logo

బతుకు బండిపై.. పెట్రో మంట!

ప్రగతి రథ చక్రానికి అత్యంత కీలకమైన ఇంధన ధరలు గత ఐదేళ్లలో భారీగా పెరిగాయి. 2019 జనవరిలో లీటరు పెట్రోలు రూ. 72.31 ఉండగా.. ఈ ఏడాది జనవరి నాటికి రూ. 109.31కు చేరుకుంది. అంటే రూ. 37 పెరిగిందన్నమాట

Updated : 10 May 2024 06:40 IST

ఐదేళ్లలో ఆకాశాన్ని తాకిన ధరలు

 రాష్ట్ర పన్నుల వాటా పెంచేసిన వైకాపా సర్కారు

ఈనాడు, అమరావతి: మన రాష్ట్రంతో పోలిస్తే పక్కనే ఉన్న తెలంగాణాలో పెట్రో ధరలు లీటరుకు రూ. 2 తక్కువ. అదే తమిళనాడులో అయితే లీటరుకు రూ. 8 తక్కువ...పక్కనున్న కర్ణాటకలోనూ బాగా తక్కువే... కారణం.. పెట్రో ధరల్లో వైకాపా ప్రభుత్వం రాష్ట్ర పనుల వాటా పెంచేయడమే. ప్రగతి రథ చక్రానికి అత్యంత కీలకమైన ఇంధన ధరలు గత ఐదేళ్లలో భారీగా పెరిగాయి. 2019 జనవరిలో లీటరు పెట్రోలు రూ. 72.31 ఉండగా.. ఈ ఏడాది జనవరి నాటికి రూ. 109.31కు చేరుకుంది. అంటే రూ. 37 పెరిగిందన్నమాట. అదే డీజిల్‌పైనా రూ. 29.88 పెరుగుదల కనిపించింది. పన్నులు, ఛార్జీలు, రుసుముల రూపంలో ప్రజలను బాదేయడమే పనిగా పెట్టుకున్న వైకాపా సర్కారు ఇంధనాన్నీ వదల్లేదు. కనీసం పక్క రాష్ట్రాల్లోని ధరలను చూసైనా ప్రజలపై కనికరం చూపలేదు. వాటితో పోలిస్తే మనరాష్ట్రంలో రూ. 2 నుంచి రూ. 10 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. సర్కారు నిర్వాకం కారణంగా ఇంధన వినియోగం తగ్గిపోయింది. వ్యాపారాలు సైతం మందగించాయి. అమరావతి నిర్మాణాన్ని ఆసరాగా తీసుకుని ఎంతోమంది రవాణారంగంలోకి అడుగుపెట్టారు. వీరందరూ వైకాపా ప్రభుత్వ తీరు కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నారు. మరోవైపు వైకాపా నాయకులు మాత్రం మట్టి, ఇసుక దందాలతో గిరాకీ పెంచుకున్నారు. పన్నులను తగ్గించే అవకాశం ఉన్నా.. వైకాపా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదనే విమర్శలున్నాయి.

  • తెలంగాణాలో ఇంధన ధరలు తక్కువగా ఉండడంతో సరిహద్దు ప్రాంతాల్లో బంకుల్లో ఏపీ వాహనదారులే కనిపిస్తున్నారు. తిరువూరు పక్కనే ఉన్న ముత్తగూడెంలోని బంకు నిత్యం ఏపీ వాహనాలతో రద్దీగా ఉంటోంది. హైదరాబాద్‌ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న బంకుల్లోనూ ఇదే పరిస్థితి.
  • ఉమ్మడి జిల్లాలో 2019లో పెట్రోలు వినియోగం రోజుకు 3,500 లీటర్లకు ఉండేది. అంటే నెలకు దాదాపు 105 కిలో లీటర్లు. 2019లో డీజిల్‌ వినియోగం రోజుకు 6,500 లీటర్లుగా ఉండేది. అంటే నెలకు దాదాపు 195 కిలోలీటర్లు. ప్రస్తుతం ఇదీ పడిపోయింది.
  • ఉపాధి మార్గాల్లేక వాహనాల వినియోగం గణనీయంగా తగ్గడంతోపాటు కొన్ని సీఎన్‌జీకి మళ్లడం కారణమని పెట్రోలు బంకుల యజమానులు చెబుతున్నారు.

ఖాళీగా రవాణా వాహనాలు

ఉపాధి కోసం లారీలు, ట్రాక్టర్లను కొన్నవారు గిరాకీల్లేని కారణంగా ఫైనాన్స్‌ కిస్తీలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. ఉదాహరణకు ఇబ్రహీంపట్నంలోని బూడిద రవాణా ఆధారంగా పలువురు లారీలను కొనుగోలు చేశారు. ఈ వ్యాపారం కొంతమంది నాయకుల చేతుల్లోకి వెళ్లాక పలువురు రోడ్డున పడ్డారు. రాజధాని నిర్మాణంలో నిత్యం కొన్ని వేల లారీలు తిరుగుతుండేవి. ప్రస్తుతం ఇవన్నీ పార్కింగ్‌కే పరిమితమయ్యాయి. చాలామంది తమ వాహనాలను ఇతర రాష్ట్రాల్లో విక్రయించుకున్నారని లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఈశ్వరరావు చెప్పారు. ఇంధన ధరలను పెంచేయడంతోపాటు వివిధ రకాల పన్నుల భారం మోపారన్నారు. రైతులు వినియోగించే ట్రాక్టర్లకు ఇంధన వ్యయం భారంగా మారింది.

వ్యాపారం పడిపోయింది...

గతంలో అమరావతి నిర్మాణంతోపాటు ఇతర అభివృద్ధి పనుల్లో భారీ యంత్రాలను వినియోగించేవారు. పోలవరం ప్రాజెక్టులోనూ పనులు జరుగుతుండేవి. ఇవన్నీ నిలిచిపోవటంతో ఇంధన వినియోగం తగ్గిపోయింది. గత ఐదేళ్లలో కొన్ని కొత్త బంకులు ఏర్పాటైనా.. వ్యాపారం తగ్గిపోయింది. డీలర్లకు ఇచ్చే కమీషన్‌ను ఆయిల్‌ కంపెనీలు తగ్గించాయి. దీనివల్ల నిర్వహణ కష్టంగా ఉంది. గతంలో నెలకు 30 లీటర్ల వరకు ఇంధనాన్ని వినియోగించినవారు ధరలు పెరగడంతో సగానికి తగ్గించుకున్నారు. వ్యక్తిగత వాహనాల వినియోగం కూడా తగ్గించారు. చాలామంది ప్రజారవాణాను ఆశ్రయిస్తున్నారు.
- నరసింహారావు, పెట్రోలు బంకు డీలర్ల అసోసియేషన్‌ అధ్యక్షుడు


రూ.10వేలు అదనపు భారం పడుతోంది

బెంగళూరు నుంచి పూలు తెప్పిస్తాం. 25 కిలోల బాక్సులు 70 వరకు ఒక లోడ్‌లో వస్తాయి. 2019లో కర్ణాటక నుంచి కిరాయి రూ.14,500లు ఉండేది. ఇప్పుడు అదే బండి కిరాయి రూ.25,000 అయింది. కిరాయిల రూపంలోనే దాదాపు రూ.10వేలు అదనపు భారం పడుతోంది. ఈ భారమంతా వినియోగదారుడిపైనే వేస్తాం. అందుకే దిగుమతి పూల ధరలు ఎక్కువగా ఉంటున్నాయి.
- రాము, హోల్‌సేల్‌ పూల వ్యాపారి


ఒకప్పుడు రూ.200లు కొట్టిస్తే ట్యాంకు నిండేది

ఒకప్పుడు రూ.200లు పెట్రోల్‌ కొట్టిస్తే యాక్టివా ట్యాంకు దాదాపుగా నిండేది. ఇప్పుడు సగం కూడా నిండటం లేదు. రెండు రోజులకే అయిపోతోంది. లీటరు రూ.59లు ఉన్నపుడు బండి కొన్నా.. ఇప్పుడు రూ.109లు అయింది. రెట్టింపు ధర పెరగడం చూస్తే.. చాలా బాధ కలుగుతోంది.
- రామారావు, ప్రైవేటు ఉద్యోగి

- న్యూస్‌టుడే, మధురానగర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని