మందుబాబులూ.. సైబర్‌ కేటుగాళ్లతో జాగ్రత్త! 

కరోనాతో విధించిన లాక్‌డౌన్‌తో దేశ ప్రజలంతా ఇళ్లకే పరిమితమైపోయారు. దుకాణాలన్నీ మూతపడటంతో ఆర్థిక కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. ఈ క్రమంలో......

Published : 20 May 2020 02:08 IST

ముంబయి: కరోనాతో విధించిన లాక్‌డౌన్‌తో దేశ ప్రజలంతా ఇన్నాళ్లూ ఇళ్లకే పరిమితమైపోయారు. దుకాణాలన్నీ మూతపడటంతో ఆర్థిక కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. ఈ క్రమంలో మద్యం లేక అల్లాడిపోయిన మందుబాబులకు కొంత ఊరట కల్పిస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం మద్యం దుకాణాలకు అనుమతిచ్చిన విషయం తెలిసిందే. అయితే, తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయా దుకాణాల వద్ద జనం కి.మీల మేర బారులు తీరడం చూశాం. అయితే, మహారాష్ట్రలో కరోనా తీవ్రత అధికంగా ఉండటంతో మద్యం హోం డెలివరీకి అక్కడి ప్రభుత్వం అనుమతించింది. దీంతో సైబర్‌ కేటుగాళ్లు ముంబయి నగరంలో రెచ్చిపోతున్నారు. వారి మోసాలకు బలైపోయిన కొందరు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. 

వల విసురుతున్నారిలా..

ముంబయిలో బాగా తెలిసిన మద్యం దుకాణాల పేరిట నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాలు తెరిచి ప్రజలకు వల విసురుతున్నారు. వాటిలో జత చేసిన ఫోన్‌ నంబర్లకు ఆర్డర్‌ చేయాలని కోరుతున్నారు. అయితే, చెల్లింపుల్ని క్రెడిట్, డెబిట్‌ కార్డుల ద్వారా చేయాలని సూచిస్తు మోసాలకు పాల్పడుతున్నారు. దీనిపై ఓ సినీ నిర్మాత తనకెదురైన అనుభవాన్ని వివరించారు. ‘‘ఇటీవల నేను రూ.40వేల విలువైన మద్యాన్ని జుహూలోని ఓ దుకాణం పేరుతో ఉన్న ఫేస్‌బుక్‌ ఖాతాలో పేర్కొన్న మొబైల్‌ నంబర్‌కు ఆర్డర్‌ చేశా. అయితే, టోకెన్‌ కింద రూ.5వేలు చెల్లించాలని చెప్పారు. అలాగే చేశా. ఆ తర్వాత విచారిస్తే వీళ్లంతా మోసగాళ్లని అర్థమైంది. పశ్చిమబెంగాల్‌లోని అసన్‌సోల్‌, బిహార్‌ నుంచి కొందరు ఇలా చేస్తున్నారని తెలిసింది’’ అని వివరించారు.  

ఓటీపీ అడిగేసరికి అనుమానం వచ్చి.. 
బాగా పేరున్న ఓ మద్యం దుకాణం పేరుతో ఉన్న ఫేస్‌బుక్‌ ఖాతాలో పేర్కొన్న నంబర్‌కు ఫోన్‌ చేసి హోం డెలివరీకి ఆర్డర్‌‌ చేసినట్టు నేవీ మాజీ అధికారి ఒకరు తెలిపారు. అయితే, అ ఆర్డర్‌ తీసుకున్న వ్యక్తి క్రెడిట్‌/ డెబిట్‌ కార్డు ద్వారానే చెల్లింపులు చేయాలని చెప్పాడనీ.. అంతేకాకుండా ఓటీపీని షేర్‌ చేయాలని అడిగాడన్నారు. దీంతో తనకు అనుమానం రావడంతో ఎక్కువ మొత్తంలో ఆర్డర్‌ చేయాలనుకున్నప్పటికీ రూ.1400 మద్యానికే ఆర్డర్‌ చేశానని తెలిపారు. 

ఈ మోసాలపై పోలీసులకు ఫిర్యాదు చేశా
ఈ సైబర్‌ మోసాలపై ఓ మాజీ ఎమ్మెల్యే స్పందిస్తూ.. తన స్నేహితుల నుంచి కూడా ఇలాంటి ఫిర్యాదులే కొన్ని వచ్చాయన్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా ఇలాంటి మోసాలు జరుగుతున్నాయని చెప్పారు. కొందరు కేటుగాళ్లు క్రెడిట్‌, డెబిట్‌ కార్డు నంబర్లు, సీవీవీ వివరాలు అడుగుతున్నారనీ.. సందేహించని వారిని మోసగిస్తున్నారని.. దీనిపై తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. దీనిపై సీనియర్‌ అధికారులతో దర్యాప్తు చేయించాలని కోరానన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని