logo

నాసైకిలే.. నా డాక్టర్‌

అయిదు పదుల వయసు దాటుతున్నారో లేదో మధుమేహం, రక్తపోటు, మోకాళ్ల నొప్పులంటూ ఈ రోజుల్లో కొందరు సతమతమైపోతుంటారు. అయితే ఆయనకు తొమ్మిది పదుల వయసు పైబడింది. మనవలు, మనవరాళ్లతో ఆడుకునే వయసు. విశ్రాంతి

Published : 12 May 2022 03:07 IST

అలుపెరగని పతకాల యోధుడు శివరామకృష్ణయ్య
లక్ష్మీపురం, న్యూస్‌టుడే

సైకిల్‌పై నుంచి జావెలిన్‌త్రో విసురుతున్న గింజుపల్లి శివరామకృష్ణయ్య

యిదు పదుల వయసు దాటుతున్నారో లేదో మధుమేహం, రక్తపోటు, మోకాళ్ల నొప్పులంటూ ఈ రోజుల్లో కొందరు సతమతమైపోతుంటారు. అయితే ఆయనకు తొమ్మిది పదుల వయసు పైబడింది. మనవలు, మనవరాళ్లతో ఆడుకునే వయసు. విశ్రాంతి కోరుకునే మనసు. ఆ వయసులోనూ ఏమాత్రం తరగని ఉత్సాహం ఆయన సొంతం. ఎంతో మంది క్రీడాకారులకు మెలకువలు నేర్పిస్తూ.. ఇప్పటికీ వారితో పోటీ పడుతూ.. మనసును పతకాల వెంట పరుగులు తీయిస్తున్నారు గుంటూరుకు చెందిన 93 సంవత్సరాల గింజుపల్లి శివరామకృష్ణయ్య.  నిత్యం అయిదు కిలోమీటర్లు సైకిల్‌ తొక్కడం వల్ల ఈ వయసులోనూ పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని చెబుతున్నారు శివరామకృష్ణయ్య. ఇటీవల చెన్నైలో జరిగిన జాతీయ స్థాయి మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ చాంఫియన్‌షిప్‌ పోటీల్లో ప్రతిభ కనబరచి మూడు పసిడి పతకాలు చేజిక్కించుకున్నారు.


ఎందరికో స్ఫూర్తి..

పతకాలతో..

ప్రత్తిపాడులో 19 మంది సంతానంలో 13వ వాడిగా జన్మించిన ఆయన పోరాటం చిన్ననాటి నుంచే ప్రారంభమైంది. రవాణా సదుపాయాలు లేని ఆ రోజుల్లో కాలినడకన ఎన్నో కిలోమీటర్లు నడచి వెళ్లి చదువుకున్నారు. శివరామకృష్ణయ్య 1963-73 మధ్య కాలంలో జాతీయ వాలీబాల్‌ జట్టు సభ్యుడు. పేరొందిన అథ్లెట్‌. ఉద్యోగ విరమణ చేసినా తర్వాత కూడా క్రీడా సాధన చేస్తున్నారు. రాష్ట్ర మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో, జాతీయ అథ్లెటిక్స్‌ పోటీల్లో బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించారు. డిస్కస్‌ త్రో, జావెలిన్‌ త్రో, షాట్‌ఫుట్‌ పోటీల్లో ఇప్పటికీ రాణిస్తున్నారు. 2018, 2019లో జరిగిన ఏపీ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ చాంఫియన్‌షిప్‌ పోటీల్లో మూడు బంగారు పతకాలు, అదే ఏడాది బెంగుళూరులోని జరిగిన జాతీయ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో కాంస్య పతకం సాధించారు. ఇంటర్నేషనల్‌ స్పోర్ట్స్‌ పర్సన్‌ అవార్డు అందుకున్నారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఏపీ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ చాంఫియన్‌షిప్‌ పోటీల్లోనూ జావెలిన్‌త్రో, డిస్కస్‌త్రో, షాÆట్ఫుట్ విభాగాల్లో మూడు పసిడి పతకాలు హస్తగతం చేసుకున్నారు. వచ్చే నెల్లో పిన్‌లాండ్‌లో జరిగే అంతర్జాతీయ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో పతకాలు సాధనే లక్ష్యంగా నిత్యం ఎన్టీఆర్‌ క్రీడా మైదానంలో ప్రాక్టీస్‌ చేస్తున్నారు.


క్రమశిక్షణ కలిగిన జీవన విధానం

క్రమశిక్షణ కలిగిన జీవన విధానం వల్లే ఈ వయసులోనూ ఆరోగ్యంగా ఉంటున్నా. ‘ఇప్పటికీ మధుమేహం, రక్తపోటు, మోకాళ్ల నొప్పులు వంటివి ఏమీలేవు. నా డాక్టర్‌.. నా సైకిలే. ఇప్పటికీ నిత్యం అయిదు కిలోమీటర్లు సైకిల్‌ తొక్కుతాను. ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఎన్టీఆర్‌ క్రీడాప్రాంగణంలో గంట వంతున నేను ప్రాక్టీస్‌ చేసుకుంటూ క్రీడాకారులకు మ్చెకువలు తెలియజేస్తుంటా. ఉదయం కర్జూరం, నిమ్మరసంలో తేనె కలుపుకుని తాగుతా. ఆరు బాదం పప్పులు, వాల్‌నట్్స, పిస్తా తీసుకుంటా. ఆయిల్‌ లేకుండా జొన్న రొట్టె, లేకపోతే గోధుమ రొట్టెలు అల్పాహారంగా భుజిస్తా. మధ్యాహ్నం అన్నం రెండు కప్పులు, కూరలు ఎక్కువగా తీసుకుంటా. పెరుగు చాలా తక్కువ. మజ్జిగ ఎక్కువగా తాగుతా. రాత్రికి  ఆపిలో, అరటి పండో, జామకాయ ఏదో ఒకటి తింటా. కాఫీలు, టీలు తాగను. పాలల్లో ఓట్సు, అటుకులు వేసుకుని తాగుతా. మద్యపానం, మాంసాహారం జోలికి వెళ్లను. మితాహారం, నిత్య వ్యాయామం నా ఆరోగ్య రహస్యం’..అని శివరామకృష్ణయ్య వివరించారు.

‘యువత ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యంగాను ధృడంగా ఉండాలి. నిత్యం వ్యాయామం చేయడం అలవర్చుకోవాలి.  దేవుడు ఆరోగ్యవంతమైన దేహాన్ని ఇచ్చాడు. దానికి కాపాడుకోవడం మన ధర్మం. మితాహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం. పది మందికి మేలు చేయాలనే నాలో ఉన్న తపనే నన్ను ఇంత సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచుతుంది’.

-శివరామకృష్ణయ్య

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు