logo

తుక్కు పేరిట అక్రమ దందా!

అనుమతులు, లైసెన్సులు లేకుండానే పలువురు ‘తుక్కు’ పేరిట జిల్లాలో అక్రమ దందా కొనసాగిస్తున్నారు. జిల్లాలోని ప్రధాన రహదారుల సమీపంలోని పెద్ద ప్రహరీలతో కూడిన గోదాములను ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు సాగిస్తున్నారు.

Published : 26 Apr 2024 02:56 IST

తీవ్రమైన ఎండల్లో పొంచి ఉన్న ప్రమాదం

కాగజ్‌నగర్‌-సిర్పూర్‌(టి) ప్రధాన రహదారిపై ఓ తుక్కు దుకాణం

కాగజ్‌నగర్‌, న్యూస్‌టుడే: అనుమతులు, లైసెన్సులు లేకుండానే పలువురు ‘తుక్కు’ పేరిట జిల్లాలో అక్రమ దందా కొనసాగిస్తున్నారు. జిల్లాలోని ప్రధాన రహదారుల సమీపంలోని పెద్ద ప్రహరీలతో కూడిన గోదాములను ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు సాగిస్తున్నారు. కాగజ్‌నగర్‌లోని ఎస్పీఎంతోపాటు, ప్రభుత్వ కార్యాలయాలు, ఎస్పీఎం, ఈఎస్‌ఐ ఖాళీ క్వార్టర్ల ఇనుప కిటికీలు, ద్వారాలు అపహరణకు గురవుతున్నాయి. రైతులు ఏర్పాటు చేసుకున్న విద్యుత్తు నియంత్రికలను కూడా ధ్వంసం చేసి అందులోని రాగి తీగను దొంగిలిస్తున్నారు. డిస్కం అధికారులు గతేడాది కాగజ్‌నగర్‌ మండలం అందెవెల్లిలో ఓ నియంత్రిక ధ్వంసంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. నిరుపయోగం, వినియోగంలో లేని వివిధ వస్తువులను మాత్రమే కొనుగోలు చేసి, అపహరణ పాల్పడిన సామగ్రిని కొనుగోలు చేయరాదంటూ స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ.. సదరు వ్యాపారులు నిబంధనలు బేఖాతరు చేస్తూ చోరీ సామగ్రి కొంటున్నారు. తదనంతరం అధిక ధరలకు విక్రయించి ఇతర ప్రాంతాలకు తరలించి లాభాలు గడిస్తున్నారు. వ్యాపారులు బెదిరించి అతి తక్కువ ధరకు చోరీలకు పాల్పడిన వారినుంచి సామగ్రి కొంటున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

పొంచి ఉన్న ప్రమాదం

ప్రస్తుతం ఎండలు మండిపోతున్న తరుణంలో.. కనీస ప్రమాణాలు పాటించక పోవడంతో తరచూ హైదరాబాద్‌ వంటి ఏరియాల్లోని తుక్కు కేంద్రాల్లో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేంద్రాల్లో నిరుపయోగంగా అట్టలు, కాగితాలు, ప్లాస్టిక్‌ డబ్బాలు, సీసాలు, ఇతర సామగ్రి ఇష్టారాజ్యంగా ఆరుబయటనే పడేసి ఉండటం, ఈ కేంద్రాలు పలు కాలనీల మధ్యలోనే ఉండటంతో.. అగ్నిప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అగ్నిమాపక అధికారులు, పోలీసులు సైతం ‘మాములు’గానే వదిలి వేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

  • జిల్లాలోని ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌, రెబ్బెన, వాంకిడి, తదితర మండలాల్లో దాదాపు 20కి పైనే తుక్కు దుకాణాలు వెలిశాయి. సదరు వ్యాపారులు పురపాలిక, పంచాయతీ, అగ్నిమాపక సిబ్బంది నుంచి విధిగా లైసెన్సులు తీసుకోవాలి. నిబంధనలను పాటిస్తూ వ్యాపారాన్ని కొనసాగించాలి. సంబంధిత అధికారులు, ఆయా పోలీస్‌స్టేషన్ల పరిధిలోని అధికారులు ఆ వ్యాపారంపై నిత్యం నిఘా ఉంచాలి. వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి దుకాణాల పరిధిలోని ఆయా శాఖల అధికారులు సైతం తనిఖీలు చేయకుండానే ‘మామూలు’ గానే వదిలి వేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

మరో కొత్త దందా..

వివిధ రాష్ట్రాల్లోని అంతర్రాష్ట్ర ముఠా సభ్యులు చోరీలకు పాల్పడిన లారీలు, కార్లు, ద్విచక్రవాహనాలు, ఇతర సామగ్రిని గుట్టుచప్పుడు కాకుండా తుక్కు వ్యాపారులకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. తమ దగ్గరి గ్యాస్‌ కట్టర్స్‌ సహాయంతో పెద్ద వాహనాలను సైతం తుక్కుగా మార్చి, వాటిని ఇతర ప్రాంతాల్లోని పరిశ్రమలకు విక్రయిస్తున్నట్లు సమాచారం. గతంలో ఇలాంటి దందా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, తదితర రాష్ట్రాల్లోనే కొనసాగుతుండగా.. ప్రస్తుతం జిల్లాకు కూడా పాకింది. పలువురు తుక్కు వ్యాపారులు ఆ దందాను కొనసాగిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. రెండేళ్ల వ్యవధిలో కాగజ్‌నగర్‌లోని మూడు లారీలు మాయమయ్యాయి. అవి మహారాష్ట్ర నుంచి ఇతర రాష్ట్రాలకు గుర్తుతెలియని వ్యక్తులు తరలించినట్లు ఆయా ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీల సహాయంతో పోలీసులు ప్రాథమిక సమాచారాన్ని సేకరించారు. ఆ లారీ కేసును నేటికీ  పోలీసులు ఛేదించకపోవడం గమనార్హం.

చర్యలు తీసుకుంటాం: కరుణాకర్‌, డీఎస్పీ

తుక్కు వ్యాపారులపై నిఘా పెంచి చర్యలు తీసుకుంటాం. చోరీలకు పాల్పడిన వస్తువులను కొనుగోలు చేయరాదంటూ ఇప్పటికే పలు మార్లు వ్యాపారులకు హెచ్చరించాం. అయినప్పటికీ ఆ దుకాణాలపై నిత్యం తనిఖీలు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని