కుమార్తె ఆరోగ్యం కోసం దొంగయ్యాడు

ఎటువంటి వ్యసనాలు లేవు... అల్లరి చిల్లరగా తిరిగేవ్యక్తీ కాదు.. తాపీ పనిచేసేవాడు... కుమార్తె వైద్యం కోసం దొంగగా మారాడు. ఏడు జిల్లాల పరిధిలో 14 నెలల్లో 107 ద్విచక్ర వాహనాలు చోరీచేశాడు. కుటుంబ పరిస్థితి చూసి జాలిపడినా.. విద్యుక్త ధర్మం ప్రకారం

Updated : 28 Jun 2022 05:01 IST

బైకులను పరిశీలిస్తున్న ఎస్పీ

జగ్గంపేట: ఎటువంటి వ్యసనాలు లేవు... అల్లరి చిల్లరగా తిరిగేవ్యక్తీ కాదు.. తాపీ పనిచేసేవాడు... కుమార్తె వైద్యం కోసం దొంగగా మారాడు. ఏడు జిల్లాల పరిధిలో 14 నెలల్లో 107 ద్విచక్ర వాహనాలు చోరీచేశాడు. కుటుంబ పరిస్థితి చూసి జాలిపడినా.. విద్యుక్త ధర్మం ప్రకారం నడుచుకోవాల్సిన పరిస్థితి పోలీసులది. బైకుల చోరీ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు కాకినాడ ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు తెలిపారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరానికి చెందిన నడిగట్ల కృష్ణ జగ్గంపేటలో ఉంటున్నాడు. ఇతనికి ఇద్దరు కుమార్తెలు. అయిదేళ్ల చిన్నకుమార్తెకు చెవిటి, మూగ. ఈమె ఆరోగ్యం బాగు చేయడానికి ఆసుపత్రులకు తీసుకెళ్లి చూపించేవాడు. అమ్మాయి ఆరోగ్య ఖర్చుల కోసం ద్విచక్ర వాహన చోరీలు మొదలుపెట్టాడు. గత ఏడాది ఏప్రిల్‌లో కడియంలో ఓ బైక్‌ చోరీచేశాడు. ఇప్పటివరకు తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం జిల్లాల్లో 107 బైక్‌లను తస్కరించాడు. వీటిని జగ్గంపేట మండలం గోవిందపురానికి చెందిన మంగిన వీరబాబుకు విక్రయించేవాడు. నిందితులను కోర్టులో హాజరుపర్చామని ఎస్పీ చెప్పారు.  వాహనాల విలువ రూ.23 లక్షల వరకు ఉంటుందన్నారు. సీఐ బి.సూర్యఅప్పారావు, ఎస్సై టి.రఘునాథరావు, ఏఎస్సైలు నూకరాజు, సుబ్బారావు, కానిస్టేబుల్‌, హోంగార్డులను అభినందించి రివార్డులు అందజేశారు. ఏఎస్పీ అడ్మిన్‌ పి.శ్రీనివాస్‌, డీఎస్పీ బి.అప్పారావు పాల్గొన్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని