logo

పైపై అందాలకే మొగ్గు..!

గాంధీనగర్‌లోని సర్‌ విజ్జి నగరపాలక సంస్థ ఈత కొలనుల ఆధునికీకరణకు నగరపాలక సంస్థ సుమారు రూ.2కోట్లు వెచ్చించినా.. స్విమ్మర్లకు ఇబ్బందులు తప్పేలా లేదు.

Published : 29 Jun 2022 04:51 IST

రిసార్ట్‌ తలపించేలా ఈత కొలను

రూ.2కోట్లు వెచ్చించినా స్విమ్మర్లకు తప్పని ఇబ్బందులు


పూల్‌ వద్ద కూర్చోవడానికి ఏర్పాటు చేసిన షెల్టర్లు

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే : గాంధీనగర్‌లోని సర్‌ విజ్జి నగరపాలక సంస్థ ఈత కొలనుల ఆధునికీకరణకు నగరపాలక సంస్థ సుమారు రూ.2కోట్లు వెచ్చించినా.. స్విమ్మర్లకు ఇబ్బందులు తప్పేలా లేదు. నీటి శుద్ధి కర్మాగారాలు (వాటర్‌ ఫిల్టరైజేషన్‌ ప్లాంట్స్‌), పూల్‌లో ఫ్లోరింగ్‌, పోటీల సమయంలో లేన్ల మార్కింగ్‌ వంటివి ప్రధాన భూమిక పోషిస్తాయి. నగరపాలక సంస్థ మాత్రం వీటి కంటే ఎక్కువ భాగం బాహ్య అలంకారానికే అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. రిసార్ట్స్‌ను తలపించేలా పూల్‌ ప్రాంగణంలో కూర్చునేందుకు వీలుగా షెల్టర్లు, గ్యాలరీకి టైల్స్‌, ఫిల్టరైన నీళ్లు పూల్‌లోకి పంపే వాటికి ఆకర్షణీయంగా టైల్స్‌, ముఖద్వారాల ఏర్పాటు, అధికారుల కార్లు పార్క్‌ చేసుకునేందుకు వీలుగా ప్రత్యేకించి స్థలం కేటాయించి తీర్చిదిద్దారు. మరో ప్రధాన ద్వారాన్ని ఏర్పాటు చేశారు. ఈ పూల్‌ ప్రాంగణానికి మూడు వైపులా రోడ్లు ఉన్నాయి. పడమర దిక్కున నగరపాలక సంస్థ కందుకూరి వారి కల్యాణ మండపం ఉంది. ప్రాంగణం చుట్టూ ప్రహరీ ఎత్తు పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రస్తుతం చేపట్టిన పనుల్లో దీన్ని విస్మరించారు.

ప్రధానంగా స్విమ్మర్లు సాధన చేసుకునేందుకు నీటిశుద్ధి కేంద్రం (ఫిల్టరైజేషన్‌ ప్లాంట్‌)కు ఆవశ్యకత ఉంది. స్టాండర్డ్‌ 50మీ.ల స్విమ్మింగ్‌ పూల్‌లోని నీటిని ఫిల్డర్‌ చేసేందుకు రెండు ప్లాంట్లు ఉన్నాయి. ఇందులో ఒక్కటే పనిచేస్తోంది. రెండూ రన్నింగ్‌లో ఉంటే.. ఒక పూట ఒకటి, మరో పూట రెండోదానిని వినియోగిస్తే ఎక్కువ కాలం మన్నికగా పనిచేస్తాయి. అలా కాకుండా ఒకే ప్లాంటును రెండు పూటలా వాడితే భారం అధికమై త్వరగా రిపేరుకు వచ్చే అవకాశాలున్నాయి. ప్లాంట్లకు రంగులు వేసి వదిలేశారు. గతంలో పనిచేయని దానిని బాగుచేశారు. పూర్తిగా పాడైపోయిన మరో దానిని తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది. దాని స్థానంలో కొత్తది ఏర్పాటు చేయాల్సి ఉంది.


ఫ్లోరింగ్‌ మార్చకుండా యథాతథంగా 25మీ.ల డీప్‌ పూల్‌

* పూల్‌ ప్రాంతానికి దక్షిణం వైపు ప్రధాన రహదారిలోకి అదనంగా మరో నూతన ముఖద్వారాన్ని ఏర్పాటు చేశారు. ఈ రోడ్డు నిత్యంగా రద్దీగా ఉంటుంది. ద్విచక్రవాహనాలు రోడ్డు పక్కగా పార్కింగ్‌ చేస్తే.. మరీ రద్దీ పెరిగే అవకాశం ఉంది. గతంలో తూర్పు వైపున ప్రధాన ద్వారం, ఉత్తరాన ద్విచక్రవాహనాలు ప్రవేశానికి వీలుగా చిన్నపాటి గేటు ఉండేది. పడమర వైపు మరో చిన్న గేటు ఉంది. ఇన్ని ఉన్నా.. దక్షిణాన అదనంగా మరో ప్రధాన ప్రవేశ మార్గాన్ని ఏర్పాటు చేయడంతో ఆప్రాంతంలో రద్దీ అధికమవడంతో పాటు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

* స్టాండర్డ్‌ 50మీ.ల పూల్‌లో లైన్ల మార్కింగ్‌ను రంగుతో వేశారు. శుభ్రం చేసే క్రమంలో రంగు పోయే అవకాశం ఉంది. కొత్త టైల్స్‌ వేశారు. ఆ సమయంలోనే లేన్ల మార్కింగ్‌ ప్రాంతంలో అదే రంగుతో కూడిన టైల్స్‌తో మార్కింగ్‌ చేయడం ద్వారా ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది. మూడు దశాబ్దాలకు పైగా నిర్మించిన ఈ పూల్‌లో గతంలో టైల్స్‌తోనే అమర్చిన మార్కింగ్‌ ఉండేది.

* 25మీ.ల డీప్‌ పూల్‌ను ఏమాత్రం పట్టించుకోలేదు. గతంలో పలుమార్లు ఫ్లోరింగ్‌కు వేసిన టైల్స్‌ పోయి స్విమ్మర్ల కాళ్లకు గాయాలైన సందర్భాలు అనేకం ఉన్నాయి. చుట్టుపక్కల ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దినప్పటికీ.. స్విమ్మర్లకు గాయాలు తప్పేలా లేదు. అధికారులు ఫ్లోరింగ్‌ కూడా ఒకే సారి వేసినట్లయితే స్విమ్మర్లకు ఉపయుక్తంగా ఉండేది.

* గతంలో స్విమ్మర్లు జాగింగ్‌, ఎక్సర్‌సైజ్‌లు చేసుకునేందుకు వీలుగా తూర్పువైపు ప్రధాన ముఖద్వారానికి పక్కనే పచ్చికతో కూడిన ప్రాంతం ఉండేది. ప్రస్తుతం అక్కడ మొత్తం ఫ్లోరింగ్‌ వేసి, అధికారుల కార్ల పార్కింగ్‌కు కేటాయించడం విమర్శలు వస్తున్నాయి. సుమారు నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ పూల్‌లో ఎప్పుడూ లేని విధంగా నూతనంగా అధికారుల కార్ల పార్కింగ్‌కు స్థలం కేటాయింపు సమంజసం కాదని పలువురు పేర్కొంటున్నారు.

* గతంలో దిచక్ర వాహనాల పార్కింగ్‌ ప్రాంతాన్ని పూర్తిగా విస్మరించారు. పనిరాకి వస్తువులతో పాటు తొలగించిన పరికరాలు అక్కడ ఉంచారు. అక్కడ ఉంచిన వ్యర్థాలను త్వరితగతిన తొలగించి ద్విచక్ర వాహనాల పార్కింగ్‌కు వినియోగంలోని తీసుకురావాలని స్విమ్మర్లు కోరుతున్నారు.

* ఈత కొలను ప్రాంతం ఇతరులకు పూర్తి నిషిద్ధప్రదేశం. ఇక్కడికి వచ్చిన వారు తొలుత స్నానమాచరించి, కొలనులోకి దిగి సాధన చేసుకుంటారు. సాధన పూర్తయిన తర్వాత మళ్లీ స్నానం చేసి వెళ్లిపోతారు. అంతేగానీ సేదతీరడానికి ఇతరులకు ఈ ప్రాంతం పూర్తి నిషిద్ధం. అలాంటిది ప్రాంగణంలో కూర్చునేందుకు వీలుగా షెల్టర్లు ఏర్పాటు చేయడంపై విమర్శలు వస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని