Road Accident: ప.గో. జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జల్లేరులో విషాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు వంతెన పైనుంచి వాగులో పడింది..

Updated : 15 Dec 2021 14:43 IST

జంగారెడ్డిగూడెం: పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జల్లేరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జంగారెడ్డిగూడెం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వంతెన పైనుంచి ప్రమాదవశాత్తు వాగులో పడింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌ చిన్నారావుతో సహా తొమ్మిది మంది మృతి చెందారు. మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు వాగులో పడిన సమయంలో అందులో 47 మంది ప్రయాణికులు ఉన్నారు. మృతుల్లో ఎక్కువగా మహిళలు, చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. నీటిలో పడిన బస్సు నుంచి బయటికి రాలేెకే 9 మంది మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు. మృతుల్లో ఇప్పటివరకు ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ చిన్నారావు, పొడపాటి దుర్గ (తాడువాయి), కేత వరలక్ష్మి(ఎ.పోలవరం), ఎ.మధుబాబు (చిన్నంవారిగూడెం)ను గుర్తించారు. మిగిలిన ఐదుగురి వివరాలు తెలియాల్సి ఉంది.

బస్సు వేలేరుపాడు నుంచి జంగారెడ్డిగూడెం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. జల్లేరు వాగుపై ఉన్న వంతెన రెయిలింగ్‌ను ఢీకొని బస్సు వాగులో పడినట్లు స్థానికులు చెబుతున్నారు. బస్సులో ఉన్న మిగతా ప్రయాణికులను స్థానికులు పడవల సాయంతో ఒడ్డుకు చేర్చారు. ఘటనాస్థలిలో ఆర్డీవో, డీఎస్పీ ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ప్రమాదంపై విచారణకు ఆదేశించాం: పేర్ని నాని

బస్సు ప్రమాదంపై మంత్రి పేర్ని నాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ఆయన సానుభూతి తెలిపారు. మరోవైపు ప్రమాదంపై మంత్రి విచారణకు ఆదేశించారు. విచారణ జరిపి నివేదిక అందించాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని సీఎం జగన్‌ ఆదేశించారని పేర్ని నాని చెప్పారు. వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని సీఎం చెప్పారని మంత్రి వెల్లడించారు.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని