ISRO Recruitment Exam: గుండీలు తీసిన బంట్లు.. ఇస్రో ఉద్యోగ పరీక్షలో మోసం

ఇస్రోలో ‘విక్రమ్‌ సారాభాయ్‌ అంతరిక్ష కేంద్రం’ (వీఎస్‌ఎస్‌సీ)లో సాంకేతిక పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షలో అక్రమాలకు ప్రయత్నించినవారు కచ్చితంగా ఇలాంటి మోసాల్లో ఆరితేరినవారే అయి ఉంటారని పోలీసులు గట్టిగా అనుమానిస్తున్నారు.

Updated : 22 Feb 2024 14:43 IST

భారీ మొత్తాలు చేతులు మారి ఉంటాయంటున్న పోలీసులు

తిరువనంతపురం: ఇస్రోలో ‘విక్రమ్‌ సారాభాయ్‌ అంతరిక్ష కేంద్రం’ (వీఎస్‌ఎస్‌సీ)లో సాంకేతిక పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షలో అక్రమాలకు ప్రయత్నించినవారు కచ్చితంగా ఇలాంటి మోసాల్లో ఆరితేరినవారే అయి ఉంటారని పోలీసులు గట్టిగా అనుమానిస్తున్నారు. తమను ఆశ్రయించిన అభ్యర్థుల కోసం ప్రత్యేక తరహాలో షర్టులు కుట్టించి, వాటి గుండీ (బటన్‌)లోనే ఇమిడిపోయేలా సూక్ష్మ కెమెరా లెన్సులను అమర్చడం గురించి తెలుసుకున్నాక.. దీనివెనుక భారీ మొత్తాలు చేతులు మారి ఉంటాయని వారు భావిస్తున్నారు. వీరు ఉపయోగించిన సాంకేతికతను తెలుసుకోవడంపైనే కాకుండా దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఇలాంటివి గతంలో ఏమైనా జరిగాయా అనేది తెలుసుకునేలా విచారణ కొనసాగుతుందని తిరువనంతపురం పోలీసు కమిషనర్‌ నాగరాజు చకిలం మంగళవారం విలేకరులకు తెలిపారు. ‘ప్రత్యేకంగా రూపొందించిన ఎలక్ట్రానిక్‌ వస్తువుతోపాటు ఇయర్‌ పీస్‌, కెమెరా లెన్స్‌లు ఉపయోగించారు. ఇవి ఏ బ్రాండ్‌కు చెందినవి కావు. ప్రత్యేకంగా ఓ సాంకేతిక నిపుణుడి సాయంతో రూపొందించారు. దీనిలో సిమ్‌కార్డు కూడా పడుతుంది. నిందితులు పరీక్షకు ముందురోజు విమానంలో వచ్చారు. పక్కా ప్రణాళికతో ఉన్నారు. రెండ్రోజుల్లో మొత్తం నలుగురిని అరెస్టు చేశాం’ అని వివరించారు. ‘డబ్బులిస్తే పరీక్షలో ఉత్తీర్ణులయ్యేలా చేస్తామని నిందితులు నమ్మకం కల్పించారు. ప్రశ్నపత్రాలను ఒకచోటకు ఎలక్ట్రానిక్‌ విధానంలో చేరవేసి, అటునుంచి చెప్పే సమాధానాలు విని రాసేందుకు తగిన ఏర్పాట్లన్నీ చేశారు. ఇలాంటి మూడు పరికరాలను స్వాధీనం చేసుకున్నాం’ అని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని