ఆరోగ్య బీమాలో వెయిటింగ్ పిరియ‌డ్ పాత్ర ఏంటి?

ఆరోగ్య బీమా పాల‌సీల్లో త‌రుచుగా వినిపించే ప‌దం వెయిటింగ్ పీరియ‌డ్. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

Published : 23 Feb 2021 12:50 IST

ఆరోగ్య బీమాలో ప్రీమియం చెల్లింపులు ప్రారంభించిన‌ప్ప‌టికీ నిర్ధిష్ట‌ కాలం పాటు పాల‌సీ ప్ర‌యోజ‌నాలు ల‌భించ‌వు. ఈ కాలాన్ని వెయిటింగ్ పిరియ‌డ్ అంటారు. మొద‌టిసారి ఆరోగ్య బీమా జారీ చేసిన తేది నుంచి ఈ కాలాన్ని లెక్కిస్తారు. 

ఆరోగ్య బీమా దుర్వినియోగాన్ని నిరోధించడం, అనైతిక‌/మోసపూరిత క్లెయిమ్‌ల దాఖ‌ల‌ను నిరుత్సాహ‌ప‌రచ‌డం వెయిటింగ్ పిరియ‌డ్ ముఖ్య ఉద్దేశ్యం. కొంత‌మంది చికిత్స అవ‌స‌రం అని తెలిసిన త‌రువాత పాల‌సీ తీసుకుని క్లెయిమ్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తుంటారు. అటువంటి మోసాల‌ను నివారించేందుకు వెయిటింగ్ పిరియ‌డ్‌ను పాల‌సీలో భాగం చేశార‌ని నిపుణులు చెబుతున్నారు. 

ఆరోగ్య బీమాలో వివిధ ర‌కాల వెయిటింగ్ పిరియ‌డ్‌లు ఉంటాయి. వ్యాధి/ అనారోగ్యం/  చికిత్స/  పాల‌సీ ప్ర‌యోజ‌నాలు  వంటి అంశాల‌పై ఇది ఆధార‌ప‌డి ఉంటుంది. మీరు ఎంచుకునే పాల‌సీకి వర్తించే ఖచ్చితమైన ‘నిరీక్ష‌ణ కాలాన్ని’ తెలుసుకునేందుకు,  ఆరోగ్య బీమా సంస్థ అందించే పాలసీ ప‌త్రాల‌ను పూర్తిగా చ‌ద‌వాలి. 

ఇనీషియ‌ల్ వెయిటింగ్ పిరియ‌డ్:

సాధార‌ణంగా ఆరోగ్య బీమా పాల‌సీల‌లో  ఇనీషియ‌ల్ వెయిటింగ్ ప‌రియ‌డ్ ఉంటుంది. ఇది ప్రాథ‌మికంగా 30-90 రోజులు ఉంటుంది. ఈ స‌మ‌యం పూర్త‌యిన త‌రువాత మాత్ర‌మే ఆరోగ్య బీమా ప‌థ‌కం అమ‌ల్లోకి వ‌స్తుంది. పాల‌సీదారుడి వ‌య‌సు ఎక్కువ ఉంటే వెయిటింగ్ పిరియ‌డ్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే వ‌య‌సు ఎక్కువగా ఉండే వారికి ఆరోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చేందుకు ఆస్కారం ఎక్కువ‌గా ఉంటుంది. అయితే గ్రూపు ఆరోగ్య బీమా ప‌థ‌కాల్లో వెయిటింగ్ పిరియ‌డ్ ఉండ‌దు. మొద‌టిసారి పాల‌సీ కొనుగోలు చేసిన‌ప్పుడు మాత్ర‌మే వెయిటింగ్ పిరియ‌డ్ అమ‌ల‌వుతుంది. పాల‌సీ పున‌రుద్ధ‌ర‌ణల‌పై వ‌ర్తించ‌దు. 

" ప్ర‌మాదాల కార‌ణంగా చేసే ఆసుప‌త్రి  క్లెయిమ్‌లకు ఈ నిబంధనలు వ‌ర్తించ‌వు, పాలసీలో తెలిపిన అన్ని ప్రయోజనాలను పొందవచ్చు" అని టాటా ఏఐజి జనరల్ ఇన్సూరెన్స్, కన్స్యూమర్ లైన్స్ హెడ్ పరాగ్ వేద్ అన్నారు.

ముందుగా ఉన్న ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు:

పాల‌సీ తీసుకునే ముందు స‌ద‌రు వ్య‌క్తికి ఉండే వ్యాధులు లేదా గ‌తంలో తీసుకున్న పాల‌సీ ద్వారా వైద్య‌సేవ‌ల‌ను పొంది ఉండొచ్చు. వాటిని ఆరోగ్య బీమా కంపెనీలు ముంద‌స్తు ఆరోగ్య‌స‌మ‌స్య‌లుగా ప‌రిగ‌ణిస్తాయి. కొన్ని బీమా కంపెనీలు ఈ వెయిటింగ్ పిరియ‌డ్ 4 సంవ‌త్స‌రాల వ‌ర‌కూ వ‌ర్తింప‌చేసే అవ‌కాశం ఉంది. అందువ‌ల్ల బీమా కంపెనీలు పాల‌సీలో పొందుప‌రిచిన ముంద‌స్తు ఆరోగ్య స‌మ‌స్యల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. 

ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీలలో ముందస్తు ఆరోగ్య స‌మ‌స్య‌లు(పీఈడీ) నిర్వచనాన్ని ప్రామాణీకరించింది. ఆరోగ్య పాలసీని కొనడానికి 48 నెలల ముందు నిర్ధారణ అయిన ఏదైనా ఆరోగ్య‌ పరిస్థితి, అనారోగ్యం, గాయం, వ్యాధిని ముందుగా ఉన్న ఆరోగ్య స‌మ‌స్య‌గా ప‌రిగ‌ణిస్తారు.

ఉదాహ‌ర‌ణ‌కి, డయాబెటిస్, రక్తపోటు, థైరాయిడ్ మొదలైనవి. మీరు ఇప్ప‌టికే ముందుగా నిర్ధార‌ణ అయిన ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో భాధ‌ప‌డుతుంటే, ఇవి పాల‌సీ జారీ చేసిన వెంట‌నే ఆరోగ్య బీమా ప‌రిధిలోకి రావు, వీటికి కొంత వెయిటింగ్ పిరియ‌డ్ ఉంటుంది. ఈ కాలం పూర్తైన త‌ర్వాత పాల‌సీ ప్ర‌యోజ‌నాల‌ను పొందొచ్చు. 

ఆరోగ్య బీమా దుర్వినియోగాన్ని నిరోధించడానికి, బీమా సంస్థ‌లు వెయిటింగ్ పిరియ‌డ్‌లో క‌వ‌ర్ కానీ వ్యాధుల జాబితాని పాల‌సీ ప‌త్రాల‌లో పొందుప‌రుస్తున్నాయి. నిర్ధిష్ట వ్యాధి, పాల‌సీ ప్ర‌యోజ‌నాల‌ ఆధారంగా 2 నుంచి 4 సంవ‌త్స‌రాల వ‌ర‌కు నిరీక్షణ కాలం ఉండొచ్చు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని