ఆన్‌లైన్‌ గేమ్‌లకు కుటుంబం బలి

ఆన్‌లైన్‌ గేమ్‌లకు అలవాటు పడిన వ్యక్తి అందులో అప్పులపాలు కావడంతో ఏర్పడిన కుటుంబ తగాదాల నేపథ్యంలో భార్య, కుమారుడికి విషమిచ్చి.. అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌ ఠాణా పరిధిలో సోమవారం చోటుచేసుకుంది.

Updated : 09 Apr 2024 07:48 IST

మూడేళ్ల కుమారుడు, భార్యకు విషమిచ్చి భర్త ఆత్మహత్య

రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: ఆన్‌లైన్‌ గేమ్‌లకు అలవాటు పడిన వ్యక్తి అందులో అప్పులపాలు కావడంతో ఏర్పడిన కుటుంబ తగాదాల నేపథ్యంలో భార్య, కుమారుడికి విషమిచ్చి.. అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌ ఠాణా పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. రాజేంద్రనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగేంద్రబాబు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్ల మండలం పరిధిలోని మల్కాపూర్‌ గ్రామానికి చెందిన ఇందిర(38)కు గతంలో ఓ వ్యక్తితో వివాహం జరిగింది. ఆయన గుండెపోటుతో మృతి చెందాడు. అనంతరం ఆమె నాలుగేళ్ల క్రితం రామంతాపూర్‌కు చెందిన ఆనంద్‌(42)ను రెండో వివాహం చేసుకుంది. ఆనంద్‌ అప్పటికే మొదటి భార్యకు విడాకులిచ్చాడు. ఈ దంపతులు మూడేళ్లుగా బండ్లగూడజాగీర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని సన్‌సిటీలో ఓ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ కొనుగోలు చేసి నివసిస్తున్నారు. వారికి మూడేళ్ల కుమారుడు విక్కీ ఉన్నాడు. ఇందిర ప్రైవేటు ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఆనంద్‌ కొంతకాలం పాల వ్యాపారం చేశాడు. దాన్ని మానేసి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. అతనికి ఆన్‌లైన్‌ గేమ్‌లు ఆడే అలవాటు ఉండటంతో తరచూ అందులో డబ్బులు పోగొట్టుకునేవాడు.

ఈ క్రమంలో చేసిన అప్పులను తీర్చడానికి ఇందిరకు సంబంధించిన బంగారాన్ని విక్రయించడమే కాకుండా కారునూ అమ్మేశాడు. ఇటీవల ఫ్లాటును సైతం విక్రయిద్దామని ఇందిరతో అన్నాడు. ఈ విషయంలో దంపతుల మధ్య పలుమార్లు గొడవ జరిగింది. వారికి ఇందిర తల్లిదండ్రులు, బంధువులు సర్దిచెప్పారు. అయినా వివాదం సద్దుమణగకపోవడంతో వారిని మల్కాపూర్‌ గ్రామానికి రావాల్సిందిగా సూచించారు. దీంతో కుటుంబం సహా అక్కడికి వెళ్లాలని దంపతులు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే సోమవారం మధ్యాహ్నం ఆనంద్‌తో ఇందిర సోదరి ఫోన్లో మాట్లాడి గ్రామానికి రావాల్సిందిగా కోరింది. ఆమెతో వస్తున్నట్లు చెప్పిన ఆనంద్‌ తర్వాత తోడల్లుడికి ఫోన్‌ చేసి చనిపోతున్నట్లు చెప్పాడు. భార్య, కుమారుడికి కూల్‌డ్రింక్‌లో విషం కలిపి ఇచ్చి అతను కూడా తీసుకున్నట్లు భావిస్తున్నారు. ఆనంద్‌ భార్యను ఎప్పుడూ వేధించేవాడని ఇందిర కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆన్‌లైన్‌ గేమ్‌ల కారణంగానే ఆ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. రాజేంద్రనగర్‌ ఏసీపీ శ్రీనివాస్‌, ఇన్‌స్పెక్టర్‌ నాగేంద్రబాబు ఘటనా స్థలాన్ని  సందర్శించి.. మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని