logo

ఇదేం లెక్క..?

బాపులపాడు మండలం తిప్పనగుంట గ్రామానికి చెందిన రైతు మొవ్వ వెంకటేశ్వరరావు 30 ఎకరాల్లో స్వర్ణ రకం వరి సాగు చేశారు.

Published : 07 Dec 2022 03:36 IST

దిగుబడి 45.. కొనుగోలు 34 బస్తాలే..!

అన్నదాతలకు నిబంధనాలు

ఈనాడు, అమరావతి

బాపులపాడు మండలం తిప్పనగుంట గ్రామానికి చెందిన రైతు మొవ్వ వెంకటేశ్వరరావు 30 ఎకరాల్లో స్వర్ణ రకం వరి సాగు చేశారు. 10 ఎకరాలు కోత కోసి నూర్పిడి చేశారు. ఎకరానికి సగటున 45 బస్తాల ధాన్యం దిగుబడి రానుంది. ఆర్‌బీకే లో సంప్రదిస్తే.. ఎకరానికి 26 క్వింటాళ్ల చొప్పున(34 బస్తాలు) కొనుగోలు చేస్తామని చెప్పారు. ఈ క్రాప్‌ నమోదు ప్రకారం ఎకరానికి అంతే దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఎక్కువ దిగుబడి వస్తే.. తమకు  సంబంధం లేదని చెబుతున్నారు. 30 ఎకరాలకు ఎకరానికి 11 బస్తాల చొప్పున అదనంగా 330 బస్తాలు ధాన్యం మిగిలిపోతోంది. దీన్ని ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకే విక్రయించాల్సి వస్తోందని రైతు వాపోతున్నారు.

కానుమోలు గ్రామానికి చెందిన జి.ఉమామహేశ్వరరావు 35 ఎకరాల్లో సాధారణ రకం వరి సాగు చేశారు. ఆయన 13 ఎకరాల ధాన్యం కల్లాల్లో ఆరబోశారు. 40 నుంచి 42 బస్తాల వరకు దిగుబడి రానుంది. ప్రభుత్వం 34 బస్తాల చొప్పున మాత్రమే కొనుగోలు చేయనుంది. మిగిలిన ధాన్యం వేరే సర్వే నెంబరుతో ఇతర రైతుల పేరుమీద విక్రయించాలి. లేదా ప్రైవేటు వ్యాపారులకు అమ్మాల్సిన పరిస్థితి.

కొనబోతే కొరివి.. అమ్మబోతే అడవి.. అన్నట్లు ధాన్యం రైతుల పరిస్థితి తయారైంది. ప్రభుత్వం రకరకాల నిబంధనలు రైతులకు కాళ్ల సంకెళ్లుగా మారాయి. వ్యాపారులు కొనుగోలు చేయక ఇటు ప్రభుత్వం సక్రమంగా సేకరించలేక అన్నదాతలను అవస్థలకు గురి చేస్తున్నారు. ఈ ఏడాది ధాన్యం దిగుబడులు పెరిగాయి. ఎన్టీఆర్‌ జిల్లాలో సగటున 40 బస్తాలు(75 కేజీల చొప్పున), కృష్ణా జిల్లాలో 45 బస్తాల చొప్పున దిగుబడులు వస్తున్నాయి. అధికారులు మాత్రం ఎకరానికి 34 బస్తాల దిగుబడి నిర్ణయించారు. ఏ లెక్కన ఈ అంచనా వేశారో తెలియదు. దీంతో ఆర్‌బీకేల్లో ఎకరానికి 34 బస్తాల చొప్పునే కొనుగోలు చేసేందుకు అనుమతి ఉంది. 5 ఎకరాల విస్తీర్ణం ఉంటే 170 బస్తాలు మాత్రమే ఆన్‌లైన్‌లో నమోదుకు అనుమతి ఉంది. అంతకంటే ఎక్కువుంటే తీసుకోదు. తక్కువ ఉంటే ఫరవాలేదు. ఈ నిబంధనలతో రైతుల వద్ద భారీగా ధాన్యం మిగిలిపోనుంది. దీంతో ప్రైవేటు వ్యాపారులే మళ్లీ దిక్కవుతున్నారు. తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన దుస్థితి.  
మరోవైపు తుపాను హెచ్చరికలతో రైతుల్లో ఆందోళన నెలకొంది.  

ఆర్‌బీకేలలో ధాన్యం తేమశాతం 17 శాతం ఉండాల్సిందేనని నిబంధన విధిస్తున్నారు. తీరా ఆరబెట్టి విక్రయించిన ధాన్యం మిల్లులకు కేటాయించిన తర్వాత తేమ శాతం ఎక్కువ ఉందని సమాచారం ఇస్తున్నారు. 19 శాతం నుంచి 20 శాతం ఉంటుందని, ఆ మేరకు తరుగు తీస్తున్నామని చెబుతున్నారు. రైతులు అంగీకరించకపోతే.. ధాన్యం వెనక్కి పంపుతామని మిల్లర్లు హెచ్చరిస్తున్నారు.

ఒకసారి ఆర్‌బీకే అధికారులు తేమ శాతం పరిశీలించి పరీక్షించిన తర్వాత తేడా వస్తే రైతుకు సంబంధం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. 75 కేజీల బస్తాకు.. సంచి బరువు కిలో, తరుగు 2 కిలోల చొప్పున 3 కిలోల ధాన్యం మినహాయిస్తున్నారు.  

పెద్ద రైతులు తమ ధాన్యం తప్పని పరిస్థితుల్లో ప్రైవేటు వ్యాపారులకు విక్రయించాల్సిన పరిస్థితి. కొన్ని చోట్ల ఈ క్రాప్‌లో వరిగా నమోదు చేసిన బంజర్లను చూపించి విక్రయాల్లో అక్రమాలకు తెరలేపుతున్నారు. ఎక్కువ శాతం కౌలు రైతులు ఈ దిగుబడి నిబంధనలతో నష్టపోవాల్సిన పరిస్థితి వస్తోంది.


వాస్తవ లెక్కలు తీయాలి..

జములయ్య, అధ్యక్షుడు, కౌలు రైతుల సంఘం

అధికారులు ఏ లెక్కన దిగుబడి అంచనా వేశారో తెలియడం లేదు. డెల్టా పరిధిలో 45 బస్తాల దిగుబడి వస్తోంది. మెట్టప్రాంతంలో 40 బస్తాలు తక్కువ కాకుండా ఉంది. కానీ ఎకరానికి 34 బస్తాలే కొంటామని చెప్పడం దారుణం. ఎంత పండితే.. అంత కొనుగోలు చేయాలి. గ్రామాల్లో వాలంటీర్‌ వ్యవస్థ ఉంది. ఎంత దిగుబడి వస్తుందో లెక్కలు తీయాలి. రైతులను ఇబ్బందులకు గురి చేయడం సరికాదు. ఈక్రాప్‌లో దిగుబడి అంచనా మార్చి కనీసం 40 బస్తాలు కొనుగోలు చేయాలి. తేమ శాతం కూడా సడలించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని