‌ణాల‌తో వేర్వేరు బ్యాంకుల్లో ఖాతాల‌ను తెరవడం మంచిది కాద‌ని చెప్తున్నారు ఆర్థిక నిపుణులు. కొంతమంది వేత‌న ఖాతాతో పాటు, గృహ, బంగారం, రుణాల కోసం, క్రెడిట్ కార్డు ఆఫ‌ర్ల కోసం, డీమ్యాట్ ఖాతా కోసం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో ఖాతాలు నిర్వ‌హిస్తుంటారు. కొంత మందికి ఒక‌టి కంటే ఎక్కువ‌ వేత‌న ఖాతాలు ఉంటాయి. పాత ఉద్యోగాన్ని వ‌దిలేసి కొత్త ఉద్యోగంలో చేరిన‌ప్పుడు ఖాతా ప్రారంభిస్తారు. కానీ పాత ఖాతా మూసివేయ‌రు. ఈ కార‌ణంగా ఎక్కువ బ్యాంకు ఖాతాలుంటాయి. అయితే, అన్ని ఖాతాల్లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండ‌లేం. ఖాతాల్లో క‌నీస నిల్వ లేకుంటే ఛార్జీలు ప‌డ‌తాయి. ఛార్జీల నుంచి త‌ప్పించుకునేందుకు ఎంతో కొంత డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.

ఎక్కువ ఖాతాలు ఉంటే..

ఎక్కువ ఖాతాలు ఉంటే అన్ని ఖాతాల్లో ఎంతో కొంత డ‌బ్బు ఉంచాలి. చాలా వ‌ర‌కు బ్యాంకులు రూ. 5000 నుంచి రూ.10 వేల క‌నీస నిల్వ (Minimum Balance) నిర్వ‌హించాల‌ని చెబుతున్నాయి. లేదంటే పెనాల్టీ ప‌డుతుంది. అంటే మీకు ఐదు బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయ‌నుకుంటే రూ. 25,000 నుంచి రూ.50,000 వేల వ‌ర‌కు ఖాతాల్లో లాక్ అయిపోతుంది. అస్స‌లు వినియోగంలో లేని ఖాతాను మూసివేయ‌డ‌మే మంచిది. బ్యాంకుల్లో ఉన్న క‌నీస నిల్వ‌ల‌పై 3-4 శాతం వార్షిక వ‌డ్డీ ల‌భిస్తుంది. అదే మొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లో పెడితే దానికంటే రెట్టింపు వ‌డ్డీ ల‌భిస్తుంది. అంతేకాకుండా పొదుపు ఖాతాల‌పై ఇత‌ర ఛార్జీలు, అంటే డెబిట్ కార్డ్ ఛార్జీలు వంటివి వ‌ర్తిస్తాయి. మీ వేత‌న ఖాతా లేదా జీరో బ్యాలెన్స్ పొదుపు ఖాతాలో వ‌రుస‌గా మూడు నెల‌లు ఎలాంటి డిపాజిట్ చేయ‌క‌పోతే ఆ త‌ర్వాత అది సాధార‌ణ పొదుపు ఖాతాగా మారుతుంది. అప్పుడు క‌చ్చితంగా క‌నీస నిల్వ‌లను నిర్వ‌హించాల్సి ఉంటుంది.

ఖాతా నుంచి వ‌రుస‌గా రెండేళ్ల కంటే ఎక్కువ కాలం లావాదేవీలు చేయ‌క‌పోతే దానిని బ్యాంకులు ప‌నిచేయ‌ని ఖాతాగా ప‌రిగ‌ణిస్తాయి. అప్పుడు ఖాతా నుంచి డెబిట్ కార్డ్, చెక్కులు, ఆన్‌లైన్, మొబైల్ లావాదేవీలు జ‌రిపేందుకు వీలుండ‌దు. ఆ ఖాతాను యాక్టివేట్ చేసేందుకు రాత‌పూర్వ‌కంగా అభ్య‌ర్థించాల్సి ఉంటుంది. ఒక‌వేళ అది ఉమ్మ‌డి ఖాతా అయితే ఖాతాదారులంద‌రి స‌మ్మ‌తి తెలియ‌జేయాలి.

దీంతో ప్ర‌తి ఖాతాలో ఉన్న డ‌బ్బులతో ఎలాంటి రాబ‌డి రాక‌పోగా, ఆదాయ ప‌న్ను రిట‌ర్నుల స‌మ‌యంలో అన్ని ఖాతాల వివ‌రాలు అందించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ లావాదేవీల కోసం అన్ని పాస్‌వ‌ర్డ్‌లు గుర్తుంచుకోవ‌డం కూడా ఇబ్బందిగా మారుతుంటుంది.

మ‌రి ఏం చేయాలి?

బ్యాంకు ఖాతాలు ఎంత త‌క్కువ‌గా ఉంటే అంత మంచిది. వేత‌న ఖాతా, కుటుంబ స‌భ్యుల‌తో క‌లిపి ఉమ్మ‌డి ఖాతా ఉంటే సరిపోతుంది. డ‌బ్బు అత్యవ‌స‌రం అయిన‌ప్పుడు మీరు అందుబాటులో లేక‌పోతే ఇత‌ర ఖాతాదారులు డ‌బ్బు తీసుకునే అవ‌కాశం ఉంటుంది. మ‌రీ అంత‌గా కావాల‌నుకుంటే మ‌రొక ఖాతాను శాశ్వ‌త ఖాతాగా ఉంచుకోవ‌చ్చు. ఉద్యోగం మారిన‌ప్పుడు వేత‌న ఖాతాలు మారుతుంటాయి, అప్పుడు కూడా వీలయితే శాశ్వత ఖాతానే వేతన ఖాతాగా మార్చుకోవచ్చు. పెట్టుబ‌డుల కోసం శాశ్వ‌త ఖాతాను ఉప‌యోగించాలి. దీంతో పాటు మీకు తెలియ‌కుండానే ఇత‌ర ఛార్జీలు చెల్లిస్తుంటారు. ఎన్ని ఖాతాలుంటే అన్ని కార్డులు ఉప‌యోగించాల్సి ఉంటుంది. కొత్త ఖాతా ప్రారంభించిన‌ప్పుడు అవ‌స‌రం లేని పాత ఖాతాల్ని మూసేయ‌డం మంచిది.

ఇప్పుడు ఒక ఈపీఎఫ్ ఖాతాకు ఒక యూఏఎన్ ఇస్తారు. ఉద్యోగం మారిన‌ప్పుడు అదే యూఎన్‌తో ఖాతాలోని మొత్తాన్ని ఇత‌ర సంస్థ‌కు బ‌దిలీ చేసుకోవ‌చ్చు. అదేవిధంగా మ్యూచువ‌ల్ ఫండ్లు, పీపీఎఫ్ వంటి పెట్టుబ‌డుల‌కు ఒకే ఖాతాను ఉప‌యోగించాలి. వేర్వేరు బ్యాంకుల‌తో అనుసంధానం చేస్తే గంద‌ర‌గోళంగా ఉంటుంది. మీ ముఖ్య‌మైన, శాశ్వ‌తంగా కొన‌సాగించే బ్యాంకు ఖాతాను వీటికి అనుసంధానం చేయాలి. ఉద్యోగం మారిప్పుడు కొత్త ఖాతాకు ఆన్‌లైన్ ద్వారా న‌గ‌దు ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకొని పాత ఖాతాను మూసేయాలి.

ఎన్ని ఖాతాలుండాలి?

ఆర్థిక జీవితానికి బ్యాంకు ఖాతా, పాన్‌, ఆధార్ చాలా కీల‌క‌మైన ఆధారాలు. ప‌న్ను చెల్లింపుల నుంచి బిల్లు చెల్లింపులు, ఇత‌ర ఏ ప‌నికైనా పాన్, ఆధార్‌, బ్యాంకు ఖాతా త‌ప్ప‌నిస‌రి. త‌క్కువ ఖాతాలు ఉంటే లావాదేవీలు, బ్యాంకు కార్య‌క‌లాపాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు చూసుకునేందుకు సుల‌భంగా ఉంటుంది. రెండు లేదా మూడు అంత‌కంటే ఎక్క‌వ ఖాతాలు ఉండ‌టం ఆర్థిక జీవ‌నానికి సరైన‌ది కాద‌ని నిపుణులు సూచిస్తున్నారు.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని