logo

మళ్లీ వస్తా.. ఐటీ పార్కు ప్రారంభిస్తా

‘మళ్లీ ఆదిలాబాద్‌కు త్వరలో వస్తా.. పట్టణంలో ఐటీ పార్కుని ప్రారంభిస్తా.. త్వరలోనే దీనికోసం స్థలాన్ని సేకరించాలని ఆదేశించాం’ అని పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ఆదిలాబాద్‌ పట్టణంలోని ప్రభుత్వ భవనంలో బీఎన్‌డీటీ, ఎన్‌టీటీ డాటా సంస్థల

Published : 27 Sep 2022 05:25 IST

పురపాలక, ఐటీ మంత్రి కేటీఆర్‌

ఐటీ ఉద్యోగులతో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌, చిత్రంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్సీ విఠల్‌, ఆదిలాబాద్‌ జడ్పీ ఛైర్మన్‌ జనార్దన్‌ రాఠోడ్‌, ఎమ్మెల్యే రాఠోడ్‌ బాపురావు, కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌

ఆదిలాబాద్‌ పట్టణం, న్యూస్‌టుడే: ‘మళ్లీ ఆదిలాబాద్‌కు త్వరలో వస్తా.. పట్టణంలో ఐటీ పార్కుని ప్రారంభిస్తా.. త్వరలోనే దీనికోసం స్థలాన్ని సేకరించాలని ఆదేశించాం’ అని పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ఆదిలాబాద్‌ పట్టణంలోని ప్రభుత్వ భవనంలో బీఎన్‌డీటీ, ఎన్‌టీటీ డాటా సంస్థల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఐటీ కంపెనీ కార్యాలయాన్ని ఆయన సోమవారం సందర్శించారు. ముందుగా ఆయనకు గుస్సాడీ నృత్యాలు, బాజాభజంత్రీలతో ఘనస్వాగతం పలికారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.  సంస్థ ప్రతినిధులు, ఐటీ ఉద్యోగులతో మంత్రి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ఆదిలాబాద్‌ అంటే అభివృద్ధికి ఆమడదూరంగా ఉందని పేరుండేదని.. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. ఇక్కడి పిల్లలు సైతం ఎవరికీ తీసిపోరని నిరూపిస్తున్నారని వివరించారు. ఆదిలాబాద్‌లో ఐటీ టవర్‌ ఏర్పాటుచేస్తే స్థానిక యువతకు ఉద్యోగాలు వస్తాయని ఎమ్మెల్యే జోగురామన్న పట్టుబట్టడంతోనే ఇక్కడ ప్రయివేటు కంపెనీ ముందుకొచ్చిందని కొనియాడారు. కంపెనీ ఏర్పాటుకు కృషిచేసిన ఆ సంస్థ ప్రతినిధి సంజయ్‌దేశ్‌పాండేను అందరిముందు అభినందించారు.

విదేశాల్లో ఉన్నవారు ఆసక్తిచూపాలి..

ఆదిలాబాద్‌లో ఏర్పాటుచేసే ఐటీ పార్కులో కంపెనీలు పెట్టి ఉద్యోగాలు కల్పించేందుకు విదేశాల్లో ఉన్న పూర్వ ఆదిలాబాద్‌ బిడ్డలు ఆసక్తి చూపాలని మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. తద్వారా కంపెనీలు పెరిగి ఇక్కడ చాలామందికి ఉద్యోగవకాశాలు లభిస్తాయని వివరించారు. ఇప్పటికే ఐటీ రంగంలో స్థిరపడ్డ ఆదిలాబాద్‌ వాసులు చాలామంది ఉన్నారని గుర్తుచేశారు. తన పరంగాను కృషిచేస్తానని వివరించారు.

పర్యాటకంపై దృష్టి సారిస్తే బాగు..

