logo

ఆర్టీసీ ఉద్యోగుల ఆశలు ఆవిరి

ఉద్ధరిస్తానని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన జగన్‌ ప్రభుత్వం తమను నిండా ముంచిందని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. విలీనమై ఏళ్లు గడిచినా కార్మికులకు దక్కాల్సిన ప్రయోజనాలు అందకపోగా... అనేక భత్యాలను కోల్పోవాల్సి వచ్చింది.

Published : 18 Apr 2024 02:13 IST

ప్రభుత్వంలో విలీనమైనా దక్కని ప్రయోజనాలు
వేతన సవరణ, బకాయిల చెల్లింపులు ఎప్పుడో?
ముఖ్యమంత్రి జగన్‌ తీరుపై ఆవేదన
ఈనాడు, విశాఖపట్నం

ఉద్ధరిస్తానని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన జగన్‌ ప్రభుత్వం తమను నిండా ముంచిందని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. విలీనమై ఏళ్లు గడిచినా కార్మికులకు దక్కాల్సిన ప్రయోజనాలు అందకపోగా... అనేక భత్యాలను కోల్పోవాల్సి వచ్చింది. దీంతో ఉద్యోగులు పెట్టుకున్న ఆశలను జగన్‌ చిదిమేసినట్లయింది. బకాయిలు ఇవ్వలేక, భత్యాలు చెల్లించలేక జగన్‌ సర్కార్‌ చేతులెత్తేసి ఉద్యోగులకు చుక్కలు చూపిస్తుంది. ఫలితంగా విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వేల మంది ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు.

ఆ 75 శాతం ఏవీ: పర్యటనలకు అవసరం నిమిత్తం రూ.23 కోట్లతో ఇటీవల అయిదు ప్రత్యేక బస్సులను కొనిపించిన జగన్‌  ఉద్యోగుల బకాయిల చెల్లించడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. 2017లో ఆర్టీసీ వేతన సవరణ చేపట్టగా అప్పటి బకాయిలను ఇప్పటివరకు పూర్తిగాచెల్లించలేదు. మొత్తం ఒకేసారి ఇస్తే భారమవుతుందని నాలుగు భాగాలుగా చేసి మొదట 25 శాతం అందరికి జమ చేసి మిగిలిన 75 శాతం ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారు.

అవన్నీ ఆగిపోయాయి: వైకాపా ప్రభుత్వం వచ్చాక ఆర్టీసీ ఉద్యోగుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయింది. ప్రభుత్వంలో కలవక ముందు గ్యారేజీ ఉద్యోగులకు రాత్రి భత్యం, డీజిల్‌ను పొదుపు చేసినందుకు నెలవారి ప్రోత్సాహకాలు ఇచ్చేవారు. అదనంగా పనిచేసిన సమయానికి అదనపు భత్యం, ప్రతి నెలా టెక్నికల్‌ భత్యం, వేడి దగ్గర పనిచేస్తే హీట్‌ అలవెన్స్‌, 45 ఏళ్లు దాటిన మహిళా కండక్టర్లకు ఆరోగ్య భత్యం వంటివి ఉండేవి. ప్రతి నెలా వచ్చే జీతంతో పాటు వారి అనుభవం ఆధారంగా రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు అదనపు ఆదాయం వచ్చేది. ఇప్పుడు అవేమీ అందడం లేదు.

  • గతంలో రెండేళ్లకు ఒకసారి మూడు జతల ఏకరూప దుస్తులు అందజేయడంతో పాటు కుట్టు కూలి ఇచ్చేవారు. పాదరక్షల కోసం రూ.వెయ్యి అందజేసేవారు. ఇప్పుడు గ్యారేజీ కార్మికులు, ఉద్యోగులు సొంత డబ్బులతో బూట్లు, ఏకరూప దుస్తులు కొనుగోలు చేసుకుంటున్నారు.
  • దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు మధ్యలో ఆగిపోతే వాటి మరమ్మతుకు ఇక్కడి నుంచి మెకానిక్‌లు  వెళ్లి బాగు చేసేవారు. వీరు వెళ్లినందుకు అయ్యే ఖర్చులు ఇచ్చేవారు. పని వేళలకు మించి చేస్తే ఓటీ ఇచ్చేవారు. ఇప్పుడు అవేమీ ఇవ్వడమే లేదు. భోజనాలకు సొంత డబ్బులే  ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోంది.

ఆరోగ్య భత్యమూ లేదు: అన్ని రకాల వైద్య సేవలకు ఈహెచ్‌ఎస్‌ ఉపయోగపడకపోవడంతో సొంతంగా ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోంది. ఇటీవల ఓ ఆర్టీసీ ఉద్యోగికి ఛాతిలో నొప్పి రాగా ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. రూ.1.50 లక్షలు చెల్లిస్తేగాని వైద్యం అందించలేమన్నారు. గతంలో  ఆర్టీసీ ఉద్యోగి గుర్తింపు కార్డు చూపిస్తే సరిపోయేది. వెంటనే చికిత్స ఆరంభించేవారు. అప్పట్లో రూ.10 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకూ వైద్యం ఉచితంగా అందించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. పదవీ విరమణ ఉద్యోగులకు కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు అవేమీ లేవు. ప్రభుత్వంలో విలీనం అయ్యాక తీవ్రంగా నష్టపోయామని వారంతా ఆవేదన చెందుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు