Parag Agrawal: ట్విటర్‌ డీల్‌ నిలిపివేతపై పరాగ్‌ కీలక వ్యాఖ్యలు

ట్విటర్‌ (Twitter)ను కొనుగోలు చేసే ప్రణాళికను ‘తాత్కాలికంగా నిలిపివేసిన’ట్లు టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) చేసిన ప్రకటనపై సీఈఓ పరాగ్‌ అగర్వాల్‌ (Parag Agrawal) స్పందించారు.....

Published : 14 May 2022 12:00 IST

శాన్‌ఫ్రాన్సిస్కో: ట్విటర్‌ (Twitter)ను కొనుగోలు చేసే ప్రణాళికను ‘తాత్కాలికంగా నిలిపివేసిన’ట్లు టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) చేసిన ప్రకటనపై సీఈఓ పరాగ్‌ అగర్వాల్‌ (Parag Agrawal) స్పందించారు. ఈ డీల్‌ కచ్చితంగా పూర్తవుతుందని తాను విశ్వసిస్తున్నట్లు తెలిపారు. అయినప్పటికీ.. ఇతర ఊహించని పరిణామాలకూ తాము సన్నద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఒకవేళ డీల్‌ మధ్యలోనే ఆగిపోయినా తాము అన్నింటికీ సిద్ధంగా ఉన్నామని పరోక్షంగా సంకేతాలిచ్చారు.

ట్విటర్‌లో ఇద్దరు ఉన్నతాధికారులను పరాగ్‌ (Parag Agrawal) ఇటీవల తొలగించిన విషయం తెలిసిందే. మరోవైపు కొత్త నియామకాలనూ నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎలాగూ కంపెనీ యాజమాన్యం మారుతున్నప్పుడు ఇంకా వ్యయ నియంత్రణ చర్యలెందుకని కొంతమంది తనని ప్రశ్నిస్తున్నారని పరాగ్‌ తెలిపారు. ‘‘ఈ పరిశ్రమ ప్రస్తుతం చాలా సవాళ్లను ఎదుర్కొంటోంది. డీల్‌ను అడ్డం పెట్టుకొని కీలక నిర్ణయాలను తీసుకోకుండా ఉండలేను. నేనే కాదు.. ట్విటర్‌ బాగు కోసం సంస్థలోని ఇతర నాయకులెవరూ అలాంటి ఆలోచన చేయబోరు’’ అని సమాధానమిచ్చినట్లు పరాగ్‌ తెలిపారు.

ట్విటర్‌ (Twitter)ను 44 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.3.3 లక్షల కోట్ల)తో కొనుగోలు చేసే ప్రణాళికను ప్రస్తుతానికి ‘తాత్కాలికంగా నిలిపివేసిన’ట్లు టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) శుక్రవారం ప్రకటించారు. ట్విటర్‌లో స్పామ్‌, నకిలీ ఖాతాల సంఖ్య కచ్చితంగా ఎంత ఉందన్న విషయాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇలాంటి ఖాతాల సంఖ్యను కంపెనీ తక్కువగా చూపుతోందా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. కంపెనీ రోజువారీ వినియోగదార్లలో 5% కంటే తక్కువే స్పామ్‌ లేదా తప్పుడు ఖాతాలు ఉన్నట్లు తొలి త్రైమాసిక నివేదికలో ట్విటర్‌ అంచనా వేసినట్లు వచ్చిన వార్తను టెస్లా అధిపతి లింక్‌ చేశారు. ఈ అంశం వల్ల ట్విటర్‌ కొనుగోలు ఒప్పందం రద్దవుతుందా లేదా అన్నది స్పష్టం కావడం లేదు. ‘ఇప్పటికీ కొనుగోలుకు కట్టుబడే ఉన్నా’నని మాత్రం మస్క్‌ ట్వీట్‌ చేశారు.

డీల్‌ రద్దు సులభమేమీ కాదు..

ఈ డీల్‌ను రద్దు చేసుకోవడం అంత సులభమైన అంశమేమీ కాదని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ రద్దు చేసుకుంటే 1 బిలియన్‌ డాలర్లు పరిహారంగా చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే న్యాయపరమైన చిక్కులూ తప్పవని పేర్కొన్నారు. మొత్తంగా మస్క్‌ బిలియన్‌ డాలర్ల నష్టాన్ని భరించాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని