పరారీకి యత్నించి మృతి: వ్యక్తికి కరోనా నెగిటివ్‌

తొందరపాటు నిర్ణయం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. కరోనా వచ్చిందేమో? అన్న భయం, ఆసుపత్రి నుంచి బయటికి వెళ్లిపోవాలనే ఆలోచనతో ప్రాణాలు కోల్పోయాడు. చివరికి ఆయనకి కరోనా నెగిటివ్‌ అని తేలింది. ఈ దారుణ ఘటన హరియాణాలోని పానిపట్‌ జిల్లాలో చోటుచేసుకుంది.....

Published : 07 Apr 2020 00:29 IST

పానిపట్‌: తొందరపాటు నిర్ణయం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. కరోనా వచ్చిందేమోనన్న భయం, ఆసుపత్రి నుంచి బయటికి వెళ్లిపోవాలనే ఆలోచనతో ప్రాణాలు కోల్పోయాడు. చివరికి ఆయనకి కరోనా నెగిటివ్‌ అని తేలింది. ఈ దారుణ ఘటన హరియాణాలోని పానిపట్‌ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని నూర్‌పూర్‌ గ్రామానికి చెందిన 55 ఏళ్ల శివ చరణ్‌ అనారోగ్యంతో ఏప్రిల్‌ 1న కల్పనా చావ్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. ఆయనలో కరోనా వైరస్‌ లక్షణాలు కనిపించడంతో వైద్యులు ఐసోలేషన్‌ వార్డులో ఉంచారు. కరోనా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇంకా రిపోర్ట్‌ రావాల్సి ఉండగా.. ఆయన సోమవారం ఉదయం ఆసుపత్రి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆరో అంతస్థు నుంచి జారిపడి అక్కడికక్కడే మృతి చెందాడు.

శివ చరణ్‌ మృతదేహాన్ని ఆసుపత్రిలోని మార్చురీలో ఉంచినట్లు కర్నాల్‌ పోలీసులు చెప్పారు. బెడ్‌షీట్‌ను ఉపయోగించి ఆసుపత్రి నుంచి పారిపోవాలి అనుకున్నాడని, కానీ ప్రమాదవశాత్తూ కిందపడ్డాడేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ‘శివ చరణ్‌ రిపోర్ట్‌ను టెలిఫోన్‌ ద్వారా తెలుసుకున్నాం. ఆయనకి కరోనా నెగిటివ్‌ రిపోర్ట్‌ వచ్చింది’ అని కర్నాల్‌ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ మీడియాతో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని