logo

అయిదేళ్లుగా ఎదురుచూపులే!

కేంద్ర ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం రైతులందరికి అందడం లేదు. ప్రారంభంలో ఉన్న రైతుల్లో నిబంధనల కారణంగా తొలగిస్తున్నా.. కొత్త వారిని చేర్చకపోవడంతో ఏటా సాయం పొందే రైతుల సంఖ్య తగ్గుతోంది.

Published : 25 Apr 2024 06:45 IST

కొత్త రైతులకు అందని కేంద్ర పెట్టుబడి సాయం
న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ వ్యవసాయం

కేంద్ర ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం రైతులందరికి అందడం లేదు. ప్రారంభంలో ఉన్న రైతుల్లో నిబంధనల కారణంగా తొలగిస్తున్నా.. కొత్త వారిని చేర్చకపోవడంతో ఏటా సాయం పొందే రైతుల సంఖ్య తగ్గుతోంది. ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం కింద తెల్లరేషన్‌ కార్డు ఉన్న రైతులకు భూమి ఎంత ఉన్నా ఏడాదికి మూడు విడతల్లో రూ.6 వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. 2019 ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు కటాఫ్‌ తేదీగా విధించింది. అప్పటి నుంచి భూములు కొనుగోలు చేసినా.. వారసత్వం ద్వారా బదలాయింపు జరిగినా.. కిసాన్‌ సమ్మాన్‌ జాబితాలో నమోదు కావడం లేదు. అధికారులకు సైతం అవకాశం లేకపోవడంతో అయిదేళ్లుగా రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు.

జిల్లాలో భూముల క్రయవిక్రయాలు ఏటా జరుగుతూనే ఉంటాయి. రాష్ట్రంలో ధరణి అమల్లోకి వచ్చిన తర్వాత అనేక మంది రైతుల భూముల్లో చేర్పులు, మార్పులు చోటు చేసుకున్నాయి. కొంత మందికి పట్టాలు రాగా, మరి కొంత మంది రైతుల భూములు మిస్సింగ్‌లో, కొందరివి నిషేధిత జాబితాల్లో పడ్డాయి. అప్పటి నుంచి అధికారుల చుట్టూ తిరిగినా.. మార్చే అధికారాలు లేకపోవడంతో అవి అలాగే ఉండిపోయాయి. కొంత మంది రైతులు భూ మార్పిడి చేసుకున్నారు. వారి పేర్లు కూడా కిసాన్‌ సమ్మాన్‌ పథకంలో చేర్చడం లేదు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఆదేశాలు జారీ చేసి చేర్పులు, మార్పులకు అవకాశం ఇస్తే తప్ప కొత్త రైతుల పేర్లు నమోదు చేసే అవకాశం లేదు. ఎన్నికల తర్వాతనైనా.. కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించి మేలు జరిగేలా చూడాలని రైతులు కోరుతున్నారు.

అవగాహన లేక..

కేంద్ర ప్రభుత్వం అందించే కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకంపై అవగాహన లేకపోవడంతో చాలా మంది రైతులు పథకానికి దూరమవుతున్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు రైతులు తమ వివరాలతో మీసేవ కేంద్రాల్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్‌కు చరవాణి అనుసంధానించక పోవడం, ఒకటి కంటే ఎక్కువ ఫోన్‌ నెంబర్లు లింకు చేసి ఉండటం, రద్దు చేసిన ఖాతాలను తొలగించకపోవడం, బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ అనుసంధానం లేకపోవడం, ఈకెవైసీ చేసుకోకపోవడంతో పెట్టుబడి సాయానికి దూరం అవుతున్నారు. పథకం ప్రారంభించిన రోజుల్లో జిల్లా మొత్తంలో 95,138 మంది రైతులు పెట్టుబడి సాయం పొందేవారు. తాజాగా ఈ పథకం ద్వారా జిల్లాలో కేవలం 41,978 మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. జిల్లాలోని ఉట్నూర్‌, ఇంద్రవెల్లి, నార్నూర్‌, గాదిగూడ, భీంపూర్‌ మండలాల్లో గిరిజన గ్రామాల్లో గతంలో అటవీ హక్కు పత్రాలు ఉన్న రైతులకు సైతం కేంద్రం అందించే పెట్టుబడి సాయం అందింది. గత ప్రభుత్వం కొత్తగా జిల్లాలో 15 వేల మంది రైతులకు హక్కు పత్రాలు ఇచ్చింది. వారి పేర్లు కూడా కిసాన్‌ సమ్మాన్‌ పథకంలో చేర్చకపోవడంతో సాయం అందడం లేదు.


ఆదేశాలు వస్తేనే..

పుల్లయ్య, జిల్లా వ్యవసాయాధికారి, ఆదిలాబాద్‌:  కొత్తగా పాసుపుస్తకాలు అందిన వారి పేర్లు కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకంలో చేర్చే అవకాశం లేదు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో పాటు పేర్ల నమోదుకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేస్తే రైతులకు మేలు జరిగే అవకాశం ఉంది. 2019 కంటే ముందు పట్టా భూములు ఉండి కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హులై ఉన్న ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని