Gold Smuggling: ఎక్స్‌ప్రెస్‌ హైవేపై స్మగ్లర్లను ఛేజ్‌ చేసి.. 77 గోల్డ్‌ బిస్కెట్లు స్వాధీనం

విమానాశ్రయం నుంచి ఆగ్రా-లఖ్‌నవూ ఎక్స్‌ప్రెస్‌ వేపై వేగంగా దూసుకెళ్తున్న స్మగ్లర్లను ఛేజ్‌ చేసి పట్టుకొన్నారు. అనంతరం వారి నుంచి దాదాపు 9కిలోల బరువున్న 77 బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. .....

Updated : 08 Sep 2021 04:55 IST

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూలో డీఆర్‌ఐ అధికారులు భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. రియాద్‌ నుంచి లఖ్‌నవూకు బంగారాన్ని అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని అరెస్టు చేశారు. విమానాశ్రయం నుంచి ఆగ్రా-లఖ్‌నవూ ఎక్స్‌ప్రెస్‌ వేపై వేగంగా దూసుకెళ్తున్న స్మగ్లర్లను ఛేజ్‌ చేసి పట్టుకొన్నారు. అనంతరం వారి నుంచి దాదాపు 9కిలోల బరువున్న 77 బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు.  వివరాల్లోకి వెళ్తే.. సౌదీ అరేబియా రాజధాని రియాద్‌ నగరం నుంచి వస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్రమంగా బంగారం బిస్కెట్లు తరలిస్తున్నట్టు డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులకు సమాచారం అందింది. ఆ బిస్కెట్లను లఖ్‌నవూలోని చౌదరి చరణ్‌సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద వారు ముజఫర్‌నగర్‌ వెళ్లే వ్యక్తులకు అందించనున్నట్టు తెలిసింది. 

దీంతో అప్రమత్తమైన లఖ్‌నవూ డీఆర్‌ఐ అధికారులు అనుమానితులు విమానాశ్రయంలో అడుగు పెట్టగానే వారిపై నిఘా ఉంచారు.  ఆగ్రా-లఖ్‌నవూ ఎక్స్‌ప్రెస్‌వేపై రెండు ఎస్‌యూవీలు హైస్పీడ్‌తో వెళ్తుండగా.. ఆ వాహనాలను ఛేజ్‌ చేసి అడ్డగించారు. రియాద్‌ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులతో పాటు ఈ బిస్కెట్లను వారి నుంచి అందుకొనేందుకు వచ్చిన వ్యక్తులు వాహనాల్లో ఉన్నట్టు గుర్తించారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకొని తనిఖీ చేశారు. వారి బెల్టులు, లోదుస్తుల్లో దాచి ఉంచిన మొత్తం 77 బంగారు బిస్కెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై విచారణ జరిపి ప్రధాన సూత్రధారిని లఖ్‌నవూలో అరెస్టు చేసినట్టు తెలిపారు. విమానాశ్రయం ద్వారా స్మగ్లర్లకు బంగారం అందించడంలో సహకరించిన కస్టమ్స్‌ అధికారిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని