
తప్పించుకోబోయి..చావును కొనితెచ్చుకొని
జహీరాబాద్: మహిళపై అత్యాచారం కేసుకు సంబంధించిన ఇద్దరు నిందితులను సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకుని కారులో పారిపోతుండగా...రాయికోడ్ మండలం సిరూర్ సమీపంలో కారు బోల్తాపడి అక్కడికక్కడే మృతి చెందాడు.
మహిళలే లక్ష్యంగా ఐదుగురు సభ్యులున్న ఓ ముఠా దోపిడీలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. పోలీసుల పేరుతో ముగ్గురు నిందితులు సూర్యాపేటకు చెందిన మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఘటన జహీరాబాద్ పస్తాపూర్ కూడలిలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. ఈ కేసులో నిందితులను స్టేషన్‌కు తరలించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నిన్న ఏం జరిగిందంటే?..
మేం పోలీసులం.. మీ లగేజీలో నిషేధిత ఉత్పత్తులున్నాయి.. తనిఖీ చేయాలంటూ బస్సులోంచి ప్రయాణికురాలిని దింపి బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలానికి చెందిన 32 ఏళ్ల మహిళ 12 ఏళ్ల కుమారుడితో కలిసి కర్ణాటకలోని బీదర్ నుంచి తెలంగాణ ఆర్టీసీ బస్సులో హైదరాబాద్‌కు బయలుదేరింది. అందులోనే ఉన్న ఇద్దరు వ్యక్తులు మహిళ తీసుకెళ్తున్న బస్తాల్లో నిషేధిత ఉత్పత్తులు ఉన్నాయని, జహీరాబాద్ పస్తాపూర్ చౌరస్తాలో ఆమెతో పాటు కుమారుడిని కిందకు దింపారు. సమీపంలోని స్టేట్ బ్యాంకు వద్దకు తీసుకెళ్లి బస్తాలను తనిఖీచేసి గుట్కా ప్యాకెట్లు గుర్తించారు. నిందితుల్లో ఒకరు బాలుడితో పాటు గుట్కా బస్తాల వద్ద ఉండగా, మరో వ్యక్తి.. మాట్లాడాలంటూ మహిళను బ్యాంకు వెనక పాడుబడిన కట్టడం వద్దకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఉదయం బాలుడు, మహిళ బ్యాంకు వద్ద నిలబడి ఉండటంతో స్థానికులు ఆరా తీసి, పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ క్రమంలో బాధితురాలు జహీరాబాద్ పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఘటనా స్థలాన్ని సీఐ సైదేశ్వర్, ఎస్‌ఐ వెంకటేష్ సందర్శించి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలి నుంచి వివరాలను సేకరించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల చిత్రాలను గుర్తించారు. పోలీసులమని చెప్పగానే బస్సు దిగిపోవడం, రమ్మన్న చోటికి వెళ్లడంతో బాధిత మహిళ నేపథ్యాన్ని పోలీసులు అనుమానిస్తున్నారు. గుట్కా అక్రమ రవాణా చేస్తుండటంతో ఇంతకుముందే నిందితులతో ఆమెకు సంబంధాలున్నాయా.. అనే కోణంలో ఆరా తీస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.