హైదరాబాద్‌ వంటి ప్రాంతాల్లో వారంతంలో కాలక్షేపానికి ఎలాంటి సదుపాయాలు ఉండవని వివరించారు. అదే ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లావ్యాప్తంగా ఎన్నో సుందరమైన పర్యాటక ప్రాంతాలున్నాయని పేర్కొన్నారు. అందుకనే ఆదిలాబాద్‌ను కశ్మీర్‌తో పోలుస్తారని పేర్కొన్నారు. ఇక్కడ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాని సమావేశంలో పర్యాటక మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను కోరారు. తద్వారా హైదరాబాద్‌ నుంచి ఇక్కడికి వచ్చే ఐటీ కంపెనీ ఉద్యోగులు ఇక్కడ ఐటీ టవర్‌ ఉందని తెలుసుకొని పనిచేసేందుకు ఆసక్తిచూపే అవకాశం ఉందన్నారు.

తెరాస శ్రేణుల ర్యాలీ మధ్య ఆదిలాబాద్‌ పట్టణాన్ని వీక్షిస్తున్న మంత్రి కేటీఆర్‌

మంత్రిని కలిసిన కౌన్సిలర్లు

మంత్రిని స్థానిక పురపాలక కౌన్సిలర్లు, తెరాస శ్రేణులు ప్రత్యేకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందించి తమ పరిచయం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, జడ్పీ ఛైర్మన్‌ జనార్దన్‌ రాఠోడ్‌, ఎమ్మెల్సీలు దండేవిఠల్‌, శంభీపూర్‌రాజు, పురపాలక ఛైర్మన్‌ జోగుప్రేమేందర్‌తోపాటు మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఐటీడీఏ పీఓ వరుణ్‌రెడ్డి, అదనపు పాలనాధికారి రిజ్వాన్‌ బాషా షేక్‌, పురపాలక వైస్‌ఛైర్మన్‌ జహీర్‌రంజాని తదితరులు పాల్గొన్నారు.


రూ. 1.50 కోట్లు మంజూరు

ఆదిలాబాద్‌లోని పశుసంవర్థకశాఖ ఆవరణలోని ప్రభుత్వ భవనంలో కొనసాగుతున్న ఐటీ కంపెనీ కార్యాలయంలోని సమస్యలను ఉద్యోగులు వివరించడంతో మంత్రి కేటీఆర్‌ తక్షణమే రూ.1.50 కోట్లు మంజూరు చేశారు. కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌తోపాటు కార్యాలయ ఆధునీకరణ కోసం వీటిని వెంటనే విడుదల చేయనున్నట్లు వివరించారు. పనులను పూర్తిచేసే బాధ్యత జిల్లా పాలనాధికారి సిక్తాపట్నాయక్‌ చూడాలని ఆదేశించారు.

* కేటీఆర్‌ నేతృత్వంలోని మంత్రుల బృందం పర్యటించడం తెరాస శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.  తెరాస రెండోసారి అధికారపగ్గాలు చేపట్టిన తరువాత మంత్రులు పర్యటించడం ఇదే ప్రథమం కావడంతో నేతల్లోనూ జోష్‌ నింపింది.

* జోగు రామన్న ఇంటివద్ద కేటీఆర్‌ స్వయంగా జిల్లా నేతల పేర్లను ప్రస్తావించడంతో అంతర్గత అసంతృప్తిని తగ్గించే ప్రయత్నం చేశారనే అభిప్రాయం శ్రేణుల్లో వ్యక్తమైంది. రామన్న ఇంటి వద్ద అందరి సమక్షంలోనే బోథ్‌ ఎమ్మెల్యే రాఠోడ్‌ బాపురావు, బోథ్‌ ఎంపీపీ తులశ్రీనివాస్‌లను కలిసి పనిచేయాలని కేటీఆర్‌ మందలించడం చర్చనీయాంశమైంది.

* మాతృవియోగమైన ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న పరామర్శించేందుకు మంత్రి కేటీఆర్‌ తొలుత హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో నేరుగా జైనథ్‌ మండలం కేంద్రానికి వచ్చారు. అక్కడి నుంచి రోడ్డుమార్గాన అదే మండలంలోని దీపాయిగూడ వెళ్లారు. అనంతరం రోడ్డుమార్గాన ఆదిలాబాద్‌ చేరుకున్నారు. మావల బైపాస్‌ నుంచి వచ్చిన మంత్రులకు స్వాగతం పలికేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అక్కడి నుంచి వందలాదిగా ద్విచక్రవాహనాలతో ర్యాలీగా ఐటీ కార్యాలయానికి బయల్దేరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని