logo

ప్రభుత్వ మార్పుతోనే అభివృద్ధి, సంక్షేమం

కుల, మత, రాజకీయాలకు అతీతంగా ప్రజలు ప్రగతి, మంచితనానికి పట్టం కట్టాలని ప్రముఖ క్రికెటర్‌ అంబటి రాయుడు కోరారు.

Published : 10 May 2024 05:45 IST

క్రికెటర్‌ అంబటి రాయుడు

 మాట్లాడుతున్న రాయుడు, వేదికపై కొల్లు రవీంద్ర, బండి రామకృష్ణ

మచిలీపట్నం (కోనేరుసెంటరు), న్యూస్‌టుడే: కుల, మత, రాజకీయాలకు అతీతంగా ప్రజలు ప్రగతి, మంచితనానికి పట్టం కట్టాలని ప్రముఖ క్రికెటర్‌ అంబటి రాయుడు కోరారు. మచిలీపట్నం సువర్ణ కళ్యాణమండపంలో గురువారం యువత భవిత, ఉద్యోగ ఉపాధి అవకాశాలపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కేవలం ప్రభుత్వ మార్పుతోనే అభివృద్ధి, సంక్షేమాలు సాధ్యపడతాయన్న విషయాన్ని గుర్తెరగాలన్నారు. జగన్‌ పాలనలో చోటుచేసుకున్న పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కక్షసాధింపులో భాగంగా కోస్తా ప్రాంతాన్ని ఉద్దేశపూర్వకంగా వెనుకబాటులో ఉండేలా చేశారని విమర్శించారు. అందరిలా జగన్‌ను నమ్మి సీజన్‌ కూడా ఆడకుండా వైకాపాలో చేరి ఆయన నిజస్వరూపం తెలుకున్నట్లుచెప్పారు. తన ప్రాంతంలో ప్రజలకు ఎంతో అవసరమైన కేవలం కి.మీ. మేర పైపులైన్‌ పనులు చేసేందుకు పాలకులకు చేతులు రాలేదన్నారు. ఇప్పటికే యువత భవిష్యత్తును చీకటిమయం చేశారని, విజ్ఞతతో వ్యవహరించి తమతో పాటు రాష్ట్ర భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని కూటమి అభ్యర్థులకు అఖండ విజయం చేకూర్చాలని కోరారు. జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి బండి రామకృష్ణ, యువత, క్రికెట్‌ అభిమానులు పాల్గొన్నారు.

 రవీంద్రతో పాటు ప్రచారంలో..: ఉదయమే నగరానికి వచ్చిన రాయుడు మండల పరిధిలోని కోన, కేపీటీపాలెం గ్రామాల్లో కొల్లు రవీంద్రతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వస్తే అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ రవీంద్ర, వల్లభనేని బాలశౌరిలకు అఖండ మెజార్టీ చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు. ఆయనతో స్టార్‌ క్యాంపెయినర్‌గా ఉన్న సినీ హాస్య నటుడు అంబటి శ్రీనివాస్‌ సువర్ణ కళ్యాణమండపంలో మాట్లాడుతూ కూటమి అభ్యర్థులను గెలిపించాల్సిన ఆవశ్యకతను వివరించారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, మోదీల నాయకత్వంలో రాష్ట్రానికి సువర్ణ అధ్యాయం ప్రారంభమవుతుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని