logo

దోచుకోవడంపైనే వైకాపా సర్కారు ధ్యాస

వైకాపా ప్రభుత్వానికి దోచుకోవడంపై తప్ప, రాష్ట్రాభివృద్ధిపై ధ్యాస లేదని భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు మండిపడ్డారు.

Published : 28 Jan 2023 03:23 IST

భాజపా ఎంపీ జీవీఎల్‌

మాట్లాడుతున్న ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు, చిత్రంలో రాజారావు, ఉమామహేశ్వరరావు, కృష్ణారావు తదితరులు

అరకులోయ పట్టణం, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వానికి దోచుకోవడంపై తప్ప, రాష్ట్రాభివృద్ధిపై ధ్యాస లేదని భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు మండిపడ్డారు. అరకులోయ మండలం చినలబుడులో శుక్రవారం ఆయన పర్యటించారు. స్థానిక ఏకలవ్య పాఠశాలలో ప్రధాని మోదీ పరీక్షా పే చర్చా కార్యక్రమాన్ని టీవీలో వీక్షించారు. అరకులోయ పోర్టు అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడిన జీవీఎల్‌ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు. ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు ఇతర పథకాలకు ఖర్చుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులను మోసగిస్తోందన్నారు. ఐటీడీఏ ప్రాంతాల్లో గిరిజనులకు ఖర్చు చేయాల్సిన కేంద్ర నిధుల్ని పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో గత ఏడాది 1.58 లక్షల మంది విద్యార్థులు ఉపకార వేతనాలు పొందినట్లు గణాంకాలు ఉండగా, ఈఏడాది 71వేల మందికి తగ్గిందన్నారు. రాష్ట్రానికి 28 ఏకలవ్య పాఠశాలలు కేంద్రం మంజూరు చేయగా, వాటిలో అల్లూరి మన్యంలో 11 ఉన్నాయన్నారు. వీటిలో ఇంకా పూర్తిస్థాయిలో నిర్మాణ పనులు ప్రారంభించని పరిస్థితిల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు.

గుర్తింపునకు నోచుకోని కులాలకు ప్రాధాన్యం

రాష్ట్రంలో అర్హతలున్నా పూర్తిస్థాయి గుర్తింపునకు నోచుకోని గిరిజన కులాలను గుర్తించి వారికి పూర్తి న్యాయం చేస్తామన్నారు. కొండకుమ్మర్లు గిరిజనులుగా గుర్తించేందుకు శతశాతం అర్హులన్నారు. వీరిపై అసెంబ్లీలో తీర్మానం చేసినట్లు కూడా సమాచారం లేదన్నారు. జాతీయ రహదారుల నిర్మాణ పనులు అక్కడక్కడ మాత్రమే జరుగుతున్నాయన్న జీవీఎల్‌, కేంద్ర మంత్రి గడ్కరీ దృష్టికి తీసుకువెళ్లి వారంలో జాతీయ రహదారి పనులు వేగవంతం అయ్యేలా చూస్తానన్నారు. రెండు మూడు నెలల్లో జిల్లా వ్యాప్తంగా పర్యటించి మన్యం సమస్యలపై పూర్తినివేదికతో సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామన్నారు. జిల్లా భాజపా అధ్యక్షులు పాంగి రాజారావు, రాష్ట్ర గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శి కూడా కృష్ణారావు, ఉమామహేశ్వరరావు, పార్టీ మండల నాయకులు రామచంద్ర, ఆనంద్‌, దేవ, బలరాం ఆయన వెంట ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని