నిర్మాణంలో ఉన్నా ఇల్లా, సిద్ధంగా ఉన్న ఇల్లా – ఏది కొనుగోలు చేయడం మంచిది?
ఇళ్లు కొనుగోలు చేసేటప్పుడు చేసుకునే ఏ ఒప్పందమయినా వ్రాత పూర్వకంగా ఉండేలా చూసుకోవాలి
ప్రతీ ఒక్కరూ తమకు ఒక సొంత ఇల్లు ఉండాలని కోరుకుంటారు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఎలాంటి ఇల్లు కొనుగోలు చేయాలి?నివసించేందుకు సిద్ధంగా ఉన్న ఇల్లా..లేక నిర్మాణంలో ఉన్నా ఇల్లా? అనేది చాలా మంది మదిలో గందరగోళాన్ని సృష్టిస్తుంది. అయితే రెండింటిలోనూ కొన్ని అనుకూలతలు, ప్రతికూలతలు ఉన్నాయి. అయితే, వాటి గురించి పూర్తిగా తెలుసుకుని ఇంటిని కొనుగోలు చేయడం మంచిది.
నిర్మాణంలో ఉన్న ఇంటిని కొనుగోలు చేయడంలో ప్రతికూలతలు:
1. నిర్మించడంలో ఆలస్యం, ల్యాండ్ అనుమతులు, వివాదాలు..
అనుకున్న రోజుకు ప్రాజెక్ట్ పనులు పూర్తి చేసి కొనుగోలుదారునికి అప్పగించడం అనేది మనం అరుదుగా చూస్తుంటాం. నిర్మాణంలో ఉన్న ఇంటిని కొనుగోలు చేయడంలో ఉన్న అతి పెద్ద సమస్య అనుకున్న సమయానికి నిర్మాణం పూర్తికాక పోవడం. వివిధ కారణాలతో నిర్మాణం పనులు ఆలస్యం అవుతుంటాయి. ఆస్తిని నిర్మించి ఇచ్చేందుకు సగటున బిల్డర్ ఇచ్చే గడువు తేది 2 సంవత్సరాలైతే, నిర్మాణం పూర్తయ్యేందుకు 4 నుంచి 5 సంవత్సరాలు కూడా పట్టచ్చు. అంత ఎక్కువ కాలం వేచి ఉండడం వల్ల కొనుగోలు దారులు నిరాశకు గురవుతారు.
ప్రధానంగా భూ వివాదం, సరిపడినంత నగదు లేకపోవడం, అధికారుల నుంచి అనుమతులు తీసుకోవడం వంటి విషయాలలో జాప్యం జరుగుతుంది. అధికారుల వద్ద నుంచి అన్ని ముఖ్యమైన, అవసరమైన అనుమతులు లభించిన తరువాత మాత్రమే బిల్డర్లు నిర్మాణపు పనులు మొదలు పెట్టాలి. కానీ కొంత మంది బిల్డర్లు నిర్మాణపు పనులు మొదలుపెట్టిన తరువాత కొన్ని అనుమతుల తీసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అందువల్ల నిర్మాణంలో ఉన్న ఇంటిని కొనుగోలు చేసే ముందు భూముల యజమాన్య వివరాలు, అవసరమైన అనుమతులు ఉన్నాయా లేదా అనే వివరాలు తెలుసుకోవాలి. మరీ ముఖ్యంగా చిన్న బిల్డర్ల వద్ద ఈ విషయాలను తప్పనిసరిగా తనీఖీ చేసుకోవాలి. ఇల్లు నిర్మించడం 1 నుంచి 2 సంవత్సరాలు ఆలస్యం అయినా చివరకు మీ చేతికి ఆస్తి వస్తుంది. కానీ 5 నుంచి 10 సంవత్సరాలు వేచియున్న తరువాత కూడా ఆస్తి తమ చేతికి రాని కొనుగోలుదారులు చాలా మంది ఉన్నారు.
2. బ్రోచర్లో ఉన్న విధంగా నిర్మించకపోవచ్చు..
నిర్మాణంలో ఉన్న ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు ఎదురయ్యే మరొక పెద్ద సమస్య మీకు వాగ్దానం చేసిన లేదా నమూనా ప్లాట్‌లో చూపించిన విధంగా ఇంటిని పొందలేకపోవడం. నమూనా ప్లాట్లను కొనుగోలుదారులకు నచ్చే విధంగా అందంగా అలంకరిస్తారు. వాటిని చూసి నిర్మాణంలో ఉన్న గృహాలపై అంచనాలను పెంచుకుని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతారు. కానీ, ఇంటిని స్వాధీన పరిచినప్పుడు మీరు చూసిన నమూనా ఇంటికి, కొనుగోలు చేసిన ఇంటికి చాలా వ్యత్యాసం ఉండొచ్చు. కొన్ని కొన్ని సార్లు లేఅవుట్లు మారే అవకాశం కూడా ఉంటుంది. నిర్మాణం పూర్తి అయిన తరువాత మీరు కొనుగోలు చేసిన కొత్త ఇంటిని మీరు ఇష్టపడకపోవచ్చు.
3. నోటి మాటగా మాత్రమే చెప్తారు..
ఉదాహరణకి కొంత మంది బిల్డర్లు, నిర్మాణం పూర్తయిన 3 నుంచి 6 నెలల తరువాత మున్సిపాల్టీ నీటి సరఫారా అందుబాటులోకి వస్తుందని తప్పుడు వాగ్దానాలు చేస్తుంటారు. కానీ, ఒకసారి సొసైటీలోని మొత్తం గృహాలను విక్రయించిన తరువాత ఆ సమస్య గురించి పట్టించుకోరు. బిల్డర్, నిర్మించిన గృహాలను విక్రయించడమే లక్ష్యంగా ఈ విధమైన వాగ్దానాలను చేస్తాడు. విక్రయించడం పూర్తయిన తరువాత కొనుగోలుదారుడు ఎదుర్కొనే కష్టనష్టాలతో అతనికి ఏ విధమైన ఆసక్తి ఉండదు. చాలాసార్లు పార్కింగ్, స్విమింగ్ పూల్, జిమ్ వంటి అదనపు సౌకర్యాలను కల్పిస్తున్నామని నోటి మాటగా చెప్తుంటారు. నోటి మాటగా చెప్పే అలాంటి వాగ్దానాల ఆదారంగా ఇంటిని కొనుగోలు చేస్తే చివరికి మీరు ఏమి చేయలేని పరిస్థితి రావచ్చు. అందువల్ల ఒప్పందం వ్రాత పూర్వకంగా ఉండేలా చూసుకోవాలి.
4. నాణ్యత విషయంలో రాజీ పడవచ్చు..
నిర్మాణంలో ఉన్న ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు వచ్చే మరొక ముఖ్యమైన సమస్య నాణ్యత. నిర్మాణానికి ఉపయోగించే పదార్ధాలు, డోర్లు, కిటికీలకు వినియోగించే కలప, విద్యుత్ సాకెట్లు, స్విచ్‌లు వంటి వాటిలో తక్కువ నాణ్యత వున్న వాటిని ఉపయోగించవచ్చు. ప్లంబింగ్, పార్కింగ్ స్థలం, పిల్లల ఆట స్థలం, ఇతర సదుపాయాలు ఆశించిన విధంగా ఉండకపోవచ్చు. మీరు ఈ విషయాల గురించి ఫిర్యాదు చేస్తే నగదు సరిపోలేదు, నిర్మాణపు ఖర్చులు పెరిగాయి, తొందరలో చేస్తాం అని బిల్డర్లు చెప్తుంటారు.
5. స్వాధీన సర్టిఫికేట్ తీసుకోకపోతే ఆదాయపు పన్ను..
ఇంటిని స్వాధీనం చేసుకున్న అనంతరం పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా మీరు చెల్లించే ఈఎమ్ఐల పై వెంటనే పన్ను మినహాయింపు పొందవచ్చు. స్వాధీన సర్టిఫికేట్ తీసుకోకపోతే పన్ను మినహాయింపులు కోల్పోతారు. ఈఎమ్ఐపై పన్ను మినహాయింపు కోసం ఇంటిని కొనుగోలు చేసేవారు ఉన్నారు. కానీ వారికి ఈ విషయం గురించి అవగాహన లేకపోవచ్చు. అంతేకాకుండా 1 నుంచి 2 సంవత్సరాలు నిర్మాణం ఆలస్యం అయితే మరిన్ని సమస్యలు ఎదుర్కోవలసి రావచ్చు.
6. ఈఎమ్ఐతో పాటు అద్దె చెల్లించాలి..
నిర్మాణంలో ఉన్న ఇంటిని కొనుగోలు చేస్తే.. నివాసానికి అనుకూలంగా ఉండదు కాబట్టి నిర్మాణం పూర్తైయ్యే వరకు అద్దె ఇంటిలోనే ఉండాలి. రుణ ఈఎమ్ఐతో పాటు అద్దె కూడా చెల్లించాలి. దీంతో రెండూ భారంగా మారవచ్చు. ఇంటి నిర్మాణం ఒకటి, రెండు ఏళ్లు ఆలస్యం అయితే ఈ భారం మరింత ఎక్కువ అవుతుంది.
నిర్మాణంలో ఉన్న ఆస్తిని కొనుగోలు చేయడంలో అనుకూలతలు:
1. నెమ్మదిగా ప్రారంభించి, సౌకర్యవంతంగా చెల్లింపులు చేయవచ్చు..
గృహరుణం తీసుకునే వారు నిర్మాణంలో ఉన్న ఆస్తిని కొనుగోలు చేయడం ద్వారా సులభంగా చెల్లింపులు చేయవచ్చు. సాధారణంగా ఆస్తి ధరలో 10-20 శాతం డౌన్ పేమెంట్ ను చెల్లించి మిగిలిన మొత్తాన్ని ప్రతి నెల ఈఎమ్ఐల రూపంలో చెల్లించాలి. ఈ విధానం ద్వారా చాలా మందికి తమ సొంత ఇంటి కల నెరవేరుతుంది. కొన్ని సంవత్సరాల తరువాత కొనుగోలుదారుని జీతం పెరిగినా, ఈఎమ్ఐ విలువ మాత్రం ముందు చెల్లించిన మొత్తానికి సమానంగానే ఉంటుంది. గృహ రుణం ద్వారా మాత్రమే కాకుండా కన్ష్ట్రక్షన్ లింక్డ్ చెల్లింపు పద్దతి ద్వారా కూడా నిర్మాణంలో ఉన్న ఇంటిని కొనుగోలు చేయచ్చు.
2. కావలసిన ఫ్లోర్, డిజైన్లను ఎంచుకోవచ్చు..
నిర్మాణంలో ఉన్న ఇంటిని కొనుగోలు చేస్తే నిర్మాణ ప్రదేశాన్ని, నచ్చిన ఫ్లోర్‌ను ఎంచుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే నిర్మాణం పూర్తి అయిన తరువాత ప్లాట్లు అప్పటికి విక్రియించేస్తారు కాబట్టి మనకు కావలసిన ఫ్లోర్ లో ఫ్లాట్ దొరికే అవకాశం తక్కువగా ఉంటుంది. అలాగే, మీకు నచ్చిన డిజైన్లను చేయించుకునే అవకాశమూఉంటుంది.
3. ధర పెరిగే అవకాశం ఉంటుంది..
గేటెడ్ కమ్యూనిటీలు నేటి ట్రెండ్ అనే చెప్పాలి. వీటిని సాధారణంగా నగర శివారులలో నిర్మిస్తుంటారు. అందువల్ల నిర్మాణంలో ఉన్న ఆస్తులకు భవిష్యత్తులోధర పెరగవచ్చు, కొన్ని సందర్భాలలో పెరగకపోవచ్చు. అయినప్పటికి, నిర్మాణం ఉన్న ప్రదేశాన్ని, భవిష్యత్తు ప్రణాళికలను, చుట్టూ ఉన్న ప్రదేశాలను, సౌకర్యాలను పరిశీలించాలి. సిద్ధంగా ఉన్న అపార్టమెంటు కంటే నిర్మాణంలో ఉన్న ఆస్తికి భవిష్యత్తులో ధర పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
సిద్ధంగా ఉన్న ఆస్తి కొనుగోలు చేయడంలో ప్రతికూలతలు:
1. చట్టపరమైన డాక్యుమెంటేషన్, పని ఎక్కువ..
సిద్ధంగా ఉన్న ఇంటికి చాలా బదిలీ పత్రాలు ఉంటాయి. తాజా డాక్యుమెంటేషన్ ఉండదు కాబట్టి డాక్యుమెంటేషన్ పని ఎక్కువగా ఉంటుంది. రిజిస్ట్రేషన్ సమయంలో ఇంటికి సంబంధించిన నిర్మాణం దగ్గర నుంచి పూర్తి డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది.
2. డౌన్‌పేమెంట్, రిజిస్ట్రేషన్.. అన్ని ఖర్చులు ఒకేసారి..
ఒకేసారి డౌన్‌పేమెంట్ మొత్తం చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అందువల్ల గృహ రుణం తీసుకున్నప్పటికీ డౌన్‌పేమెంట్, రిజిస్ట్రేషన్ రుసుములు, స్టాంప్ డ్యూటీ మొత్తం ఒకేసారి చెల్లించాలి.
3. మోసపోయే అవకాశం..
సిద్ధంగా ఉన్న ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు ఎదురయ్యే అతి పెద్ద సమస్య నకిలీలు. ఒక ఆస్తిని నకిలీ పత్రాల ద్వారా ఒకరి కంటే ఎక్కువ మందికి విక్రయించే అవకాశం ఉంది. అందువల్ల ఒక మంచి రియల్ఎస్టేట్ ఏజెంట్ లేదా లాయర్ ద్వారా పత్రాలను అధ్యయనం చేయించి పత్రాలు ఒరిజినల్ అని నిర్ధారించుకుని కొనుగోలు చేయాలి.
4. అధిక ధర..
సిద్ధంగా ఉన్న ఆస్తి ఉన్న ప్రాంతంలో ఉన్న వృద్ధి రేటు ఆధారంగా అవి నిర్మించి 5 సంవత్సరాల కాలం పూర్తయితే ధరలో పెరుగుదల ఉంటుంది. నిర్మాణం లో ఉన్నప్పుడు బిల్డర్ లు కొంత వరకు తక్కువ ధరకే అమ్ముతుంటారు. ఒక్కసారి నిర్మాణం పూర్తయ్యాక వాటి ధర కచ్చితంగా పెరుగుతుంది. కాబట్టి, ఈ పెరుగుదలను దృష్టిలో ఉంచుకుపోవాలి.
సిద్దంగా ఉన్న ఆస్తి కొనుగోలు చేయడంలో అనుకూలతలు:
1. మీరు చూసిన దాన్ని కొనుగోలు చేస్తారు..
నిర్మాణంలో ఉన్న ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు ఇంటి నమూనా ఆదారంగా మాత్రమే కొనుగోలు చేస్తారు. కానీ సిద్ధంగా ఉన్న ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు ప్రతిదాన్ని మీరు స్వయంగా చూసి కొనుగోలు చేయవచ్చు. చుట్టుప్రక్కల నివసించే ప్రజల ద్వారా కరెంటు, నీటి సరఫరా గురించి తెలుసుకోవచ్చు.
2. అద్దె, ప్రయాణ ఖర్చుల నుంచి తక్షణ ఉపశమనం..
చాలా మంది అద్దె ఇంటికి అధిక అద్దెను చెల్లిస్తూ, పనిచేసే ప్రదేశానికి అద్దె ఇంటికి ప్రయాణం చేస్తుంటారు. ఆఫీస్ కి దగ్గరలో ఉన్న ఇంటిని కొనుగోలు చేయడం వలన అద్దె, ప్రయాణపు ఖర్చుల నుంచి తక్షణమే విముక్తి పొందవచ్చు.
3. చుట్టుప్రక్కల నివసించే వారి గురించి తెలుసుకోవచ్చు..
చుట్టప్రక్కల నివసించే వారి గురించి ముందుగానే తెలుసుకునే అవకాశం ఉంటుంది. కానీ నిర్మాణంలో ఉన్న ఇంటిని కొనుగోలు చేస్తే చుట్టుప్రక్కల వ్యక్తులు ఏవిధంగా నడుచుకుంటారో తెలియదు.
4. జీఎస్టీ ఉండదు
నిర్మాణం లో ఉన్న ఇళ్ల పై 5 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. అదే నిర్మాణ పూర్తయిన ఇళ్ల పై జీఎస్టీ వర్తించదు. అయితే, కొందరు బిల్డర్ లు నిర్మాణం పూర్తయిన వెంటనే రేట్లు పెంచుతుంటారు. ఈ విషయమై మీరు బిల్డర్ తో చర్చించి రేటు తగ్గించమని కోరవచ్చు.
పెట్టుబడుల కోణం నుంచి కొనుగోలు చేయాలంటే నిర్మాణంలో ఉన్న ఇంటిని, నివాస, సొంత ప్రయోజనం కోసం అయితే సిద్ధంగా ఉన్న ఇంటిని కొనుగోలు చేయడం మంచిది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!