Crime News: గుంటూరు జిల్లాలో విషాదం: ఆరుగురు వేద పాఠశాల విద్యార్థులు మృతి

కృష్ణా నదిలో ఈతకు వెళ్లి ఆరుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. గంటూరు జిల్లా అచ్చంపేట మండలంలోని మాదిపాడు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. గల్లంతైన విద్యార్థులు స్థానిక

Updated : 10 Dec 2021 21:43 IST

అచ్చంపేట: గుంటూరు జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. కృష్ణా నదిలో ఈతకు వెళ్లిన ఆరుగురు విద్యార్థులు మృత్యువాత పడ్డారు.  స్థానికుల కథనం ప్రకారం... ఈరోజు మధ్యాహ్నం వేద పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు అచ్చంపేట మండలంలోని మాదిపాడు సమీపంలో కృష్ణానదిలో ఈతకు వెళ్లారు. ప్రమాదవశాత్తూ ఆరుగురు విద్యార్థులు నీటమునిగి మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో విద్యార్థుల మృతదేహాలను నదిలో నుంచి బయటకు తీశారు. మృతులు.. మధ్యప్రదేశ్‌కు చెందిన శివవర్మ(14), ఉత్తర్‌ ప్రదేశ్‌కు చెందిన నితీష్‌ కుమార్‌ దీక్షిత్‌ (15), హర్షిత్‌ శుక్లా(15), శుభం త్రివేది(17), అన్షునం శుక్లా(14), నరసరావుపేటకు చెందిన టీచరు కె.సుబ్రహ్మణ్యం(24)గా గుర్తించారు. మాదిపాడు సమీపంలోని శ్వేత శృంగా చలం వేద పాఠశాలలో గత ఐదేళ్ల నుంచి వేద విద్యను అభ్యసిస్తున్నారు. నదిలో సుడిగుండాల కారణంగానే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదాలు జరిగే ప్రదేశంలో కనీసం హెచ్చరిక బోర్డులు కూడా లేవని స్థానికులు చెబుతున్నారు. నదిలో ఇంకా విద్యార్థులు ఎవరైనా గల్లంతయ్యారేమోనన్న అనుమానంతో బోట్ల సాయంతో పోలీసులు గాలింపు చేపట్టారు. వేదపాఠశాల విద్యార్థుల మృతిపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులను అడిగి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని