Uber: ఆస్ట్రేలియాలో ట్యాక్సీ డ్రైవర్లకు ఉబర్‌ రూ.1,475 కోట్ల పరిహారం

Uber: ఉబర్‌ వల్ల ఉపాధి కోల్పోయామంటూ కోర్టును ఆశ్రయించిన ట్యాక్సీ డ్రైవర్లకు రూ.1,475 కోట్ల పరిహారం చెల్లించేందుకు ఆ కంపెనీ అంగీకరించింది.

Updated : 18 Mar 2024 12:00 IST

సిడ్నీ: ఆస్ట్రేలియాలో ట్యాక్సీ డ్రైవర్లకు 178 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.1,475 కోట్లు) చెల్లించేందుకు ప్రముఖ క్యాబ్‌ సేవల సంస్థ ఉబర్‌ (Uber) అంగీకరించింది. దీంతో దీర్ఘకాలంగా కొనసాగుతున్న న్యాయ వివాదానికి తెరపడింది. ఉబర్‌ తమ దేశంలోకి ప్రవేశించడంతో ఉపాధి కోల్పోయామంటూ దాదాపు 8,000 మంది ట్యాక్సీ డ్రైవర్లు కోర్టును ఆశ్రయించారు. దీనిపై కొంతకాలంగా విచారణ కొనసాగుతోంది. పరిహారం చెల్లించడానికి కంపెనీ నిరాకరిస్తూ వస్తోంది. సోమవారం ఈ కేసు విక్టోరియా సుప్రీంకోర్టులో విచారణకు రావాల్సి ఉంది. కానీ, ఉబర్‌ ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో అది జరగకపోవచ్చని ట్యాక్సీ డ్రైవర్ల పక్షాన న్యాయవాది మైఖేల్ డోనెల్లీ వెల్లడించారు.

2012లో ఆస్ట్రేలియాలోకి ప్రవేశించిన ఉబర్‌ (Uber) చాలా వేగంగా సేవలను విస్తరించినట్లు న్యాయవాది మైఖేల్ తెలిపారు. దీని వల్ల అద్దె ట్యాక్సీలను నడిపే చాలా మంది ఉపాధి కోల్పోయారని పేర్కొన్నారు. వారికి పరిహారం చెల్లించాలని అనేకసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ.. ఉబర్‌ నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. దీంతో కోర్టును ఆశ్రయించామని తెలిపారు. డ్రైవర్ల డిమాండ్‌కు సామాన్య పౌరులు సైతం మద్దతు తెలిపారని చెప్పారు.

పదేళ్ల క్రితం తాము కార్యకలాపాలు ప్రారంభించినప్పుడు ప్రపంచంలో ఎక్కడా క్యాబ్‌ సేవలపై నియంత్రణలు లేవని ఉబర్‌ (Uber) తెలిపింది. ఆస్ట్రేలియాలో తమ కార్యకలాపాల కారణంగా రవాణా సౌకర్యాలు మెరుగయ్యాయని పేర్కొంది. వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించాయని చెప్పింది. 2018 నుంచి వివిధ ప్రాంతాల్లో పరిహార ఒప్పందాలను కుదుర్చుకుంటున్నట్లు వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని