Jharkhand: ఐఐటీ విద్యార్థినిపై లైంగిక వేధింపులు.. IAS అధికారి అరెస్టు

ప్రజల పట్ల ఎంతో బాధ్యతతో ప్రవర్తించాల్సిన అత్యున్నత సర్వీసులో ఉన్న ఉన్నతాధికారి ఓ విద్యార్థిని వద్ద తన వంకర బుద్ధిని బయటపెట్టాడు......

Updated : 08 Jul 2022 16:42 IST

ఖుంటి: ప్రజల పట్ల ఎంతో బాధ్యతతో ప్రవర్తించాల్సిన ఉన్నతాధికారి ఓ విద్యార్థిని వద్ద తన వంకర బుద్ధిని బయటపెట్టాడు. ఝార్ఖండ్‌లోని ఖుంటిలో ఐఐటీ విద్యార్థినిని లైంగికంగా వేధించిన ఐఏఎస్‌ అధికారిని అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. వేరే రాష్ట్రం నుంచి శిక్షణ కోసం ఝార్ఖండ్‌కు వచ్చిన తనతో ఐఏఎస్‌ అధికారి అసభ్యంగా ప్రవర్తించినట్టు ఖుంటి మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఆ విద్యార్థిని ఫిర్యాదు చేశారు. దీంతో 2019 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిని సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్టు జిల్లా ఎస్పీ అమన్‌ కుమార్‌ వివరించారు. సదరు అధికారిపై ఐపీసీ సెక్షన్లు 354ఎ, 509 కింద కేసులు నమోదు చేసినట్టు తెలిపారు.

బాధితురాలితో పాటు మొత్తం ఎనిమిది మంది ఐఐటీ విద్యార్థులు ట్రైనింగ్‌ కోసం ఝార్ఖండ్‌కు వచ్చారని.. అయితే, డిప్యూటీ డెవలప్‌మెంట్‌ కమిషనర్‌ శనివారం తన ఇంట్లో ఏర్పాటు చేసిన విందులో ఈ ఘటన జరిగినట్టు ఎస్పీ తెలిపారు. ఆ విందులో ఒంటరిగా ఉన్న విద్యార్థినిని గమనించిన ఐఏఎస్ అధికారి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొందన్నారు. ఈ కేసులో భాగంగా ఐఏఎస్‌ అధికారితో పాటు ఆ విందుకు హాజరైన మరికొందరు అతిథులను విచారించగా ఆ ఆరోపణలు ప్రాథమికంగా నిజమేనని తేలిందని ఎస్పీ తెలిపారు. విద్యార్థినిని వైద్య పరీక్షల కోసం పంపించినట్టు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని