logo

ఏకతాటిపైకి నేతలు.. తెదేపాలో నూతనోత్సాహం

రంపచోడవరం నియోజవర్గంలో తెదేపా నేతలంతా ఏకతాటిపైకి వస్తున్నారు.

Published : 24 Apr 2024 02:37 IST

వంతల రాజేశ్వరితో పరిశీలకులు శ్రీనివాస్‌, ఎమ్మెల్యే అభ్యర్థిని శిరీషాదేవి తదితరులు

రంపచోడవరం, న్యూస్‌టుడే: రంపచోడవరం నియోజవర్గంలో తెదేపా నేతలంతా ఏకతాటిపైకి వస్తున్నారు. టికెట్‌ ఇవ్వలేదని ఇప్పటివరకు అసంతృప్తితో ఉన్న తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి పార్టీ నిర్ణయించిన అభ్యర్థి విజయమే లక్ష్యంగా పనిచేస్తానని మంగళవారం ప్రకటించారు. దీంతో తెదేపా నేతలు, కార్యకర్తల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది.

నేతలంతా ఒక్కతాటిపైకి రావడంతో ఇక విజయం దిశగా పయనిస్తామని చెబుతున్నారు. ఎమ్మెల్యే టికెట్‌ దక్కలేదని అసంతృప్తితో ఉన్న రాజేశ్వరితో నియోజకవర్గ పరిశీలకులు చెల్లుబోయిన శ్రీనివాస్‌, తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మీసాల రాజు, జోన్‌-1 కోఆర్డినేటర్‌ దామచర్ల సత్య చర్చలు జరిపారు. భవిష్యత్తులో ఆమెకు న్యాయం చేసేలా అధిష్ఠానం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. వీరితో చర్చలు అనంతరం రాజేశ్వరి మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల విజయానికి  కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి, పార్టీ అరకు పార్లమెంట్‌ ఉపాధ్యక్షుడు దంతులూరి శివాజీ, ఎటపాక మండల అధ్యక్షుడు పుట్టి రమేష్‌, సీనియర్‌ నాయకులు మువ్వా శ్రీను, కనిగిరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

రెండు అసెంబ్లీ స్థానాలకు మరో ఏడు

పాడేరు, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. మంగళవారం అరకు, పాడేరు అసెంబ్లీ స్థానాలకు ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి. అరకులోయ అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థులు చెండా ఏలియా, సివేరి అబ్రహం, వంతాల రామన్న, నారజి మధుబాబు, మర్రి ఉషారాణి, జై భారత్‌ జాతీయ పార్టీ తరఫున బురిడి ఉపేంద్ర నామపత్రాలు సమర్పించినట్లు రిటర్నింగ్‌ అధికారి, ఐటీడీఏ పీఓ వి.అభిషేక్‌ తెలిపారు. పాడేరు అసెంబ్లీ నియోజకవర్గానికి వైకాపా అభ్యర్థి మత్స్యరాస విశ్వేశ్వరరాజు మరొక సెట్‌ నామపత్రాలు అందజేశారని రిటర్నింగ్‌ అధికారి, జాయింట్‌ కలెక్టర్‌ భావన పేర్కొన్నారు. రిటర్నింగ్‌ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టు దిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పాడేరు సీఐ ప్రవీణ్‌కుమార్‌ రెండు కేంద్రాల వద్ద బందోబస్తు పర్యవేక్షించారు.

జిల్లాలో తొమ్మిది నామినేషన్లు

పాడేరు, న్యూస్‌టుడే: జిల్లాలోని అరకులోయ, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో మంగళవారం తొమ్మిది నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ విజయ సునీత తెలిపారు. అరకు అసెంబ్లీకి ఆరు, పాడేరు ఒకటి, రంపచోడవరంలో రెండు నామినేషన్లు దాఖలయ్యాయని చెప్పారు.

అయిదో రోజు ఇద్దరు

రంపచోడవరం, న్యూస్‌టుడే: రంపచోడవరం శాసనసభ నియోజకవర్గానికి మంగళవారం ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వై.రామవరం మండలం గుర్తేడు పంచాయతీ అల్లూరిగడ్డ గ్రామానికి చెందిన కాకూరు కన్నపురెడ్డి, ఎటపాక మండలం చెన్నంపేట గ్రామానికి చెందిన కుంజా శ్రీను తమ నామపత్రాలను రిటర్నింగ్‌ అధికారి ప్రశాంత్‌కుమార్‌కు అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు