కారు మిగిల్చిన కన్నీటి సంద్రం

కారు నడిపే సమయంలో ఆవహించిన నిద్రమత్తు రోడ్డు ప్రమాదానికి కారణమైంది. ఈ విషాద ఘటన.. లోకం పోకడ ఎరుగని ఓ చిన్నారిని తల్లిదండ్రులకు దూరం చేసింది.

Updated : 10 Dec 2022 04:33 IST

ముగ్గురి ప్రాణాలు తీసిన నిద్రమత్తు

దొనకొండ, న్యూస్‌టుడే: కారు నడిపే సమయంలో ఆవహించిన నిద్రమత్తు రోడ్డు ప్రమాదానికి కారణమైంది. ఈ విషాద ఘటన.. లోకం పోకడ ఎరుగని ఓ చిన్నారిని తల్లిదండ్రులకు దూరం చేసింది. తన పైనే ఆశలు పెట్టుకుని జీవిస్తున్న ఓ కుటుంబానికి ఆధారాన్ని లేకుండా చేసింది. అప్పటి వరకు శుభకార్యంలో బంధుమిత్రులతో ఆనందంగా గడిపి ఆ జ్ఞాపకాలతో తిరిగి స్వగ్రామానికి వెళ్తున్న ఓ వృద్ధురాలిని బలి తీసుకుంది. ఈ దుర్ఘటన దొనకొండ మండలం రుద్రసముద్రం గ్రామ సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ముండ్లమూరు మండలం పులిపాడుకు చెందిన గుంటక రామలక్ష్మమ్మ(61) పెద్దారవీడు మండలం శివపురంలో బంధువుల గృహ ప్రవేశానికి వారం రోజుల క్రితం వెళ్లారు. శుక్రవారం స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. అదే గ్రామానికి చెందిన మహేంద్ర కుమారి కూడా తన ఏడాది వయసున్న పాపతో బయలుదేరింది. వీరందరినీ కారులో పులిపాడులో దింపి రావాలని బంధువైన నాగేశ్వరరెడ్డిని పురమాయించారు. అదే సమయంలో తాము కూడా కారులో సరదాగా వెళ్లి వస్తామని రామలక్ష్మమ్మ ముని మనవలైన మెట్టు సంతోష్‌రెడ్డి(11), పవన్‌ కుమార్‌ రెడ్డి బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు రుద్రసముద్రం వద్దకు రాగానే నాగేశ్వరరెడ్డి నిద్రమత్తులోకి జారుకున్నారు. ఈ సమయంలో ఎదురుగా ద్విచక్ర వాహనంపై వస్తున్న శెట్టినేని నరేంద్ర(27) అనే గ్రంథపాలకుడిని అదుపు తప్పి వేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో నరేంద్ర, సంతోష్‌రెడ్డి సంఘటనా స్థలంలోనే మృతిచెందగా, తీవ్ర గాయాలైన రామలక్ష్మమ్మను ఆసుపత్రికి తీసుకెళుతుండగా ప్రాణాలు విడిచారు. అదే కారులో ఉన్న పవన్‌ కుమార్‌ రెడ్డి, డ్రైవర్‌ నాగేశ్వరరెడ్డి, మహేంద్ర కుమారి, ఆమె ఏడాది వయసున్న పాపకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్సై శ్రీనివాసరావు తెలిపారు.

ఆ కుటుంబాల్లో విషాదం...: దర్శి మండలంలోని పులిపాడు గ్రామానికి చెందిన రామలక్ష్మమ్మకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. మనుమడి కుమారులైన ఇద్దరూ నాయనమ్మను వదిలిపెట్టడానికి తోడుగా వచ్చారు. మనుమడి భార్య అయిన మహేంద్ర కుమారి కూడా వారితో పాటు వెళ్లింది. వీరిలో ఇద్దరు మృతి చెందగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. దర్శి మండలంలోని చందలూరు గ్రామానికి చెందిన శెట్టినేని నరేంద్ర మార్కాపురం గురుకుల పాఠశాలలో గ్రంథపాలకుడిగా పనిచేస్తున్నారు. విధులు నిర్వహించడానికి ద్విచక్ర వాహనంపై వెళ్తూ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. కారును నడుపుతున్న నాగేశ్వరరెడ్డి గురువారం రాత్రి కోలాటం భజనలో పాల్గొని నిద్ర లేకుండా ఉన్నారు. ఉదయాన్నే వాహనం నడిపే సమయంలో నిద్ర ఆవహించడం ఈ ప్రమాదానికి కారణమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని