logo

నాడు గిరిజనులను కాల్చి చంపింది కాంగ్రెస్‌ పార్టే..

నాడు హక్కుల కోసం పోరాడిన గిరిజనులను ఇంద్రవెల్లిలో కాల్చి చంపిందే కాంగ్రెస్‌ ప్రభుత్వం. అంత పెద్ద తప్పు చేసి అమరవీరులకు క్షమాపణలు చెప్పకుండా సిగ్గు లేకుండా ఆ పార్టీ సీఎం రేవంత్‌రెడ్డి ఇంద్రవెల్లిలో ఏ ముఖం పెట్టుకొని సభ ఏర్పాటు చేశారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ప్రశ్నించారు

Updated : 17 Apr 2024 07:00 IST

ప్రభుత్వ ఉద్యోగులతో మాది పేగు బంధం

సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి కేటీఆర్‌, చిత్రంలో నిర్మల్‌ జడ్పీ ఛైర్‌పర్సన్‌ విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌, జాన్సన్‌ నాయక్‌, జడ్పీ ఛైర్మన్‌ జనార్దన్‌ రాఠోడ్‌, మాజీ మంత్రి జోగు రామన్న, ఎంపీ అభ్యర్థి సక్కు, బోథ్‌ ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌, కుమురం భీం మనవడు సోనేరావు, విలాస్‌, రమాదేవి, శ్యాంసుందర్‌, తదితరులు

 ఆదిలాబాద్‌ పట్టణం, న్యూస్‌టుడే : నాడు హక్కుల కోసం పోరాడిన గిరిజనులను ఇంద్రవెల్లిలో కాల్చి చంపిందే కాంగ్రెస్‌ ప్రభుత్వం. అంత పెద్ద తప్పు చేసి అమరవీరులకు క్షమాపణలు చెప్పకుండా సిగ్గు లేకుండా ఆ పార్టీ సీఎం రేవంత్‌రెడ్డి ఇంద్రవెల్లిలో ఏ ముఖం పెట్టుకొని సభ ఏర్పాటు చేశారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ప్రశ్నించారు. ఆదిలాబాద్‌లో మంగళవారం నిర్వహించిన పార్టీ ఆదిలాబాద్‌ లోక్‌సభ బూత్‌స్థాయి ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులతో తమకు పేగు బంధమని చెప్పుకొచ్చారు. తెలంగాణ ఉద్యమంలో, సకల జనుల సమ్మెలో, స్వరాష్ట్ర సాధనకు జరిగిన ప్రతి పోరాటంలో ఉద్యోగులు తమతో కలిసి వచ్చారన్నారు. అందుకే కేసీఆర్‌ దేశంలో ఎక్కడా లేని విధంగా కేంద్ర ఉద్యోగుల కంటే ఎక్కువగా 73 శాతం వేతనాలు పెంచారని గుర్తుచేశారు. కాకపోతే ఎన్నికల్లో వారి మనసును గెలవలేకపోయామన్నారు. ఎందుకంటే వారికి వేతనాలు ప్రతి నెల ఒకటో తేదీన ఇవ్వలేకపోయామని వివరించారు. ఈ ఎన్నికల్లో ఉద్యోగుల మద్దతు కూడగట్టుకోవాలని పిలుపునిచ్చారు. పెద్ద పదవులు అనుభవించిన వాళ్లు ఎందరో వెళ్లినా ఒక నిరుపేద గిరిజనుడైన ఆత్రం సక్కు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వకున్నా పార్టీని నమ్ముకొని ఉండటం ఇతరులకు ఆయన ఆదర్శమని కొనియాడారు. ఆయన్ని ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపించే బాధ్యత కార్యకర్తలదేనని పేర్కొన్నారు. ఇప్పుడు మీరు కష్టపడితే వచ్చే సర్పంచి, ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్‌ ఎన్నికల్లో మేం కష్టపడి మిమ్మల్ని గెలిపిస్తామని వివరించారు.


భాజపా, కాంగ్రెస్‌లు ఒకటే..
జోగురామన్న, భారాస జిల్లా అధ్యక్షుడు

ప్రజలనుమోసం చేయడంలో భాజపా, కాంగ్రెస్‌ ఒకటే. ఆదిలాబాద్‌ నుంచి ఆర్మూర్‌ రైల్వే లైన్‌, సిమెంట్‌ పరిశ్రమ పునరుద్ధరణ, విమానాశ్రయం ఏర్పాటు చేయడంలో కేంద్రం జిల్లాపై వివక్ష కనబరిచింది. అలాంటి పార్టీకి ఓటెందుకు వేయాలి. 420 హామీలను అమలుచేయని కాంగ్రెస్‌ పార్టీని నిలదీయాల్సిన అవసరం ఉంది.


పార్లమెంట్‌లో ఆదిలాబాద్‌ గొంతు వినిపిస్తా
ఆత్రం సక్కు, ఎంపీ అభ్యర్థి

ప్రతి కార్యకర్త తాను ఎంపీ అభ్యర్థిగా భావించి కష్టపడి పని చేయాలి. చేసిన అభివృద్ధిని వివరించాలి. ఒకరు మతం పేరుతో, మరొకరు మోసపూరిత హామీలతో మళ్లీ ప్రజల్లోకి వస్తున్నారనే విషయాన్ని విడమరిచి చెప్పాలి. నేను ఏ గ్రామానికి వెళ్లినా కేసీఆర్‌ రైతుబంధు ఇచ్చిన దేవుడని కొనియాడుతున్నారు. పార్లమెంటులో ఆదిలాబాద్‌ గొంతును వినిపించేందుకు గెలిపించాలి.


భారాస సత్తా చూపించాలి
అనిల్‌ జాదవ్‌, బోథ్‌ ఎమ్మెల్యే

సమావేశానికి హాజరైన వేలాది మంది కార్యకర్తలను చూస్తుంటే మన బలమెంతో తెలుస్తుంది. ప్రజా సభ పెడితే ఇంకెలాగో ఉంటదో అర్థమవుతుంది. ఇదే స్ఫూర్తితో ఎన్నికల్లో పని చేయాలి. మే 13న మన సత్తా చూపించాలి. గులాబీ జెండాను ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానంలో ఎగురవేసి ఇతర పార్టీలకు మనమేంటో చూపించాలి.


సొంత గూటికి జడ్పీ ఛైర్మన్‌ జనార్దన్‌ రాఠోడ్‌

జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ రాఠోడ్‌ జనార్దన్‌ తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. ఇంతకుముందు ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నించి, చివరి నిమిషంలో మనసు మార్చుకొని భాజపాలో చేరారు. ఎంపీ టికెట్‌ ఆశించినా నిరాశ ఎదురైంది. తాజాగా పార్టీ సమావేశంలో కేటీఆర్‌ సమక్షంలో గులాబీ కండువా వేసుకున్నారు. కుమురం భీం మనవడు సోనేరావు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌, నిర్మల్‌ జడ్పీ ఛైర్‌పర్సన్‌ విజయలక్ష్మి, మున్సిపల్‌ ఛైర్మన్‌ ప్రేమేందర్‌, వివిధ నియోజకవర్గాల బాధ్యులు జాన్సన్‌నాయక్‌, లోలం శ్యాంసుందర్‌, రమాదేవి, రాంకిషన్‌రెడ్డి, ఎంపీపీలు తులశ్రీనివాస్‌, మార్‌శెట్టి గోవర్ధన్‌, జడ్పీటీసీ సభ్యులు చారులత, కుమ్ర సుధాకర్‌, నాయకులు యూనుస్‌ అక్బానీ, సాజిదొద్దీన్‌, రౌతు మనోహర్‌, సతీష్‌పవార్‌, అజయ్‌, యాసం నర్సింగ్‌రావు, దాసరి రమేష్‌, కస్తాల ప్రేమల, రంగినేని మనీషా, ఆడే శీల, మమత తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని