logo

కూటమిదే పీఠం

జనసేనాని పవన్‌కల్యాణ్‌కు విజయవాడ నగరంలో అడుగడుగునా.. తెదేపా, జనసేన, భాజపా శ్రేణులు నీరాజనం పలికాయి. పవన్‌ రాకతో జిల్లాలోని ఎన్డీయే కూటమి శ్రేణుల్లో నూతనోత్సాహం వచ్చింది.

Published : 10 May 2024 05:41 IST

బెజవాడలో జనసేనాని రోడ్‌షో సూపర్‌ హిట్టు

తరలివచ్చిన యువత

ఈనాడు, డిజిటల్‌- అమరావతి: - న్యూస్‌టుడే, విజయవాడ వన్‌టౌన్‌: జనసేనాని పవన్‌కల్యాణ్‌కు విజయవాడ నగరంలో అడుగడుగునా.. తెదేపా, జనసేన, భాజపా శ్రేణులు నీరాజనం పలికాయి. పవన్‌ రాకతో జిల్లాలోని ఎన్డీయే కూటమి శ్రేణుల్లో నూతనోత్సాహం వచ్చింది. విజయవాడ తూర్పులోని ఇందిరాగాంధీ స్టేడియం వద్ద నుంచి గురువారం రాత్రి 7గంటలకు ఆరంభమైన రోడ్‌షో.. మధ్య నియోజకవర్గం మీదుగా పశ్చిమలోకి ప్రవేశించింది. పంజాసెంటర్‌ వరకు మూడున్నర కిలోమీటర్లు సాగిన యాత్రకు.. అడుగడుగునా అభిమానులు బ్రహ్మరథం పట్టారు. రెండు గంటలకు పైగా యాత్ర సాగింది. రోడ్‌షోకి మూడు నియోజకవర్గాల నుంచి తెదేపా, జనసేన, భాజపా శ్రేణులు భారీగా తరలివచ్చారు. దీంతో పవన్‌ పర్యటించిన దారులన్నీ కిక్కిరిశాయి. ఆయన పంజా సెంటర్‌కు చేరేంత వరకు దారిపొడవునా.. పూలుజల్లుతూ.. గజమాలలు వేస్తూ.. హారతులిస్తూ.. ఎర్రకండువాలు పైకెత్తి గిరగిరా తిప్పుతూ.. పార్టీ జెండాలు ఊపుతూ.. తమ అభిమానాన్ని చాటుకున్నారు. కూటమి విజయం తథ్యమని నినదించారు. పశ్చిమలోని పంజాసెంటర్‌ వద్ద భారీ బహిరంగ సభను నిర్వహించారు. సభావేదిక వద్దకు.. జనం తండోపతండాలుగా తరలివచ్చారు. పవన్‌ ప్రసంగం ప్రారంభించినప్పటి నుంచి ముగిసేంత వరకు.. శ్రేణులు ఈలలు, చప్పట్లతో మోత మోగించారు. పవన్‌ మాట్లాడిన మాటకూ.. ఉత్సాహంతో ఊగిపోయారు. ఎన్డీయే కూటమి విజయవాడ లోక్‌సభ అభ్యర్థి కేశినేని శివనాథ్‌ (చిన్ని), విజయవాడ పశ్చిమ, తూర్పు, మధ్య నియోజకవార్గాల అసెంబ్లీ అభ్యర్థులు సుజనాచౌదరి, గద్దె రామ్మోహన్‌, బొండా ఉమాను భారీ మెజార్టీతో గెలిపించాలని పవన్‌ తన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అసెంబ్లీలో సుజనా బలంగా మాట్లాడగలరనీ, కేంద్రంతో అతనికి చాలా సంబంధాలున్నాయని పవన్‌ పేర్కొన్నారు. వంగవీటి రాధా గొంతు చట్టసభల్లో వినిపించేలా చేసే బాధ్యత తనది అని.. పవన్‌ వెల్లడించడం గమనార్హం.

ఐక్యత చాటుతున్న పవన్‌కల్యాణ్‌, కేశినేని చిన్ని, జలీల్‌ఖాన్‌, సుజనాచౌదరి, గద్దె రామ్మోహన్‌

గులకరాయికే ఆస్కార్‌ స్థాయి నటన..

‘విజయవాడలో జగన్‌కు తగిలిన చిన్న గులకరాయి.. అలాగే వెళ్లిపోతూ.. పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెలంపల్లికి తగిలిందంట, ఒక కంటికి తగిలితే.. ఆయన మరో కంటికి ప్లాస్టర్‌ వేసుకుని.. చేసిన నటన మామూలుగా లేదు. సినిమా వాళ్లమైన మేం కూడా ఎందుకూ పనికిరాం. ఆస్కార్‌ స్థాయిలో ఆయన నటన చూసి నాకైతే నవ్వు ఆగలేదు.’ అని పవన్‌ ఎద్దేవా చేశారు. దీనికి సభలోని యువత ఈలలు, చప్పట్ల మోత మోగించారు.

వైకాపా గూండాల ఆట కట్టిస్తాం..

‘విజయవాడ నగరంలో కనీసం డ్రెయినేజీలను కూడా ఈ ఐదేళ్లలో జగన్‌, వైకాపా ప్రభుత్వం వేయలేకపోయింది. కానీ.. ఆ పార్టీ నేతల నోళ్లకు మాత్రం అడ్డూ అదుపూ లేకుండాపోయింది. నగరంలో వారి అరాచకాలు పెరిగిపోయాయి. ఐదేళ్లు రెచ్చిపోయి.. నడిరోడ్డుపైకి వచ్చి ఇళ్లలోని మహిళలను కూడా తీవ్రంగా దూషిస్తూ అవమానించారు. వీళ్లు చేసిన దానికి మూల్యం చెల్లించక తప్పదు. వైకాపా ఓడిపోతోందన్నది నిజం. ఇక మీ ఆటలు అయిపోయాయ్‌. మీకు ఎలా బుద్ధి చెప్పాలో మా కూటమి నేతలకు బాగా తెలుసు’ అని పవన్‌ హెచ్చరించారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని