Microsoft: మైక్రోసాఫ్ట్‌-యాక్టివిజన్‌ మధ్య రూ.5.6 లక్షల కోట్ల డీల్‌కు తాత్కాలిక బ్రేక్‌

మైక్రోసాఫ్ట్‌ దాదాపు 50 ఏళ్లలో చేపట్టిన అతిపెద్ద కొనుగోలు న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కొంది. దీంతో అమెరికాలోని ఫెడరల్‌ కోర్టు ఈ డీల్‌కు తాత్కాలికంగా బ్రేక్‌ వేసింది.  

Published : 14 Jun 2023 12:01 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా (USA) టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌(Microsoft), గేమింగ్‌ సంస్థ యాక్టివిజన్‌ బ్లిజార్డ్‌(Activision Blizzard) మధ్య 69 బిలియన్‌ డాలర్ల డీల్‌ను అమెరికాలోని ఫెడరల్‌ న్యాయమూర్తి తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ మేరకు జడ్జి ఎడ్వర్డ్‌ డెవిలా ప్రకటించారు. ‘‘దీనిపై స్టేటస్‌ కో విధించాల్సిన అవసరం ఉంది’’ అని పేర్కొన్నారు. ఇప్పటికే ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌(ఎఫ్‌టీసీ) అభ్యర్థన మేరకు ఈ డీల్‌పై దీర్ఘకాలిక నిలుపుదలను కూడా పరిశీలిస్తోంది. ఇక దీనిపై విచారణకు జూన్‌ 22, 23 తేదీల్లో శాన్‌ఫ్రాన్సిస్కో కోర్టులో విచారణ జరపనున్నారు. దాదాపు 50 ఏళ్లలో మైక్రోసాఫ్ట్‌ చేపట్టిన అతిపెద్ద డీల్‌ ఇదే.

అంతకు ముందు రోజే మైక్రోసాఫ్ట్‌-యాక్టివిజన్‌ డీల్‌ పూర్తికాకుండా అడ్డుకోవాలని.. దీనిపై నియంత్రణ సంస్థలు చర్యలు తీసుకొనే విషయాన్ని పరిశీలిస్తున్నాయని పేర్కొంటూ ఎఫ్‌టీసీ ఫెడరల్‌ కోర్టును ఆశ్రయించింది. ‘‘అమెరికాలోని యాంటీ ట్రస్ట్‌ చట్టాల ఉల్లంఘన జరుగుతోందేమో కనుగొనే వరకు తాత్కాలిక నష్ట నివారణకు ప్రాథమిక ఉత్తర్వులు అవసరం’’ అని ఎఫ్‌టీసీ పేర్కొంది. తాజాగా ఫెడరల్‌ కోర్టు ఉత్తర్వులతో మైక్రోసాఫ్ట్‌ ఈ డీల్‌లో ముందుకు పోకుండా నిలిచిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. 

మైక్రోసాఫ్ట్‌, యాక్టివిజన్‌ సంస్థలు జూన్‌ 16 లోపు తమ వాదనలు సమర్పించాల్సి ఉంది. దీనిపై ఎఫ్‌టీసీ 20వ తేదీ లోపు సమాధానం ఇవ్వాల్సి ఉంది. జూన్‌ 22 నుంచి విచారణ జరుగుతుంది. యాక్టివిజన్‌ను కొనుగోలు చేయాలంటే మైక్రోసాఫ్ట్‌ యూకే, ఐరోపా, అమెరికా నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు పొందాల్సి ఉంది. ఈ డీల్‌తో యాక్టివిజన్‌ గేమ్స్‌పై మైక్రోసాఫ్ట్‌ ఎక్స్‌బాక్స్‌కు పూర్తి ఆదిపత్యం వస్తుందని ఎఫ్‌టీసీ చెబుతోంది. వాస్తవానికి ఈ డీల్‌కు ఐరోపాలో అనుమతి లభించగా.. యూకే మాత్రం అనుమతులను నిరాకరించింది. తాజాగా అమెరికాలో ఈ అంశం న్యాయస్థానానికి చేరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని