logo

అర్జీల పరిష్కారంపై దృష్టి సారించండి

స్పందనలో వచ్చే అర్జీలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ రంజిత్‌బాషా  సూచించారు.

Published : 06 Dec 2022 06:02 IST

ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్‌, జేసీ, డీఆర్వో, ఆర్డీవో

కలెక్టరేట్‌(మచిలీపట్నం), న్యూస్‌టుడే: స్పందనలో వచ్చే అర్జీలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ రంజిత్‌బాషా  సూచించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా సోమవారం వివిధ విభాగాల జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చిన అర్జీలు సరిగా పరిష్కరించకుంటే రీఓపెన్‌ చేయాల్సిన అవసరం వస్తోందన్న విషయాన్ని గుర్తించాలన్నారు. అలా చేయాల్సి వస్తే అందుకు గల కారణాలను సంబంధిత అధికారి వివరణ ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించారు. గ్రామదర్శినిలో గుర్తించిన సమస్యలు, తనిఖీ నివేదికలను ఎప్పటికప్పుడు అప్‌లోడ్‌ చేయాలన్నారు. ప్రతి బుధవారం స్పందన, గ్రామదర్శిని కార్యక్రమాలపై సమీక్ష నిర్వహిస్తానని చెప్పారు. ఈ రెండు అంశాల్లో వచ్చే సమస్యలు పరిష్కరిస్తే దాదాపుగా ఫిర్యాదులు వచ్చే అవకాశం ఉండదని పేర్కొన్నారు. అన్ని శాఖలకు సంబంధించి స్పందనలో వస్తున్న అర్జీలను పరిశీలించి, ఏయే సమస్యలపై ఎక్కువగా వస్తున్నాయనే విషయం గుర్తించి నివేదిక ఇవ్వాలని జడ్పీ సీఈవోను ఆదేశించారు. రెవెన్యూకు సంబంధించి రీఓపెన్‌ అర్జీలపై తహసీల్దార్లకు శిక్షణ ఇవ్వాలని డీఆర్వోకు సూచించారు.  జేసీ అపరాజితసింగ్‌, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు, ఆర్డీవో ఐ.కిషోర్‌లు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.

వినతులు వెల్లువ: * పదిహేడేళ్ల కిందట జీఎన్‌ఎం కోర్సు పూర్తి చేసి కొవిడ్‌ సమయంలో తాత్కాలికంగా పనిచేశామని, ఇంటర్న్‌షిప్‌ లేని కారణంగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందలేకపోతున్నామని, తమకు న్యాయం చేయాలని కోరుతూ ప్రతిభ, భారతి, సుజాత తదితరులు వినతిపత్రం ఇచ్చారు.

* పెనమలూరుకు చెందిన సుధీర్‌ తమ గ్రామంలో రహదారిని ఆక్రమించి వ్యవసాయ భూమిలో కలిపేశారని, విచారించి ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని కోరారు.

*  బోయ కులస్థులతో పాటు ఇతర కులాలకు చెందిన వారిని ఎస్టీల్లో చేర్పించే ప్రయత్నాలు విరమించుకోవాలని జిల్లా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఎస్టీ నాయకులు వినతిపత్రం సమర్పించారు. వివిధ వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోరుతూ వేర్వేరు ప్రాంతాలకు చెందిన పలువురు అర్జీలు సమర్పించారు.

లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయాలి: టిడ్కో గృహ లబ్ధిదారులకు రుణాల మంజూరును వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ రంజిత్‌బాషా బ్యాంకు అధికారులను కోరారు. కలెక్టర్‌ బంగ్లా నుంచి టెలికాన్ఫరెన్స్‌లో బ్యాంకు అధికారులు, కోఆర్డినేటర్లతో టిడ్కో గృహ ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. గుడివాడలో ముఖ్యమంత్రి చేతుల మీదగా గృహాలను అందించే కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని తగు చర్యలు చేపట్టాలని సూచించారు. ఇప్పటి వరకూ 4,828 మంది లబ్ధిదారులకు రుణాలు ఇవ్వడంతో పాటు గృహాలకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తిచేయడం ప్రశంసనీయమన్నారు. ఈనెల 10 లోపు మిగిలిన వారికి అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మెప్మా పీడీ విశాలాక్షి, జిల్లా రిజిస్ట్రార్‌ ఉపేంద్రరావు, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ సాయిరాం, తదితర అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని