Uttar Pradesh: ముగ్గురు బాలికలు సహా ఒకే కుటుంబంలో ఐదుగురి హత్య

ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు హత్యకు గురయ్యారు.

Updated : 16 Apr 2022 16:44 IST

ప్రయాగ్‌రాజ్‌: ఉత్తర్‌ప్రదేశ్​లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రయాగ్‌రాజ్​ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హత్యకు గురయ్యారు. మృతుల్లో 15 ఏళ్ల లోపు వయసున్న ముగ్గురు బాలికలు కూడా ఉంటడం బాధాకరం. నవాబ్​గంజ్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో ఉన్న ఖగల్‌పుర్ గ్రామానికి చెందిన రాహుల్ (42), అతడి భార్య ప్రీతి (38), వారి కుమార్తెలు మహి (15), పిహు (13), కుహు (11) వారి ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యారు.

సమాచారం అందుకున్న పోలీసుల ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం ప్రత్యేకంగా ఏడు బృందాలను ఏర్పాటు చేసినట్టు పోలీసు సూపరింటెండెంట్ అభిషేక్ అగర్వాల్ తెలిపారు. విచారణ కోసం ఫోరెన్సిక్ బృందం, డాగ్ స్క్వాడ్​ను ఉపయోగిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ.. భాజపాపై విమర్శలు గుప్పించారు. భాజపా రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చాక.. నేరాలు బాగా పెరిగాయని ఆరోపించారు. ‘భాజపా ప్రభుత్వం రెండోసారి అధికారం చేపట్టాక యూపీ నేరాల్లో మునిగిపోయింది. ఇదిగో నేరాల చిట్టా’ అంటూ హిందీలో ఒక న్యూస్ ఛానెల్ స్క్రీన్‌షాట్‌ను ట్వీట్ చేశారు.

అఖిలేశ్‌ యాదవ్‌ ట్వీట్‌పై ప్రయాగ్‌రాజ్‌ డీజీ ప్రేమ్‌ ప్రకాశ్‌ స్పందించారు. ముగ్గురు పిల్లలు, భార్యను పదునైన ఆయుధంతో హతమార్చిన ఇంటిపెద్ద అనంతరం ఉరివేసుకున్నట్లు కనిస్తోందని ప్రాథమిక దర్యాప్తులో ఈ విషయం వెల్లడవుతున్నట్లు పేర్కొన్నారు. హత్యతోపాటు, ఆత్మహత్య కోణంలోనూ మరింత దర్యాప్తు చేపడుతున్నట్లు డీజీ వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని