వంటింట ధరల మంట: శాకాహార భోజన ఖర్చు పైకి.. మాంసాహారం కిందికి!

వంటింటికి నిత్యావసర ధరలు మంట పెడుతున్నాయి. దీంతో ఇంట్లో వండుకునే శాకాహార భోజనం ప్రియంగా మారుతోంది. అదే సమయంలో మాంసాహార భోజనం ఖర్చు తగ్గుముఖం పట్టింది.

Published : 07 Feb 2024 15:52 IST

Veg thali Cost | ముంబయి: పెరుగుతున్న నిత్యావసరాల ధరలు సామాన్యులకు భారంగా మారుతున్నాయి. వంటగ్యాస్‌ మొదలు, బియ్యం, పప్పులు, కూరగాయల ధరలు సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. దీంతో వంటింటి ఖర్చు తడిసి మోపెడవుతోంది. ముఖ్యంగా శాకాహార భోజనం ఖర్చు మరింత పెరిగింది. అదే సమయంలో మాంసాహారం ఖర్చు తగ్గినట్లు ఓ నివేదిక వెల్లడించింది. గతేడాది జనవరితో పోలిస్తే వెజిటేరియన్‌ భోజనం ఖర్చు 5 శాతం పెరిగితే.. నాన్‌ వెజ్‌ భోజనం 13 శాతం తగ్గిందని క్రిసిల్‌ మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ అనలిటిక్స్‌ అధ్యయనం తెలిపింది. తాజాగా ‘రైస్‌ అండ్‌ రోటీ’ పేరిట ఓ నివేదికను విడుదల చేసింది.

దేశంలో బియ్యం, పప్పులు, ఉల్లిపాయలు, టమాటా ధరలు పెరగడంతో జనవరిలో ఇంట్లో వండుకునే శాకాహార భోజనం ధరలు పెరిగినట్లు క్రిసిల్‌ విశ్లేషించింది. పౌల్ట్రీ ధరలు తగ్గడంతో నాన్‌వెజ్‌ భోజనం ధరలు తగ్గడానికి దోహదం చేసిందని పేర్కొంది. శాకాహార భోజనం ధరల పెరుగుదలలో ఉల్లి, టమాటా ధరలు ప్రధాన కారణమని తెలిపింది. ఏడాదిలో ఉల్లి ధరలు 35 శాతం, టమాటా ధరలు 25 శాతం పెరిగినట్లు విశ్లేషించింది. వీటికితోడు బియ్యం ధరలు 14 శాతం, పప్పుల ధరలు 21 శాతం మేర పెరిగినట్లు నివేదిక పేర్కొంది. శాకాహార భోజనం పెరుగుదలలో బియ్యం 12 శాతం, పప్పులు 9 శాతం చొప్పున కారణమవుతున్నాయి.

అమెరికాలో ఐటీ ఉద్యోగాలు ‘కట్‌’కట

ఇక నాన్‌వెజ్‌ విషయానికొస్తే.. గతేడాదితో పోలిస్తే బ్రాయిలర్‌ ధరలు 26 శాతం మేర తగ్గుముఖం పట్టాయి. వీటి ఉత్పత్తి ఎక్కువగా ఉండడంతో ధరలు దిగి వచ్చాయి. ఓ రకంగా నాన్‌ వెజ్‌ వంటకాల ధరలు తగ్గడానికి ఇదే కారణం. అంతకుముందు నెలతో పోలిస్తే మాత్రం శాకాహార భోజనం 6 శాతం, మాంసాహార భోజనం ధరలు 8 శాతం మేర తగ్గినట్లు నివేదిక తెలిపింది. ఉల్లి, టమాటా ధరలు తగ్గుముఖం పట్టడం ఇందుకు కారణమని తెలిపింది. ఉల్లి ఎగుమతులపై ఆంక్షల వల్ల దేశీయంగా వాటి లభ్యత పెరిగింది. టమాటా అందుబాటులోకి రావడంతో వాటి ధరలు తగ్గాయి. నాన్‌ వెజ్‌ ఆహార ఖర్చులో 50 శాతం వాటా బ్రాయిలర్‌దేనని, వాటి ధరలు తగ్గడం ఆ మేర నాన్‌ వెజ్‌ వంటకాల ఖర్చు తగ్గిందని నివేదిక తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని