logo
Updated : 07 Jul 2022 11:16 IST

Adilabad : నమ్మకమే చదివిస్తోంది.!

పిల్లలను సర్కారు బడులకు పంపిస్తున్న ఉద్యోగులు..
మామడ/నిర్మల్‌ పట్టణం, న్యూస్‌టుడే

తమకు ప్రభుత్వ ఉద్యోగం కావాలి. సర్కారు అమలుచేసే పథకాలు దక్కాలి. రాయితీలన్ని అందుకోవాలి. తమ పిల్లలు మాత్రం ప్రైవేటు బడుల్లోనే చదువుకోవాలన్న ఆలోచన చాలామందిలో కనిపిస్తోంది. అయితే అందరి అభిప్రాయం ఇలానే ఉండదని నిరూపిస్తున్నారు కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు. తమ పిల్లలను ప్రైవేటుకు పంపించకుండా సర్కారు బడులపై విశ్వాసాన్ని, నమ్మకాన్ని కనబరుస్తున్నారు.ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు.

ప్రభావం కనిపిస్తుంది..
అక్కడే పనిచేసే ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ పిల్లలను ఆ ఊళ్లోనే చదివిస్తే స్థానికుల్లో నమ్మకం కలుగుతుంది. వాళ్ల పిల్లలే ఇక్కడే చదువుతున్నారంటే అన్నివిధాలా బాగున్నట్లే కదా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతాయి. తమ పిల్లలను ఇతర చోట్లకు పంపడమెందుకునే భావన కలుగుతుంది. ఈ దిశగా ప్రభుత్వ ఉద్యోగులంతా ఆలోచిస్తే సర్కారు బడులు మరింత కళకళలాడుతాయి.


ఇక్కడైతే చక్కని బోధన..


పాఠాలు నేర్చుకుంటున్న విద్యశ్రీ

తానూరు మండలం బెల్‌తరోడా గ్రామానికి చెందిన ఎం.సాయిలు అదే మండలంలోని హిప్నెల్లి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నారు. ఆయన కుమార్తె విద్యశ్రీని ప్రైవేటులో కాకుండా స్వగ్రామంలో ఉన్న ప్రభుత్వ బడిలో చదివిస్తున్నారు. పోటీ పరీక్షల్లో నెగ్గి, బోధనలో శిక్షణ పొందినవారు సర్కారు బడుల్లో పాఠాలు బోధిస్తుంటారని, ప్రైవేటుకన్నా ఇక్కడైతేనే మెరుగైన విద్య అందుతుందన్న నమ్మకంతోనే తన కుమార్తెను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించినట్లు సాయిలు పేర్కొంటున్నారు.


తండ్రి సాయిలు


అమ్మవెంటే.. కుమారుడు


కుమారుడిని తీసుకెళ్తున్న నాజియా

నిర్మల్‌ పట్టణం జుమ్మెరాత్‌పేట్‌ ఉన్నత పాఠశాలలో బోధనేతర విధులు నిర్వర్తిస్తున్న నాజియా గత నాలుగేళ్లుగా తన కుమారుడు దానిష్‌ను అదే పాఠశాలలో చదివిస్తున్నారు. పట్టణంలో ఎన్ని ప్రైవేటు పాఠశాలలున్నా, చదివించే స్థోమతున్నా నాణ్యమైన విద్య అందుతుందున్న నమ్మకమే ఆమెను సర్కారు వైపు అడుగులు వేయించింది. ఆ బడిలో ఆంగ్ల మాధ్యమం అందుబాటులో ఉండటంతో ఎక్కడో ఉన్న ప్రైవేటుకు ఎందుకని తన వెంటే తీసుకెళ్తానని నాజియా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


తనవెంటే కుమారుడు..


బెల్‌తరోడా ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్న సాయిమేదాన్ష్‌

భైంసా: భైంసా పట్టణానికి చెందిన కులకర్ణి గజానన్‌రావు తానూరు మండలం బెల్‌తరోడా పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆయన కుమారుడు సాయిమేదాన్ష్‌ ప్రస్తుతం అయిదో తరగతి చదువుతున్నాడు. దాదాపు 15 కి.మీ. దూరంలో ఉన్న సర్కారు బడికి నిత్యం తనవెంటే కుమారుడిని తీసుకెళ్లి అక్కడే చదివిస్తున్నాడు. పనిచేసే ప్రదేశంలో బడీడు పిల్లలను బడికి పంపాలంటే అక్కడి గ్రామస్థులకు నమ్మకం కుదరాలి. ఉపాధ్యాయులు తమ పిల్లలను వారు పనిచేసే పాఠశాలలో చదివిస్తే ఎంతో భరోసాగా ఉంటుందని గజానన్‌రావు అభిప్రాయపడ్డారు.


తండ్రి గజానన్‌రావు


ఆ ఇంటి పిల్లలంతా..


ప్రభుత్వ పాఠశాలకు వెళ్తున్న పిల్లలతో శ్రావణ్‌కుమార్‌ కుటుంబసభ్యులు

కుంటాలకు చెందిన చాట్ల శ్రావణ్‌కుమార్‌ ఓల ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కాగా, ఆయన సోదరి సరస్వతి మాటెగాం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. వీరిద్దరూ తమ పిల్లలను కుంటాల మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో చదివిస్తున్నారు. శ్రావణ్‌ పిల్లలు ధన్వి 7వ తరగతి కాగా, పాంచజన్య మిత్ర 6వ తరగతి చదువుతోంది. సరస్వతి కుమార్తె శరధృతిక 9వ తరగతి అభ్యసిస్తోంది. కార్పొరేట్‌ పాఠశాలల్లో చదివించే స్థోమత ఉన్నా ప్రభుత్వ బడులపై ఉన్న నమ్మకం, విశ్వాసమే వీరిని అక్కడ చదివించేలా చేసింది. మా నాన్న, మేము అందరం సర్కారు బడుల్లోనే చదివామని, అంతకుమించిన బోధన మరెక్కడా ఉండదన్న ధీమా తమకుందని ఆశాభావం వ్యక్తంచేశారు.

Read latest Adilabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని