logo

తూర్పున ఉత్సాహం.. పశ్చిమాన నైరాశ్యం

ఉమ్మడి జిల్లాలో లోక్‌సభ ఎన్నికల ప్రచార శైలి భిన్నంగా సాగుతోంది. తూర్పున పెద్దపల్లి లోక్‌సభ స్థానం పరిధిలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరులో ప్రచారం ఉత్సాహంగా సాగుతుంటే పశ్చిమాన ఆదిలాబాద్‌ నియోజకవర్గంలోకి వచ్చే సిర్పూర్‌, ఆసిఫాబాద్‌, ఖానాపూర్‌, ఆదిలాబాద్‌, బోథ్‌, నిర్మల్‌, ముథోల్‌లో మందకొడిగా కొనసాగుతోంది.

Published : 26 Apr 2024 02:45 IST

పార్టీల ప్రచార సరళిపై నివేదికలు

ఈటీవీ - ఆదిలాబాద్‌ : ఉమ్మడి జిల్లాలో లోక్‌సభ ఎన్నికల ప్రచార శైలి భిన్నంగా సాగుతోంది. తూర్పున పెద్దపల్లి లోక్‌సభ స్థానం పరిధిలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరులో ప్రచారం ఉత్సాహంగా సాగుతుంటే పశ్చిమాన ఆదిలాబాద్‌ నియోజకవర్గంలోకి వచ్చే సిర్పూర్‌, ఆసిఫాబాద్‌, ఖానాపూర్‌, ఆదిలాబాద్‌, బోథ్‌, నిర్మల్‌, ముథోల్‌లో మందకొడిగా కొనసాగుతోంది. కాంగ్రెస్‌, భాజపా, భారాస ప్రచారం ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో రీతిలో సాగుతోంది. కొన్ని చోట్ల కీలకనేతలు అన్నీ తామై పని చేస్తుండటం శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. మరికొన్ని చోట్ల అంటీముట్టనట్లుగా ఉండటం వారిని అంతర్మథనానికి గురి చేస్తోంది.

కాంగ్రెస్‌ - గడ్డం వంశీకృష్ణ, ఆత్రం సుగుణ

మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు ఎమ్మెల్యేలు ప్రేంసాగర్‌రావు, వినోద్‌, వివేక్‌ ప్రచార సరళి బాగానే ఉందనే నివేదిక ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(పీసీసీ)కి వెళ్లింది. ఇది వరకున్న గ్రూపు రాజకీయాలను పక్కనపెట్టి పని చేయటం ప్రచార లోపం లేకుండా చేస్తోందనే అభిప్రాయం వచ్చింది. ఫలితంగా భారాస, భాజపా నేతల అనైక్యతను అనుకూలంగా మార్చుకునే వ్యూహంతో కాంగ్రెస్‌ ముందుకు సాగుతోంది. ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోకి వచ్చే సిర్పూర్‌, నిర్మల్‌, బోథ్‌లో ప్రచారం బాగానే ఉన్నా.. మిగిలిన ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, ఖానాపూర్‌, ముథోల్‌లో ఆశించిన రీతిలో లేదనే విషయం బయటపడింది. మంత్రి సీతక్క సైతం ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నారనే విమర్శలు రావటం, ఈ నెల 22న సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన తర్వాత కూడా పెద్దగా మార్పులేదనే అభిప్రాయం పీసీసీ దృష్టికి వెళ్లింది. అన్నింటిని క్రోడీకరించి ఈ నెల 28 నుంచి నేతల వారీగా సమాచారం సేకరణ చేయాలని పీసీసీ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.

భారాస - ఆత్రం సక్కు, కొప్పుల ఈశ్వర్‌

ఆసిఫాబాద్‌, బోథ్‌లో అనుకూలమైన వాతావరణం ఉందనే వ్యూహంతో ముందుకు వెళ్తున్న భారాస మిగిలిన ఆదిలాబాద్‌, నిర్మల్‌, ముథోల్‌, సిర్పూర్‌, ఖానాపూర్‌పై దృష్టి సారించింది. ఖానాపూర్‌లో నియోజకవర్గ ఇన్‌ఛార్జి స్థానికంగా ఉండటం లేదని ఫిర్యాదు వచ్చింది. నిర్మల్‌లో బలం పెంచుకోవచ్చనే భారాస భావిస్తోంది. మంచిర్యాల జిల్లాలో నేతల తీరు ఆశాజనకంగా లేదని శ్రేణుల మనోగతంగా ఉంది. వచ్చే నెల 4న కేసీఆర్‌ బస్సు యాత్ర లోపు క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని పెంచటంపై పార్టీ దృష్టి సారించింది. ఉమ్మడి జిల్లాలో మిగిలిన ముఖ్య నేతలతో పాటు పార్టీని వీడకుండా ఉండే వారికి కీలక బాధ్యతలను అప్పగించాలని భారాస భావిస్తోంది.

భాజపా -  గోమాసె శ్రీనివాస్‌, గోడం నగేష్‌

మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లిలో కమలం పార్టీ ప్రచారం మందకొడిగా కొనసాగుతోంది. శాసనసభ ఎన్నికల్లో మంచిర్యాల నియోజకవర్గంలో భారాస కంటే ఎక్కువ వచ్చిన ఓట్లను సైతం ప్రస్తుతం సద్వినియోగం చేసుకునే ప్రయత్నం లేదనే జిల్లా నేతల ఫిర్యాదు దిల్లీ వరకు వెళ్లింది. అప్రమత్తమైన అధిష్ఠానం ఉమ్మడి జిల్లాలో పార్టీ ప్రచార శైలిపై ఆరా తీసింది. సిట్టింగ్‌ ఎంపీ స్థానమైన ఆదిలాబాద్‌లో నలుగురు ఎమ్మెల్యేలు మహేశ్వర్‌రెడ్డి, పాయల్‌శంకర్‌, పాల్వాయి హరీశ్‌బాబు, రామారావు పటేల్‌ మధ్య సఖ్యత లేదనే విషయాన్ని వారు ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. ఈ నెలలో మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌శిందే, విదేశాంగ మంత్రి శివశంకర్‌, ఓబీసీ నేత డా.లక్ష్మణ్‌ పర్యటనలు రద్దు కావటం నైరాశ్యం నింపిందనే సూచనలతో ఏకీభవించిన అధిష్ఠానం త్వరలోనే జోష్‌ నింపుతామని హామీ ఇచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు