డీలిస్టింగ్ అంటే..?

స్టాక్ మార్కెట్ కు సంబంధించిన అప్పుడ‌ప్పుడు వార్త‌ల్లో వినిపించే ప‌దం డీలిస్టింగ్. ఫ‌లానా కంపెనీ షేర్ల‌ను డీలిస్టింగు అయిన‌ట్లు ప్ర‌క‌ట‌న‌లు వ‌స్తుంటాయి. అస‌లు డీలిస్టింగ్ అంటే ఏంటి? ఇది ఎలా జ‌రుగుతుంది. దీని వ‌ల్ల మ‌దుప‌ర్లపై ఎలాంటి ప్ర‌భావం ఉంటుంది త‌దిత‌ర విష‌యాల‌ను తెలుసుకుందాం......

Published : 16 Dec 2020 13:03 IST

స్టాక్ మార్కెట్ కు సంబంధించిన అప్పుడ‌ప్పుడు వార్త‌ల్లో వినిపించే ప‌దం డీలిస్టింగ్. ఫ‌లానా కంపెనీ షేర్ల‌ను డీలిస్టింగు అయిన‌ట్లు ప్ర‌క‌ట‌న‌లు వ‌స్తుంటాయి. అస‌లు డీలిస్టింగ్ అంటే ఏంటి? ఇది ఎలా జ‌రుగుతుంది. దీని వ‌ల్ల మ‌దుప‌ర్లపై ఎలాంటి ప్ర‌భావం ఉంటుంది త‌దిత‌ర విష‌యాల‌ను తెలుసుకుందాం.

లిస్టింగ్ అంటే ఒక కంపెనీ షేర్లు స్టాక్ ఎక్స్ఛేంజీలో న‌మోదుకావ‌డం. డీలిస్టింగ్ అంటే స్టాక్ ఎక్స్చేంజీ నుంచి షేర్ల ట్రేడింగును నిలిపివేయ‌డం . ఏదైనా కంపెనీ షేర్ల‌ డీలిస్టింగు చేసిందంటే ఆ కంపెనీ షేర్లు స్టాక్ ఎక్స్ఛేంజీలో ట్రేడింగ్ ఆగుతుంది.

డీలిస్టింగ్ రెండు ర‌కాలుగా జ‌రుగుతుంది.

  1. స్వ‌తంత్ర డీలిస్టింగ్ (voluntary delisting)
  2. త‌ప్ప‌నిస‌రి డీలిస్టింగ్ (compulsory delisting)

స్వ‌తంత్ర డీలిస్టింగ్ (voluntary delisting):

కంపెనీ విలీనాలు, కొనుగోళ్లు , ప్ర‌మోట‌ర్లు స్వ‌తంత్ర నిర్ణ‌యం మేర‌కు కంపెనీలు స్వ‌తంత్రంగా డీలిస్ట్ చేయ‌వ‌చ్చు. డీలిస్టు చేసే అవ‌కాశం పొందాలంటే కంపెనీ షేర్లు ఏదైనా ఎక్స్ఛేంజీలోక‌నీసం మూడేళ్ల పాటు లిస్ట‌యి ఉండాలి. లేకుంటే వాటిని డీలిస్ట్ చేయ‌డం వీలుప‌డ‌దు. బోర్డు స‌మావేశంలో వాటాదార్ల అనుమ‌తితో స్వ‌తంత్ర డీలిస్టింగ్ చేయాలి. ఈ ప్ర‌క్రియ‌ను పూర్తిచేసేందుకు మ‌ర్చెంట్ బ్యాంక‌ర్ ను నియ‌మించి స్టాక్ ఎక్స్ఛేంజీ నిబంధ‌న‌ల‌ను పాటిస్తూ డీలిస్టింగు చేయాలి.

త‌ప్ప‌నిస‌రి డీలిస్టింగ్ (compulsory delisting):

కంపెనీ నిబంధ‌న‌ల‌ను పాటించ‌క‌పోవ‌డం వ‌ల్ల స్టాక్ ఎక్స్ఛేంజీ డీలిస్టింగ్ చేయ‌డాన్ని త‌ప్ప‌నిస‌రి డీలిస్టింగ్ అంటారు. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ స్టాక్ ఎక్స్ఛేంజీ ప‌త్రికా ప్ర‌క‌ట‌న ఇస్తుంది. ఈ విధానంలో స్టాక్ ఎక్స్ఛేంజీ నియ‌మించిన నిపుణులు షేరు ధ‌ర‌ను లెక్క క‌డ‌తారు. మ‌దుప‌ర్లు త‌మ షేర్ల‌ను ప్ర‌మోట‌ర్ల‌కు విక్ర‌యించి న‌గ‌దు పొంద‌వ‌చ్చు. క‌నీసం ఒక్క ఎక్స్ఛేంజీలోనైనా షేర్లు న‌మోదై ఉంటే మ‌దుప‌ర్ల నుంచి షేర్ల‌ను తిరిగి కొనుగోలు చేయాల్సిన అవ‌స‌రం ప్ర‌మోట‌ర్ల‌కు ఉండ‌దు.

త‌ప్ప‌నిస‌రి ఎప్పుడంటే:

గ‌త కొంత కాలంగా షేర్లు క‌నీస ట్రేడింగు ప‌రిమాణం న‌మోదుకాన‌పుడు, లిస్టింగ్ నిబంధ‌న‌ల‌ను ఆరు నెల‌ల పాటు పాటించ‌లేన‌పుడు, కంపెనీ ప్ర‌మోట‌ర్లు డైరెక్ట‌ర్ల ట్రాక్ రికార్డు స‌రిగా లేన‌పుడు, ఇన్సైడ‌ర్ ట్రేడింగు, అవ‌క‌త‌వ‌క‌లు మార్కెట్ ను త‌ప్పుదోవ ప‌ట్టించే విధంగా కార్య‌క‌లాపాలు చేసిన‌పుడు, కంపెనీ రుణ భారంతో క‌నీస వ్యాపార కార్య‌క‌లాపాలు నిర్వ‌ర్తించ‌లేని సంద‌ర్బాల్లో త‌ప్ప‌నిస‌రి డీలిస్టింగు చేస్తారు.

ధ‌ర నిర్ణ‌యం

ట్రేడింగ్ జ‌రిగే షేర్ల‌కు 26 వారాల స‌రాస‌రి (వెయిటెడ్ ఏవ‌రేజ్ ) ధ‌ర‌ను లెక్కిస్తారు. దీనికి ఎక్కువ ప‌రిమాణంలో ట్రేడింగు జ‌రుగుతున్న‌ఎక్స్ఛేంజీని ఎంచుకుంటారు. ట్రేడింగ్ జ‌ర‌గ‌ని షేర్ల‌కు ఆడిట‌ర్లు సెబీ నిబంధ‌న‌ల ప్ర‌కారం ధ‌ర‌ను నిర్ణ‌యిస్తారు.
మ‌దుప‌ర్ల నుంచి షేర్ల‌ను కొనుగోలుచేసేందుకు కంపెనీ టెండ‌ర్ ఆఫ‌ర్ ను ప్ర‌క‌టిస్తుంది. మ‌దుప‌ర్లు రివ‌ర్స్ బుక్ బిల్డింగు ప‌ద్ధ‌తి ప్ర‌కారం బిడ్లు దాఖ‌లు చేస్తారు. లావాదేవీలు పార‌ద‌ర్శ‌కంగా జ‌రిగేందుకు ఎస్క్రో ఖాతా ద్వారా లావాదేవీలు జ‌రుపుతారు.
ప్ర‌మోట‌ర్లు ఆఫ‌ర్ ప్ర‌క‌టించిన త‌ర్వాత ఎస్క్రో ఖాతాలో నిర్ణ‌యించిన ధ‌ర‌ ప్ర‌కారం నిధుల‌ను లెక్కించి వాటిని ఆ ఖాతాలో జ‌మ‌చేయాలి. ఆఫ‌ర్ విజ‌య‌వంతంగా పూర్తి అయితే మ‌దుప‌ర్ల‌కు వారి కున‌న్న షేర్ల‌కు త‌గిన న‌గ‌దు వారిఖాతాల్లోకి జ‌మ‌వుతుంది. సెబీ డీలిస్టింగ్ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఈ వ్య‌వ‌హారాన్ని జ‌రిపించాలి. రివ‌ర్స్ బుక్ బిల్డింగ్ ప్ర‌క్రియ‌లో పాల్గొన‌ని మ‌దుప‌ర్లకు త‌మ వాటాల‌ను ప్ర‌మోట‌ర్ల‌కు విక్ర‌యించే అవ‌కాశం ఉంటుంది. బిడ్డింగ్ ప్ర‌క్రియ లో ఖ‌రారైన ధ‌రకు డీలిస్టింగ్ ముగిసిన తేదీ నుంచి ఏడాది వ‌ర‌కూ ఈ అవ‌కాశం ఉంటుంది.

తిరిగి లిస్ట్ అవ్వాలంటే…

ఎక్స్ఛేంజీ నుంచి ఒక సారి డీలిస్టింగ్ అయిన కంపెనీ తిరిగి లిస్ట్ చేసేందుకు 5 నుంచి 10 సంవ‌త్స‌రాల త‌ర్వాత అవ‌కాశం ఉంటుంది. స్వ‌తంత్రంగా డీలిస్టింగ్ చేసిన సంస్థ‌లు తిరిగి లిస్ట్ అయ్యేందుకు 5 సంవ‌త్స‌రాలు, త‌ప్ప‌నిస‌రి డీలిస్టింగ్ జ‌రిగిన‌
సంస్థ‌లు తిరిగి లిస్ట్ అయ్యేందుకు 10 సంవ‌త్స‌రాలు ఆగాల్సిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని