ముంచుతున్న మాయగాళ్లు!

పార్ట్‌టైం ఉద్యోగం కోసం వెతుకుతుండగా వాట్సప్‌నకు మెసేజ్‌ వచ్చింది.పెట్టుబడి పెట్టండి లాభం తీసుకోండి అంటూ సైబర్‌ నేరగాడు సందేశం పంపాడు.

Updated : 30 Nov 2022 03:21 IST

 రూ.14.59 లక్షలు దోచిన సైబర్‌ నేరగాడు

పటాన్‌చెరు అర్బన్‌: పార్ట్‌టైం ఉద్యోగం కోసం వెతుకుతుండగా వాట్సప్‌నకు మెసేజ్‌ వచ్చింది.పెట్టుబడి పెట్టండి లాభం తీసుకోండి అంటూ సైబర్‌ నేరగాడు సందేశం పంపాడు. నమ్మి అతను చెప్పిన విధంగా చేసిన ప్రైవేటు ఉద్యోగి నిలువునా మోసపోయాడు. జ్ఞానరాజు పటాన్‌చెరు మండలం ఇంద్రేశం గ్రామ పరిధిలో ఉంటూ.. మాదాపూర్‌లోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ నెల 26న వాట్సప్‌లో వచ్చిన మెసేజ్‌ని  ఓపెన్‌ చేశాడు. అది టెలిగ్రాంలో ఓపెన్‌ అయ్యింది. డబ్బు పెట్టుబడి పెడితే దానికి లాభం వస్తుందని సందేశం ఉంది. జ్ఞానరాజు తొలుత రూ.1000, తర్వాత రూ.5 వేలు పెడితే లాభం వచ్చింది. దీంతో రూ.80,000 ఒకసారి, రెండోసారి రూ.2.5 లక్షలు, ఇలా దఫదఫాలుగా రూ.6.5 లక్షలు వరకూ పెట్టాడు. అనంతరం స్నేహితుల వద్ద అప్పు తీసుకుని మరో రూ.8.09 లక్షల వరకూ  పెట్టగా,  పెట్టుబడి 14.59 లక్షలు అయింది.  పోర్టల్‌లో రూ. 22.69 లక్షలు కనిపిస్తోంది. విత్‌డ్రా చేసుకోవాలంటే మరో రూ.3.5 లక్షలు చెల్లించాలని చెప్పడంతో మోసపోయానని గ్రహించిన జ్ఞానరాజు సైబర్‌ క్రైమ్‌ విభాగంతోపాటు పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

రుణం అన్నాడు.. మొత్తం లాగేశాడు..

ఓ వ్యక్తి ఐదు సెకన్లలో రూ.5 లక్షల రుణం అని ఇస్తామన్న ప్రకటన చూసి మోసపోయాడు. ఈ ఘటన పటాన్‌చెరు ఠాణా పరిధిలో జరిగింది. ముత్తంగి గ్రామానికి చెందిన పాండు ప్రైవేటు ఉద్యోగి. ఈనెల 25న  తన ఫేస్‌బుక్‌ ఓపెన్‌ చేయగా అందులో 5 సెకన్లలో రూ.5 లక్షల రుణం ప్రకటన చూశాడు. అందులో సూచించిన నంబర్‌కు ఫోన్‌ చేశాడు. రుణం కావాలంటే ముందు రూ.2,500 చెల్లించాలన్నారు.     దస్త్రాల ఖర్చు కింద రూ.4,500,  బీమా కింద రూ.18,900, బ్యాంకు సపోర్టు చేయడం లేదని రూ.32 వేలు ఒకసారి, తర్వాత రూ.32,500, 15,500,  ఇలా దఫాదఫాలుగా మొత్తం రూ. 2.48 లక్షలు వేశాడు. అనంతరం అవతల వ్యక్తికి   ఫోన్‌ చేయగా స్విచ్చాఫ్‌ అని వచ్చింది. మోసపోయాయని గ్రహించి పటాన్‌చెరు ఠాణాలో ఫిర్యాదు ఇచ్చాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని