logo

యువశక్తి హోరు.. తెదేపా శ్రేణుల్లో జోరు

తెలుగుదేశం పార్టీ పాలనలో ఉత్తరాంధ్రకు పరిశ్రమలు తీసుకువస్తే, వైకాపా పాలకులు వాటిని తరిమేసి గంజాయికి అడ్డాగా మార్చేశారని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి విమర్శించారు.

Updated : 17 Apr 2024 02:08 IST

నర్సీపట్నం అర్బన్‌, న్యూస్‌టుడే: తెలుగుదేశం పార్టీ పాలనలో ఉత్తరాంధ్రకు పరిశ్రమలు తీసుకువస్తే, వైకాపా పాలకులు వాటిని తరిమేసి గంజాయికి అడ్డాగా మార్చేశారని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి విమర్శించారు. నర్సీపట్నం పురపాలక పరిధిలోని బలిఘట్టంలో మంగళవారం రాత్రి యువశక్తి పేరిట కూటమి నేతలు నిర్వహించిన సభకు ఆయన ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. బ్రెజిల్‌ నుంచి 25వేల టన్నుల మాదకద్రవ్యాలు విశాఖపట్నానికి తీసుకువచ్చారు. ఉత్తరాంధ్రలో ఎప్పుడైనా ఇలా జరిగిందా అని ప్రశ్నించారు. ‘మద్య నిషేధాన్ని తీసుకు వస్తామని చెప్పిన జగన్‌ ఈ ఐదేళ్లలో రూ.1.50లక్షల కోట్లు మద్యాన్ని అమ్మించారు.  ఉద్యోగాలను నిస్సిగ్గుగా బహిరంగ మార్కెట్‌లో వేలం వేసిన వారికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.  తెదేపా యువనేత విజయ్‌ పేరు వింటే ఎమ్మెల్యే గణేష్‌ ప్యాంట్‌ తడుపుకొంటున్నారని ఎద్దేవా చేశారు. 2019 మేనిఫెస్టోలో జగన్‌ మోసపూరిత హామీలతో యువతను దగా చేశారన్నారు. జాబ్‌ క్యాలెండర్‌ ఇవ్వలేదన్నారు. తెదేపా పాలనలో 40 నైపుణ్య శిక్షణ కేంద్రాలు నడిచేవని గుర్తు చేశారు. ఎమ్మెల్యే గణేష్‌ తాడేపల్లి వెళ్లి సెల్ఫీ తీసుకోవడం తప్ప ఐదేళ్లలో ఏమైనా చేశాడా అని నిలదీశారు. అయ్యన్న అవినీతి లేని పాలన అందించారని పేర్కొన్నారు.

సీఎంతో మాట్లాడి రాష్ట్రంలో ఎనభై పాలిటెక్నిక్‌ కళాశాలలు ఒకేసారి ఏర్పాటు చేసిన ఘనత అయ్యన్నదని గుర్తు చేశారు. కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీతో మాట్లాడి రాజమండ్రి-విజయనగరం నాలుగు లైన్ల రహదారి కార్యరూపం దాల్చేలా చేసిన వ్యక్తి అయ్యన్న అన్నారు. తెదేపా పాలనలో నర్సీపట్నంలో ప్రాంతీయ ఆసుపత్రి ప్రసవాల్లో రికార్డు సృష్టిస్తే వైకాపా పాలనలో సెల్‌ఫోన్ల వెలుగులో ప్రసవాలు చేసే దుస్థితికి దిగజార్చారని విమర్శించారు. ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు రూ.13 వేల కోట్లు ఆర్థికసంఘం నిధులు పక్కదారి పట్టించి తాడేపల్లి ప్యాలెస్‌కు చేర్చారని ఆరోపించారు. గులకరాయి డ్రామా జబర్దస్త్‌ కామెడీని మించి పోయిందని ఎద్దేవా చేశారు.  అనకాపల్లి పార్లమెంట్‌ అభ్యర్థి సీఎం రమేష్‌ ప్రసంగిస్తూ ఇథనాల్‌ పరిశ్రమలను ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేయిస్తామని తెలిపారు. పరిశ్రమలు రావాలంటే కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని పేర్కొన్నారు. యువనేత వంగవీటి రాధా మాట్లాడుతూ ప్రతి ఇంటికీ ఎంత మేలు జరిగిందో కాదు... మీ ఇంటికి ఎంత మేలు జరిగిందో ప్రజలకు చెప్పాలని సీఎం జగన్‌ను నిలదీశారు. జగన్‌ను నమ్మి యువత మోసపోయిందన్నారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, పుచ్చా విజయ్‌కుమార్‌, అద్దేపల్లి గణేష్‌ తదితరులు ప్రసంగించారు కూటమి నాయకులు బోళెం రామప్రసాద్‌, సురేంద్ర మోహన్‌, సూర్యచంద్ర పాల్గొన్నారు.

బలిఘట్టం పసుపుమయం

బలిఘట్టం మంగళవారం సాయంత్రం పసుపు మయమైంది. ఎటు చూసినా ఉత్సాహమే... తలపై టోపీలు... మెడలో కండువాలుతో యువకులు ఉరకలేస్తూ వేలాదిగా తరలివచ్చారు. తెదేపా, భాజపా నాయకుల ప్రసంగాలు కొనసాగుతున్నంత సేపూ ఈలలు, కేరింతలతో ఆద్యంతం సందడి చేశారు. యువశక్తి పేరిట నిర్వహించిన ఈ సభకు తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్‌ అధ్యక్షత వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని