logo

కార్మికులు, కర్షకుల సమ్మిళితం.. బెల్లంపల్లి

దక్షిణ భారతదేశానికి వెలుగులు నింపిన సింగరేణి కాలరీస్‌ కంపెనీలో బొగ్గుగనుల క్షేత్రంగా కీలక పాత్ర పోషించింది ‘బెల్లంపల్లి’ మాత్రమే. ఖమ్మం జిల్లా ఇల్లందులో ప్రారంభమైన సింగరేణి ప్రస్థానం 1928 నుంచి బెల్లంపల్లిలో విస్తరించింది.

Published : 30 Oct 2023 03:50 IST

బెల్లంపల్లి రైల్వేస్టేషన్‌

దక్షిణ భారతదేశానికి వెలుగులు నింపిన సింగరేణి కాలరీస్‌ కంపెనీలో బొగ్గుగనుల క్షేత్రంగా కీలక పాత్ర పోషించింది ‘బెల్లంపల్లి’ మాత్రమే. ఖమ్మం జిల్లా ఇల్లందులో ప్రారంభమైన సింగరేణి ప్రస్థానం 1928 నుంచి బెల్లంపల్లిలో విస్తరించింది. దేశంలోని అన్నిరాష్ట్రాలకు చెందిన అధికారులు, సాంకేతిక నిపుణులతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన వారితో సమ్మిళతమైన ‘బెల్లంపల్లి’లో అన్ని సంప్రదాయాలు, సంస్కృతులు కనిపిస్తాయి. ఇక్కడ ప్రధానంగా సింగరేణిËతో పాటు దేవాపూర్‌ సిమెంట్‌ కార్మాగారం, వ్యవసాయరంగాలపై ఆధారపడి ఉంది. బెల్లంపల్లి, తాండూరు, కాసిపేట మండలాల్లో సింగరేణి కార్మికులుండగా నెన్నెల, భీమిని, కన్నెపల్లి, వేమనపల్లి మండలాల్లో వరి, పత్తి ఉద్యాన పంటలు సాగు చేస్తారు.

బెల్లంపల్లి, కాసిపేట, న్యూస్‌టుడే: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో గతంలో ఆసిఫాబాద్‌ నియోజకవర్గం పరిధిలో ఉన్న ‘బెల్లంపల్లి’ పట్టణం సింగరేణి బొగ్గుగనులకు పుట్టినిల్లు. 1972 ఎన్నికల వరకు ఎస్టీలకు రిజర్వు చేసిన ఆసిఫాబాద్‌ నియోజకవర్గం 1978 నుంచి ఎస్సీలకు రిజర్వు చేశారు. అప్పటి నుంచి ఆసిఫాబాద్‌ నియోజకవర్గం పరిధిలో ఉన్న బెల్లంపల్లి పట్టణం నుంచి ప్రతిసారి ఎన్నికల బరిలో నిలిచిన వారే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.

ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలో కీలకంగా ఉన్న బెల్లంపల్లి పట్టణం కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉండేది. ఇక్కడ సింగరేణి భూగర్భగనులు, విభాగాలు విస్తరించడంతో వేలాది మంది కార్మికులు ఇక్కడే తమ కుటుంబాలతో నివసించే వారు. భూగర్భ గనులు నియోజకవర్గంలోని తాండూరు, రెబ్బెన మండలాలకు విస్తరించడంతో నియోజకవర్గంలో కార్మికులు, వారి కుటుంబాల మద్దతు ప్రతిసారి అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐకి ఎక్కువగానే ఉండేది. ఆ కారణంగానే ఆసిఫాబాద్‌ నియోజకవర్గం నుంచి సీపీఐ అభ్యర్థిగా బరిలో ఉన్న గుండా మల్లేష్‌ మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009లో నియోజక వర్గాల పునర్విభజనలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పదో నియోజకవర్గంగా బెల్లంపల్లి ఆవిర్భవించింది. అంతకుముందు చెన్నూరు నియోజకవర్గంలో ఉన్న నెన్నెల, వేమనపల్లి మండలాలతో పాటు లక్షెట్టిపేట పరిధిలో ఉన్న కాసిపేట మండలం బెల్లంపల్లి నియోజకవర్గంలో విలీనమయ్యాయి. ఈ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో సింగరేణి కార్మికులు అధికంగా ఉండటంతో మొదటిసారి బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన సీపీఐ అభ్యర్థి గుండా మల్లేష్‌ ఎమ్మెల్యేగా మళ్లీ కార్మికులు, వారి కుటుంబాల మద్దతుతో గెలుపొందారు. ఇలా సీపీఐ విజయ పరంపర కొనసాగింది. 1999 సంవత్సరంలో పాటి సుభద్ర, 2004లో అమురాజుల శ్రీదేవి ఆసిఫాబాద్‌ నుంచి తెదేపా తరపున పోటీ చేసి గెలవడానికి కార్మికుల ఓట్లు కారణమయ్యాయి. 1978లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా  దాసరి నర్సయ్య సింగరేణి  ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించారు. తిరిగి 1989లో పోటీ చేసిన దాసరి నర్సయ్య మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో జరిగిన ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా బరిలో నిలిచిన దుర్గం చిన్నయ్య ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన 2018లో పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక్కడ ఎవరు విజయం సాధించాలన్నా బెల్లంపల్లి పట్టణంలోని ఓట్లు కీలకం. అందులో సింగరేణి కార్మికులు, వారి కుటుంబాల ఓట్లు అధిక ప్రభావం చూపిస్తాయి.

భూగర్భగనుల మూత.. విభాగాల తరలింపుతో..

బెల్లంపల్లి పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక భూగర్భగనులు వాటికి అనుబంధంగా విభాగాలు కొనసాగేవి. 2003 వరకు బెల్లంపల్లి పట్టణంలో 30 వేలకు పైగా కార్మికులు వారి కుటుంబాలు నివసించేవారు. 2004 - 05 వరకు బెల్లంపల్లి ఏరియాలో  ఉన్న అన్ని భూగర్భగనులు మూసివేస్తు వచ్చారు. దీంతో బెల్లంపల్లి పట్టణం ఉనికి కోల్పోయే పరిస్థితి వచ్చింది.

వ్యవసాయం.. సిమెంట్‌ కర్మాగారం

ఇక్కడ ప్రధానంగా సింగరేణితో పాటు దేవాపూర్‌ సిమెంట్‌ కర్మాగారం, వ్యవసాయరంగాలపై ఆధారపడి ఉంది. బెల్లంపల్లి, తాండూరు, కాసిపేట మండలాల్లో సింగరేణి కార్మికులుండగా నెన్నెల, భీమిని, కన్నెపల్లి, వేమనపల్లి మండలాల్లో వ్యవసాయరంగం ఉంది. బెల్లంపల్లి, నెన్నెల మండలాల్లో ఎక్కువగా మామిడి పంటలు సాగుచేస్తారు. కాసిపేట మండలంలోని దేవాపూర్‌ గ్రామ శివారులోని గుట్టలు సిమెంట్‌ తయారీలో ముడిసరకైన సున్నపురాయి నిల్వలు గుర్తించారు. 1982లో ఓరియంట్ సిమెంట్ కర్మాగారాన్ని ప్రారంభించి సిమెంట్‌ ఉత్పత్తిని ప్రారంభించారు. ఇప్పటికి నాలుగు యునిట్లతో ఉత్పత్తి చేస్తున్నారు. ఇక్కడ దేశంలోని పలురాష్ట్రాల నుంచి ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు.

దేశం అభివృద్ధి చెందడమంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు పౌరుని నైతికాభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి 

అంబేడ్కర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని