కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద ట్రాక్టర్‌- లారీ ఢీకొన్న ఘటనలో

Updated : 08 Dec 2022 17:46 IST

12 మంది మృతి.. పలువురికి గాయాలు

జగ్గయ్యపేట: కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద ట్రాక్టర్‌- లారీ ఢీకొన్న ఘటనలో 12 మంది దుర్మరణం పాలయ్యారు. ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఐదుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు ఉన్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం పెద గోపవరం గ్రామానికి చెందిన కుటుంబం బంధువులతో కలిసి వేదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి మొక్కులు తీర్చుకునేందుకు వెళ్లి వస్తున్నారు. ఈ క్రమంలో వీరు ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ను ఎదురుగా వచ్చిన బొగ్గు లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురు జగ్గయ్యపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

మృతుల వివరాలివీ..
మృతుల్లో పెద గోపవరంతో పాటు అదే మండలానికి చెందిన జమలాపురం, కృష్ణాజిల్లా కంచికచర్ల మండలంలోని జయంతి గ్రామానికి చెందిన వారున్నారు. పెదగోపవరం గ్రామానికి చెందిన వేమిరెడ్డి పద్మావతి (45), వేమిరెడ్డి ఉదయశ్రీ (6), రాజి (27), అక్కమ్మ (45), వేమిరెడ్డి భారతమ్మ (45), వేమిరెడ్డి కల్యాణి (16), శీలం శ్రీలక్ష్మి (19) జయంతి గ్రామానికి చెందిన గూడూరు ఉపేంద్రరెడ్డి (15), గూడూరు సత్యనారాయణరెడ్డి (46), గూడూరు రమణమ్మ (40), జమలాపురం గ్రామానికి చెందిన లచ్చిరెడ్డి అప్పమ్మ (40), లచ్చిరెడ్డి తిరుపతమ్మ (60) ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గాయపడ్డవారిని జగ్గయ్యపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు. నందిగామ డీఎస్పీ రమణమూర్తి, సీఐ నాగేంద్రకుమార్‌, ఎస్సై అభిమన్యు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

ప్రముఖుల దిగ్భ్రాంతి

కృష్ణా జిల్లా ప్రమాద ఘటన పట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, సీఎం కేసీఆర్, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మృతులకు సంతాపం తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కేసీఆర్‌ ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున సంతాపం ప్రకటించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని